22 ఏళ్ల పాటు అధికారంలో కూడా బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. ఒకదశలో కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ చివరకు గెలుపు బీజేపీకే ఖాయమయింది. మోడీ పై నమ్మకం... మోడీ అంటేనే విశ్వాసం... మోడీ... మానియా....ఇదీ గుజరాత్ లో పరిస్థితి. గుజరాత్ లో బీజేపీ గెలుపు ఖాయమని తేలడంతో బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు జరుపుకుంటున్నారు. మరోసారి గుజరాత్ లో బీజేపీ గద్దె నెక్కబోతోంది.
ఎవరెన్ని విమర్శలు చేసినా....
మూడున్నరేళ్ల నరేంద్రమోడీ పాలనపై విమర్శలకు అంశాలు దొరకక విపక్షాలు ముఖ్యంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ భారంగా కాలాన్ని నెట్టుకొచ్చింది. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు విపక్షాలకు చేతినిండా పనిని కల్పించాయి. దీంతో మోడీ ప్రతిష్ట దెబ్బతినడం ఖాయమని, భవిష్యత్ మసకబారుతుందన్న విమర్శలను ఊదరగొట్టాయి. రాజకీయ వ్యాఖ్యాతలు, పత్రికారచయితలు కూడా ఇదే కోణంలో పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలను వెలువరించారు. గుజరాత్ ఎన్నికలపై ఈ ప్రభావం స్పష్టంగా ఉంటుందని ఆశించారు. మోడీ ఇక పలాయనం చిత్తగించక తప్పదన్న ఊహాగానాలు వెలువడ్డాయి. విపక్షంతో పాటు స్వపక్షంలోని విపక్షం, కురువృద్ధులు ఇదే అవకాశంగా మోడీ పై ధ్వజమెత్తడానికి వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు వారిని ఖంగుతినిపించాయి. విపక్షాలకు నోటమాట రాకుండా చేశాయి. విమర్శకుల నోటికి తాళాలు పడ్డాయి. అధికార పార్టీని ఓడించడం, విపక్షాన్ని గద్దెనెక్కించే సంస్కృతి గల హిమాచల్ ఫలితాలపై ఎవరికీ అంతగా ఆసక్తి లేదు. అక్కడ కమలం గెలుపు ఖాయమన్న సంగతి ఎప్పుడో తెలిసిపోయింది. ఇక మిగిలింది గుజరాత్ గురించే. మామూలుగా అయితే ఈ రాష్ట్ర ఫలితంపై అంతగా ఆసక్తి ఉండనక్కర లేదు. కాని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో సహజంగానే ఆసక్తి పెరిగింది. ఈ ఎన్నికలకు ముందే తెరపైకి వచ్చిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రభుత్వ ప్రతిష్టకు, వ్యక్తిగతంగా మోడీ ప్రాభవాన్ని మసకబార్చాయన్న విశ్లేషణలు వెలువడ్డాయి. యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతవల్లనే సాధ్యమైందని, ఇందులో మోడీ ప్రతిభ ఏమీ లేదన్న వాదనలు వెలువడ్డాయి.
కాచుక్కూర్చున్న సొంత పార్టీ నేతలు....
ఈ నేపథ్యంలో ప్రారంభమైన గుజరాత్ ఎన్నికల ప్రక్రియపై దేశ, విదేశాల్లో ఆసక్తి ఏర్పడింది. శత్రుదేశమైన చైనా కూడా నిశితంగా గమనించింది. మోడీ ఓడితే రాజకీయంగా బలహీనపడతాడని, అప్పుడు ఆయనతో వ్యవహరించడం తేలిక అవుతుందన్నది డ్రాగన్ వ్యూహం. ఇప్పటిదాకా మోడీని అడ్డుకోలేక పోయిన విపక్షాలు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ గుజరాత్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక సొంత పార్టీలోని వ్యతిరేకులు, కురువృద్ధులు కాచుకూర్చున్నారు. లాల్ కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా వంటి కురు వృద్ధులతో పాటు షాట్ గన్ శత్రుఘ్నసిన్హా వంటి నేతలు గుజరాత్ ఫలితాలు తారుమారైతే తమ తడాఖా చూపించవచ్చని ఆశించారు. కాని అలా జరగక పోవడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుక్కూర్చున్నారు.
ఎన్డీఏ కూటమిలో కూడా....
ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలు కూడా గుజరాత్ ఫలితాల పేరుతో మోడీని ఇరుకున పెట్టవచ్చని భావించాయి. ఆయన్ను దారికి తేవచ్చని అంచనాలు వేశాయి. ఇప్పుడు వారికి నోటమాట రావడం లేదు. కూటమిలోని శివసేన కూడా గుజరాత్ లో ఒంటరి పోరాటానికి వెళ్లి భంగపడింది. తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలు కూడా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ మోడీ హవాకు బ్రేకులు పడాలని ఆంతరింగకంగా ఆశించింది. పోలవరం, ప్రత్యేక హోదా వంటి అంశాలతో బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టి లబ్ది పొందాలని ఏపీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని 2019 నాటికి బంధాన్ని తెంచుకోవాలని భావించిన ఈ పార్టీకి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మొదట బీజేపీతో కలిసి నడవాలని, ఆ తర్వాత దూరంగా ఉండాలని భావించిన తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ కూడా ఇప్పుడు ప్రేక్షకపాత్రకే పరిమితమయింది. ఢిల్లీకి చెందిన ఆప్, కాశ్మీర్ లోని బీజేపీ (పీపుల్స్ డెమొక్రటిక్ ఫ‌్రంట్), బీహార్ కు చెందిన జనతాదళ్ (యు) వంటి పార్టీలకు కూడా ఈ ఫలితాలు మింగుడుపడనివే. ఇతర చిన్న జాతీయ పార్టీలదీ ఇదే పరిస్థితి.
మరింత దూకుడుగా....
తాజా ఫలితాలతో మోడీ మరింత దూకుడుగా వెళ్లే అవకాశముంది. 2018 ఫిబ్రవరిలో త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్, వేసవిలో కర్ణాటక, అనంతరం జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ ఎన్నికల్లో మోడీ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశముంది. 2019 ఎన్నికలకు కూడా ఇదే వేగాన్ని కొనసాగించడానికి అవకాశం ఏర్పడింది. ఇంటగెలచి రచ్చ గెలవాలన్నది పాత సామెత. ఏ నాయకుడికైనా స్వరాష్ట్రంలో, ఒక ప్రధానికి సొంత రాష్ట్రంలో విజయం వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది. 22 సంవత్సరాల పాటు ఏకధాటిగా పాలించిన రాష్ట్రంలో అన్నీ తానై వ్యవహరించిన ప్రధానికి అక్కడి విజయం అందించే మద్దతు అంతా... ఇంతా కాదు. గుజరాత్ అంటే మోడీనే. మోడీ అంటే గుజరాత్ అని అందరూ భావిస్తున్న తరుణంలో లభించిన గెలుపుకు విలువకట్టడం కష్టమైన పనే. రాజకీయంగా గాంధీ పుట్టిన రాష్ట్రం ఒకప్పుడు నరేంద్ర మోడీకి జన్మనిస్తే... ఇప్పుడు ఈ పశ్చిమ రాష్ట్రం రాజకీయంగా మోడీకి మరో జన్మ నిచ్చింది.
-ఎడిటోరియల్ డెస్క్