ఎన్నికల తాయిలాల కాలం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే చరిత్ర సృష్టించబోతోంది. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు అనేది పాత సామెత. కాలు కదపకుండా గడప దిగకుండా కావాల్సిన సరంజామా సమకూర్చడమే నేటి రాజకీయం. బలాబలాల్లో సమ ఉజ్జీలుగా నిలుస్తున్న తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు వరాల వర్షం కురిపించేందుకు పోటీలు పడుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉచితానుచితాలు, భవిష్యత్తు అవసరాలను పణంగా పెట్టి రాజకీయాధికారమే లక్ష్యంగా చంద్రబాబు, జగన్ లు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలు నూతన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్థిక దిగ్బంధంలో ఇరికించి రాష్ట్ర భవిష్యత్తును అయోమయంలోకి తోసి వేసేందుకు నాయకులిద్దరూ సై అంటున్నారు. రెండు లక్షల కోట్ల రూపాయల పైచిలుకుకు చేరిన అప్పు ఒకవైపు ఉరిమి చూస్తుంటే ఏడాదికి లక్ష కోట్ల రూపాయల పైచిలుకు వ్యయమయ్యే హామీలు మరోవైపు నేతల మాటల్లో తొంగి చూస్తున్నాయి.
18 ఏళ్లకే నిరుద్యోగ భత్యం...
ఓటు హక్కు వస్తే చాలు . మా గూటిలో పడాల్సిందే. ఎన్నికల్లో తలపడే అభ్యర్థులు జేబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టడమెందుకు? ప్రభుత్వ ఖజానానే ఉచితంగా పంచిపెట్టి పార్టీకి లబ్ధి చేకూర్చుకుంటే సరిపోతుంది కదా? ఇదే తెలుగుదేశం ప్లాన్. 18 సంవత్సరాలంటే టీనేజీ వయసు. కౌమారం. అప్పుడే ఓటు హక్కు లభిస్తుంది. ఈ వయసులోని వారిలో ఎక్కువ మంది ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉంటారు. ముప్ఫై ఏళ్ల క్రితానికి వెళితే కనీసం ఈ వయసుకు ఓటు హక్కు కూడా లేదు. వారినందరినీ నిరుద్యోగులను చేసి భృతి కల్పించాలనే బృహత్తర పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోందట. ఎన్ని లక్షల అంకె తేలుతుందో తెలియదు. ఎన్ని వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందో అంతుచిక్కదు. ఈ వయసులో పిల్లలు చాలావరకూ చిన్నాచితక ఖర్చులకు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. అమ్మానాన్న ఏ అవసరానికి ఎంత ఖర్చవుతుందో లెక్కించి డబ్బులు ఇస్తారు. వాటిని పోకెట్ మనీ అని పిలుచుకుంటుంటారు. ఇప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది కాబట్టి. బీరు పార్టీలు, బిర్యానీలు తినడానికి ఇబ్బందేమీ ఉండదు. తామెలాగూ నిరుద్యోగులమని ప్రభుత్వమే ముద్ర వేసేసింది కాబట్టి ఉద్యోగం కోసం కష్టపడి చదవాల్సిన శ్రమ కూడా ఎందుకని మధ్యతరగతి, పేద వర్గాల పిల్లలు భావిస్తే తప్పేం లేదు. కనీస విద్యాప్రమాణాలు లేకపోయినా ఇంజినీరింగులో సీట్లు ఇప్పించి పీజులు రీయంబర్స్ చేస్తూ ఇప్పటికే సాంకేతిక , వృత్తి విద్యలను అపహాస్యం పాలు చేసిన ఘనతను సర్కారు మూట కట్టుకుంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకంలో చదువుకున్న వందమందిలో పదిమంది కూడా ఇంజినీర్లుగా పనికి రారని ప్రామాణిక సంస్థలు తేల్చి పారేస్తున్నాయి. దీనికి సిగ్గు పడటం మానేసి కొత్త చిట్కాలను కనిపెడుతున్నాయి ప్రభుత్వాలు. నిజానికి నిరుద్యోగులకు మేలు చేయాలనే భావన ప్రభుత్వానికి ఉంటే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, వృత్తి విద్యల్లో అప్రంటిష్ షిప్ అవకాశాలు కల్పించడం, ఇంటర్మీడియట్ స్థాయి నుంచే వొకేషనల్ కోర్సును తప్పనిసరి చేయడం వంటివి చేస్తే రాష్ట్రానికి మేలు కలుగుతుంది. విద్యాభ్యాసం పూర్తి చేసి బయటపడే సమయానికి అన్ని విధాలా ఉద్యోగానికి అర్హత సాధించగలుగుతారు. కూర్చోబెట్టి సోమరిపోతులను తయారు చేసే యంత్రాంగంగా ప్రభుత్వం మారడం పక్కా ఓటు బ్యాంకు రాజకీయమే.
