రీజనల్ పార్టీలు మోడీకి చెక్ పెట్టేస్తున్నాయా?

Update: 2017-12-02 15:30 GMT

దక్షిణాదిన విస్తరించాలని బలమైన కాంక్షతో ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతాపార్టీకి చెక్ పెట్టేందుకు కుల,మత రిజర్వేషన్లను పైకి తెచ్చే ప్రయత్నాల్లో పడ్డాయి ప్రాంతీయ పార్టీలు. ఇందుకోసం అవసరమైతే ఒక జట్టు కట్టి బీజేపీని బద్నాం చేయడం ద్వారా తమ రాష్ట్రాల్లో కమల వికాసం జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి అడుగు వేశారు. ముస్లిం రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంటూ ఆయన తొలి పల్లవి అందుకున్నారు. కేంద్రానికి లింకు పెట్టి పార్లమెంటులో దీనిని ఆమోదించే బాధ్యత మీదే అంటూ పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులకు బీసీల కోటాలో అయిదు శాతం రిజర్వేషన్లు ఇస్తాము. దీనిని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చండి అంటూ కేంద్రం పైకి రాజకీయాస్త్రాన్ని ప్రయోగించింది. అటు తమిళనాడులో డీఎంకే మద్దతు, ఇటు కర్ణాటకలో జేడీఎస్ మద్దతు కూడగట్టేందుకు కూడా టీడీపీ, టీఆర్ఎస్ లు ప్రయత్నాలు కూడా ప్రారంభించాయి. డీఎంకే అగ్రనేత స్టాలిన్ కేసీఆర్ నిర్ణయానికి ఇప్పటికే మద్దతు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్నీ డీఎంకే సమర్థించే అవకాశాలే ఉన్నాయి. దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ కూడా ఇందుకు వ్యతిరేకం కాదు. పైకి సామాజిక న్యాయం అన్న సూత్రం కనిపించినప్పటికీ బీజేపీకి చిక్కులు కల్పించడం , రాజకీయ అజెండాతో తమ రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణను నిరోధించడం లక్ష్యంగా ఈ నాయకులు అనధికార ఫ్రంట్ గా పనిచేసే అవకాశాలున్నాయనేది రాజకీయ వర్గాల అంచనా.

చంద్రబాబు నాయుడి చేతికి చక్రం?

రెండు దశాబ్దాల క్రితం యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన అనుభవం చంద్రబాబు నాయుడికి ఉంది. దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీల అగ్రనేతలతో వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా ఉంది. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా పరాజయాల పాలు కావడం తో ఆయన ప్రాభవం కొంత మసకబారింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రసమస్యలు, కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడటంతో రాజకీయంగా చక్రం తిప్పే అవకాశం ఆయనకు లభించలేదు. 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయంగా ఒక ప్రత్యామ్నాయ శక్తి కోసం వివిధ రాజకీయ పక్షాలు అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ పక్షాల్లో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెసు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇంకా పుంజుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు. నోట్లరద్దు, జీఎస్టీ వంటి ఎన్ని సంస్కరణలు చేపట్టినా ఇంకా మోడీ తీవ్రమైన ప్రజావ్యతిరేకతను చవిచూడటం లేదు. నిజానికి ఇప్పుడు కాంగ్రెసు పార్టీ కూడా ఒక పెద్ద సైజు ప్రాంతీయ పార్టీగా కుదించుకుపోయింది. దీంతో దక్షిణాదిన బలంగా పాగా వేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. దీనిని ఎదుర్కొని జాతీయంగా తమ అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే ఒక కూటమిగా ఏర్పడక తప్పని పరిస్థితి ప్రధాన ప్రాంతీయ పార్టీలకు ఏర్పడింది. మమతా బెనర్జీ మొదలు దేవెగౌడ వరకూ చంద్రబాబుకు మంచి పరిచయాలే ఉన్నాయి. డీఎంకే నేతలూ బాబుకు సన్నిహితులే. రాజకీయావసరాల కోసం కేసీఆర్ కూడా కలిసి వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. మరో అయిదారు నెలల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కిన తర్వాత చంద్రబాబు, ఇతర ప్రాంతీ య పార్టీల నేతలు కలిసి కట్టుగా సొంత అజెండాను చేపట్టే సూచనలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వేదిక ప్రధానోద్దేశం బీజేపీ ప్రాబల్యాన్ని అడ్డుకోవడమే.

ఇద్దరిదీ అదే బాట...

భారతీయ జనతాపార్టీకి జాతీయంగా ప్రధాన సమస్య రిజర్వేషన్ల అంశమే. రాజస్థాన్ లో గుజ్జార్లు, హర్యానాలో జాట్లు, గుజరాత్ లో పటేదార్లు రిజర్వేషన్ల ఉద్యమాన్ని చేపడుతూ అక్కడ పాలకపక్షమైన బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించి ఉండకూడదని సుప్రీం నిర్దేశించిన నేపథ్యంలో పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. గతంలో రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చడం ద్వారా తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తున్నారు. కానీ అది జరిగి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పుడు తొమ్మిదో షెడ్యూలును సైతం న్యాయసమీక్ష పరిధిలోకి తీసుకుంటామని సుప్రీం కోర్టు చెబుతోంది. అందువల్ల రిజర్వేషన్లు పెంచాలంటే కచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. పాలకపక్షమైన బీజేపీయే ఇందుకు చొరవ చూపాలి. రాష్ట్రంలో తమకు రాజకీయంగా విషమంగా మారిన సమస్యలను, భవిష్యత్తులో ప్రయోజనాలు చేకూరుస్తుందని భావించిన అమలు కాని అంశాలను తెలివిగా రాష్ట్రప్రభుత్వాలు కేంద్రం తలకు చుట్టేస్తున్నాయి. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ విషయంలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు, మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు కేసీఆర్. అలాగే తాను ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చిన కాపురిజర్వేషన్ల పై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతో అయిపోయిందనిపించుకుంటున్నారు చంద్రబాబు. పార్లమెంటులో రాజ్యాంగాన్ని సవరించి అమలు చేయించే బాధ్యత కేంద్రానిదే అని ఈ ఇరువురు ముఖ్యమంత్రులూ తేల్చి చెప్పేస్తున్నారు. అవసరమైతే దీనికోసం కేంద్రంపై రాజకీయ ఒత్తిడి పెంచుతామంటున్నారు. ఇదే అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూ అసలు రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా రిజర్వేషన్లు ఇచ్చుకునే అధికారాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలని కూడా కేసీఆర్ డిమాండు చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావించే ప్రాంతీయ పార్టీలు కచ్చితంగా ఈ పాయింట్ వద్ద ఏకం కావడానికి అవకాశాలున్నాయి. సో రిజర్వేషన్ల ప్లాట్ ఫామ్ బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రాంతీయ వేదిక నిర్మాణానికి దోహదం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News