రాహుల్... వాట్ ఏ ఛేంజ్...!

Update: 2017-12-01 16:30 GMT

భారత రాజకీయాల్లో కాంగ్రెస్ కు విశిష్ట స్థానం ఉంది. వందేళ్లకు పైగా చరిత్రగల ఈ పార్టీకి ఉదార ప్రజాస్వామ్య పార్టీగా పేరుంది. అన్ని వర్గాలనూ సమాదరిస్తుందన్న అభిప్రాయం ఉంది. స్వాతంత్ర్యానంతరం పార్టీని నడిపిన గాంధీ కుటుంబం సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ పార్టీ నిర్వహణలో మాత్రం ముద్ర పడకుండా జాగ్రత్త పడుతూ వస్తోంది. అదే సమయంలో బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలనున అక్కున చేర్చుకుంటూ వస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ ముస్లింలను బుజ్జగిస్తున్తుందన్న విమర్శలను గత కొంతకాలంగా ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో ఈ ప్రభావం కనపడిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ అభిప్రాయాన్ని పార్టీ ూడా పరిగణనలోకి తీసుకున్నట్లే కనపడుతోంది. గత కొంత కాలంగా పార్టీ వైఖరిని గమనిస్తే ఈ అభిప్రాయం కలగక మానదు ఎవరికైనా.

వారిని పక్కన పెడుతూనే....

ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోరులో హస్తం పార్టీ ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. పరిధికి మించిన, అవసరానికి మించిన ఉదారవాదం వల్ల మెజారిటీ ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం కలుగుతుందని, మారుతున్న పరిస్థితుల్లో ఈ ధోరణి సరైంది కాన్న వాదన పార్టీలో విన్పిస్తుంది. ఈ నెల9న జరగనున్న గుజరాత్ మొదటి దశ ఎన్నికల ముమ్మరంగా పాల్గొంటున్న పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కువగా ముస్లింల గురించి ప్రస్తావించడం లేదు. 182 స్థానాలకు గాను సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని 89 స్థానాలకు మొదటి దశ పోలింగ్ ఈ నెల 9వ తేదీన జరగనుంది. 2002, 2007, 2012 ఎన్నికల్లో ముస్లింల సమస్యల గురించి అతిగా ప్రస్తావించడం వల్ల మెజారిటీ ప్రజలు దూరమై రాజకీయంగా నష్టపోయామని అంతర్గత సమావేశాల్లో పార్టీ సీనియర్లు విశ్లేషణలు చేశారు. 2002 నాటి గోద్రా అల్లర్లు తదనంతర పరిణామాల గురించి అదే పనిగా ప్రస్తావించడం వల్ల లాభం కన్నా ఎక్కువ నష్టం జరిగిందని పార్టీ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఈ ప్రభావం అప్పటి ఎన్నికల్లో స్పష్టంగా కనపడుతోంది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 9.6 శాతం ఉంటారని అంచనా. 20 నియోజకవర్గాల్లో వారు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. సుమారు 66 నియోజకవర్గాల్లో వీరి ఉనికి ఎంతో కొంత ఉంది. అలా అని పార్టీ వారిని పూరత్ిగా విస్మరించడం లేదు. తాము ప్రచారం చేసినా, చేయకపోయినా వారుతమకే ఓటు వేస్తారన్న ధీమాతో ఆ పార్టీ ఉంది.

గత ఎన్నికల ఫలితాలను....

ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ ఒక్క ముస్లింకుకూడా టిక్కెట్ ఇవ్వలేదు. అదే సమయంలో కాంగ్రెస్ ఆరు స్థానాలను వారికి కేటాయించింది. 1990లో 11 మంది ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వగా వారిలో ముగ్గురే గెలిచారు. 2012లో అయిదుగురు ముస్లింలకు టిక్కెట్లు ఇస్తే... అందులో ఇద్దరు విజయం సాధించారు. ప్రస్తుతం గుజరాత్ నుంచి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం. ముస్లింలు ఎటూ తమకు మద్దతిస్తారన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ ఇతర సామాజిక వర్గాలపై దృష్టి సారించింది. పాటీదార్ల వర్గానికి చెందిన హార్థిక్ పటేల్, దళిత నాయకుడు జిగ్నేశ్ మెవాని, ఓబీసీ ల నేత అల్ఫేశ్ ఠాకూర్ లను అక్కున చేర్చుకుంది. వీరితో పాటుగా ప్రభుత్వ వ్యతిరేకత, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు తమకు మేలు చేకూరుస్తాయన్న ఆశాభావంతో కాంగ్రెస్ ఉంది.

ఆలయాలను వదలని రాహుల్...

ముస్లింల గురించి పెద్దగా ప్రస్తావించని పార్టీ అదే సమయంలో వ్యూహాత్మకంగా హిందుత్వకు మద్దతు ఇస్తున్న సంకేతాలు పంపుతోంది. యువరాజు రాహుల్ గాంధీ తన పర్యటనల్లో అదేపనిగా గుళ్లూ,గోపురాలను సందర్శిస్తున్నారు. పీఠాధిపతులకు ప్రణమిల్లుతున్నారు. చిన్నా చితకా ఆలయాలను కూడా రాహుల్ వదిలిపెట్టడం లేదు. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్మైన సోమ్ నాథ్ దేవాలయాన్ని, హిందువుల పుణ్యక్షేత్రమైన ద్వారకను సందర్శించి పూజలు చేశారు. గత రెండు నెలల్లో దాదాపు 20 ఆలయాలను రాహుల్ సందర్శించినట్లు అంచనా. బీజేపీ ప్రవచిత హిందుత్వకు తాము వ్యతిరేకం కాదని, మతతత్వానికే వ్యతిరేకమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేందుకే రాహుల్ ఆలయాల సందర్శన వెనక గల అసలు రహస్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయకపోతే హిందుత్వను బీజేపీ తమదేనని ప్రచారం చేసుకునే అవకాశం ఉందని, దానిని తిప్పి కొట్టేందుకు ఉదారవాద హిందుత్వ విధానాన్ని ప్రజల్లోకి తీసుకు వెళుతున్నామనిచెబుతున్నారు. పది శాతం ముస్లిం మైనారిటీ ఓట్లను కాపాడుకుంటూనే 90 శాతం మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవిస్తే ఎన్నికల్లో తిరుగుండదని హస్తం పార్టీ అంచనా. ఆ దిశగానే పార్టీకి కాబోయే అధినేత ఆశాభావంతో అడుగులు వేస్తున్నారు. ఈ వ్యూహం ఎంతవరకూ ఫలితాలను అందించగలదో చూడాలి....!

 

-గుజరాత్ నుంచి ‘తెలుగు పోస్ట్’ ప్రత్యేక ప్రతినిధి

Similar News