పనే దొరకడం లేదా?
పార్టు టైమ్ ఉద్యోగాలనుంచి చిన్నాచితక పనుల వరకూ ఏదో రకంగా ఉపాధి పొందడానికి దేశంలో ఇప్పుడున్నన్ని అవకాశాలు గతంలో ఎన్నడూ లేవు. పేపర్ బోయ్ పని మొదలు, పాలప్యాకెట్ల పంపిణీ, మొబైల్ బుకింగులు, రిటైల్ మార్కెటింగు, అవుట్ సోర్సింగు పనుల వంటివి తమకు ఖాళీ సమయాల్లో పనిచేస్తూ ఉపాధి పొందేందుకు , విద్యాభ్యాసం కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రభుత్వం కల్పించే నిరుద్యోగ భృతికంటే అక్కడ లభించే వేతనం ఎక్కువే ఉంటుంది. పేదరికంలో మగ్గిన అబ్దుల్ కలాం వంటి వారు సొంత శ్రమతో ఏరకంగా పైకొచ్చారో ప్రభుత్వానికి తెలియదనుకోవాలా? నిజానికి తల్లిదండ్రులు చేస్తున్న వృత్తి, వ్యాపారాల్లో చాలామంది పిల్లలు భాగస్వామ్యం వహిస్తూ ఉంటారు. కానీ సంస్థ తమ పేరుమీద ఉండదు. వీరందర్నీ కూడా నిరుద్యోగులుగా భావించి డబ్బులు పంచి పెడతారేమో చూడాలి. కష్టించి పైకి రావాలనుకున్న వారికి ఊతమివ్వాలి. ఉపాధి మార్గం చూపించాలే తప్ప ప్రజాధనంతో అనుచిత కార్యక్రమాలకు పూనుకోకూడదు. ‘నేను చేపలు పట్టి ఇవ్వను. ఎలా పట్టాలో నీకు నేర్పుతాను‘ అన్న చైనా సామెతను ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తు చేసుకోవడం మంచిది.
45 ఏళ్లకే పింఛను ...
తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ దొందూ దొందే అన్నందుకు నిదర్శనం జగన్ తాజా ప్రకటన. 45 ఏళ్లకే వృద్ధాప్య పింఛను ఇచ్చేస్తానంటున్నారాయన. ఇది మధ్య వయసు. ఇటీవలి కాలంలో పెరిగిన జీవనప్రమాణాలు. వివాహాలు ఆలస్యం కావడంతో చాలామంది ఈ వయసులోనే పిల్లల్ని కూడా కంటున్నారు. ఆ వయసుకే పింఛను ఇచ్చి ముసలి వాడిని చేసి మూలన కూర్చోబెట్టాలన్న జగన్ ఆలోచన ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని అవస్థలు తెచ్చిపెడుతుందో?. ఎన్నికలకు వెళ్లేందుకు వై.సి.పి. సిద్ధం చేసుకున్న నవరత్నాల పథకాన్ని అమలు చేయాలంటే కనీసంగా పది లక్షల కోట్ల రూపాయలు అవసరమని అంచనా. అయినా వెనకడుగు వేసేదే లేదంటూ ఈ పథకాన్నే ప్రజల్లో ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు జగన్. తాజాగా దేశంలో ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులిచ్చేస్తామంటున్నారు. ఇది మరింత ప్రమాదకరం. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ సొమ్ముకు ఆశపడి అవసరమున్నా లేకున్నా అనవసర పరీక్షలు, ఆపరేషన్లు చేస్తున్నారనే అభియోగాలున్నాయి. ఇది దేశవ్యాప్త స్కామ్ గా మారేందుకు వై.సి.పి. వీలు కల్పిస్తుందన్నమాట. కేవలం రాజకీయ లబ్ధి మాత్రమే పరమార్థంగా పార్టీలు బరితెగించి వాగ్దానాలు చేస్తే రాష్ట్రం అథోగతి పాలవుతుంది. ఎన్నికల సంఘం స్థాయిలో అయినా ఇందుకు చెక్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రజలకు పౌష్ఠికాహారం అందడం లేదు. కాలు కదపకుండా ఇంటింటికీ మేమే వండి పంపించేస్తామంటూ రాజకీయ పార్టీలు భవిష్యత్తులో వాగ్దానం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
-ఎడిటోరియల్ డెస్క్