రాజకీయాల్లో హత్యలుండవ్...!

Update: 2018-02-05 15:30 GMT

‘రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే తప్ప ’ అనేది చాలా కాలం నుంచి ప్రచారంలో ఉన్న నానుడి. తాము చేసే తప్పులు , పొరపాట్లు, విధానపరమైన నిర్ణయాల్లో లోపాలు, సకాలంలో స్పందించకపోవడం, సందర్భోచితంగా వ్యవహరించకపోవడం వంటివన్నీ శాపాలై ఆయా పార్టీలను , అధినేతలను వెన్నాడతాయి. ప్రత్యర్థి చేసే చేటు కంటే తాము తెచ్చిపెట్టుకునే ఇబ్బందులే ఇరకాటంలోకి నెట్టేస్తుంటాయి. గెలుపోటములను శాసిస్తుంటాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ముగ్గురు అగ్రనేతల వైఖరి మళ్లీ ఈ సామెతను గుర్తుకు తెస్తోంది. కేంద్రం అంటే సర్వం సహా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ధోరణి జాతీయ స్థాయిలో చర్చనీయమవుతోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని ఆవిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ల మౌనముద్ర కూడా ప్రశ్నార్థకమవుతోంది. బడ్జెట్ పై పార్టీల అగ్రనాయకులుగా తామేం చెప్పదలచుకున్నామో ఇంతవరకూ వారు బహిరంగపరచకపోవడం టీడీపీకి కలిసొచ్చే అంశంగా మారింది. చంద్రబాబు నాయుడిని ఢీకొట్టాలని చూస్తున్న జగన్ ఈవిషయంలో నోరు విప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2018-19 బడ్జెట్ ఏపీకి అన్యాయం చేసిందని కేంద్రంలో, రాష్ట్రంలో సంకీర్ణ భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పొత్తుకు దూరమవుతామనే స్థాయిలో హెచ్చరిస్తున్నారు. పొలిటికల్ స్టాండ్ తీసుకునేందుకు వెయిట్ అండ్ వాచ్ పద్ధతి అనుసరిస్తున్నారు. మరి విపక్షంలోని జగన్ దీనిని అందిపుచ్చుకోకపోవడమే తాజాగా చర్చకు దారి తీస్తోంది.

‘న.మో’పై నారాజ్ ....

ఎన్నికల సంవత్సరం సంక్షేమాన్ని,అభివృద్ధిని బ్యాలెన్సు చేసుకుంటూ ఓటింగుకు వెళతారని బీజేపీలో సీనియర్ నేతలు, ఎంపీలు చాలా ఆశించారు. కానీ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లనే ధోరణిని అనుసరించే మోడీ మాత్రం తన పద్ధతిలోనే బడ్జెట్ గైడెన్సు ఇచ్చేశారు. జైట్లీ సమర్పించేశారు. అందని ద్రాక్షపండ్ల వంటి ఆయుష్మాన్ భారత్ స్కీము, ఎలా చేస్తారో విధివిధానాలు లేకుండా ఉత్పత్తిపై ఒకటిన్నర రెట్లు రైతు ఆదాయం వంటి పథకాలే సంక్షేమ పద్దుకింద చూసుకోమని ఘనంగా ప్రకటించారు. ఇవి అమలయ్యేది లేదు. ఓట్ల వర్షం కురిపించేది కూడా లేదు. అందుకే బీజేపీ నేతల్లో నిస్సత్తువ, నీరసం ఆవరించింది. నరేంద్రమోడీ నిజాయతీ కారణంగా నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు ఎంతగా బాధించినా ప్రజలు ఓర్చుకున్నారు. ఎన్నికల ఏడాది కూడా అదే బాదుడు కనిపించేలా మధ్యతరగతిని కరుణించలేదు. ఆదాయపన్ను స్లాబులు మార్చలేదు. వినియోగదారుల సామగ్రిపై పన్నుల తగ్గింపునకు చర్యలు తీసుకోలేదు. మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల డిమాండ్లనూ పట్టించుకోలేదు. అలాగని సొంత రాష్ట్రాలకూ ఒరగబెట్టిందేమీ లేదు. దీంతో నరేంద్రమోడీపై ఇంటాబయటా తీవ్రస్థాయిలోనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికలలో దీని పర్యవసనాలు ఏరకంగా పరిణమిస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

జ‘గన్’ ఎందుకు పేలదు...

సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం చెందిన కారణంగానే ఒకసారి అధికారాన్ని చేజేతులారా చేజార్చుకున్నారు జగన్. 2014లో బీజేపీతో చేతులు కలిపితే కాంగ్రెసుపై కసి, మోడీ వేవ్ కలగలసి అధికార పీఠంపై రైట్ రాయల్ గా కూర్చొనే అవకాశం దక్కి ఉండేది. కానీ దానిని కాలదన్నుకున్నారు. ఇప్పుడు బీజేపీపై ఆంధ్రప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మోడీ కరిష్మా కడగంటిపోయింది. కమలం పార్టీని, కాంగ్రెసు పార్టీని ఒకే గాటన కట్టి ప్రజలు నిందిస్తున్నారు. దీనిని గమనించే తెలుగుదేశం క్రమేపీ బీజేపీకి దూరమయ్యే దిశలో అడుగులు కదుపుతోంది. బడ్జెట్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేత నోరుమెదపకపోవడం తప్పుడు సంకేతాలు పంపుతోంది. కమలం పార్టీతో చేతులు కలపాలనుకుంటున్నందునే జగన్ కేంద్రాన్ని విమర్శించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని తెలుగుదేశం చక్కగా వినియోగించుకుంటూ బీజేపీపై ఆగ్రహాన్ని వైసీపీకి కూడా అంటగట్టాలని చూస్తోంది. రాజకీయంగా ఇది జగన్ కు తీవ్రమైన నష్టం చేకూర్చే అవకాశం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

ఈ ‘ప్రశ్న’కు బదులేది?

బీజేపీపై ముందుగా అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రనాయకుడు పవన్ కల్యాణ్. ప్రత్యేక హోదా, రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్న తీరుపై ఆయన ధ్వజమెత్తారు. ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. తాజా బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా కేటాయింపులు లేకపోయినా, విభజన హామీల అమలుకు చర్యలు తీసుకోకపోయినా పవన్ స్పందించకపోవడంపై విమర్శలు వినవస్తున్నాయి. టీడీపీ, బీజేపీలతో సంబంధం లేకుండా సొంతంగా ఎన్నికలకు వెళ్లాలనేది జనసేన యోచన. ఇందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు జనసేనాని. అందులోనూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వైసీపీ ప్రత్యామ్నాయం కాబోదు, జనసేన మాత్రమే సమర్థ విపక్షంగా వ్యవహరిస్తుందని సంకేతాలు పంపుతున్నారు. టీడీపీపై తీవ్రంగా విరుచుకుపడకపోయినా వైసీసీ స్థానాన్ని అందుకోవాలనే ఆత్రం జనసేనలో కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో బలపడేందుకు కేంద్రబడ్జెట్ ను ఒక ప్రాతిపదికగా తీసుకోవచ్చు. కానీ జనసేన బడ్జెట్ పై ఏమాత్రం ఆసక్తి చూపలేదు. పవన్ కల్యాణ్ అనుమతి లేకపోవడం వల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా పెద్దగా స్పందించడం లేదు. బంగారం లాంటి అవకాశాన్ని వదిలేసుకున్నట్లేనని రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ బలపడే ప్రతి అంశాన్ని, సెంటిమెంటును వినియోగించుకున్నప్పుడే సాధారణ ప్రజానీకంలోకి చొచ్చుకుపోవడం సాధ్యమవుతుంది. ఈ రాజకీయ నాడిని పవన్ పట్టుకోలేకపోవడం ప్రధానలోపమంటున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News