భూటాన్ పేరుకే చిన్న దేశం. కానీ కొన్ని విషయాల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. మానవాళికి కొన్ని మంచి విషయాలు చెబుతోంది. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపుతూ ఆదర్శంగా వ్యవహరిస్తుంది. పర్యావరణం, ప్రజాస్వామ్యం, రాచరికం వంటి విషయాల్లో అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలు అంటూ విర్రవీగే పాశ్చాత్య, ఇతర దేశాలు దక్షిణాసియా దేశమైన భూటాన్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. యధారాజా... తథా ప్రజల అన్నది పాత నానుడి. భూటాన్ రాజకుటుంబానికి ఇది చక్కగా వర్తిస్తుంది. స్వయంగా రాజదంపతులు ఆదర్శంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు కూడా వారి బాటలోనే నడుస్తున్నారు.
పర్యావరణ ప్రేమికులు....
హిమాలయ పర్వత రాజ్యమైన భూటాన్ కు మూడు వైపులా తూర్పు, దక్షిణ, పడమరల్లో భారత్ సరిహద్దు. ఉత్తరాన చైనాతో సరిహద్దులు పంచుకుంటుంది ఈ బుల్లి దేశం. హిమాలయాలకు తూర్పు వైపున చివరిలో భూటాన్ ఉంది. హిమాలయాలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో.. ఆధునిక కాలంలోనూ భూటాన్ అంతే ప్రశాంతంగా ఉండటం విశేషం. ఆధునిక ప్రపంచానికి ఆనవాలుగా కనపడే వాతావరణ కాలుష్యం, వాహన కాలుష్యం, హడావిడి, జీడీపీలు, వృద్థిరేటు వంటివి అక్కడ కన్పించవు. రాజు నుంచి పేద వరకూ అందరూ ప్రశాంతంగా, నిత్యం చిరునవ్వుతో జీవితాన్ని సాగిస్తుంటారు. అందువల్లే ఇటీవల కాలంలో అంతర్జాతీయ వేదికలపై భూటాన్ గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రపంచ పర్యావరణ మార్పుల గురించి చర్చ జరిగిన ప్రతిసారీ భూటాన్ విధానాన్ని ప్రస్తావించడం పరిపాటి అయింది. పర్యావరణం, పచ్చదనం గురించి ప్రత్యేకంగా రాజ్యాంగమే పేర్కొనడం విశేషం. 60 శాతానికి పైగా పచ్చదనాన్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినా కాపాడాలని ఆ దేశ రాజ్యాంగమే నిర్దేశిస్తోంది. దీనిని ప్రజలు తు..చ.. తప్పకుండా పాటిస్తుండంటంతో దేశంలో బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డైయాక్సైడ్) జాడ కన్పించనే కన్పించదు. పొరుగునున్న భారత్, చైనాలు పలు పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో బౌద్ధ దేశమైన భూటాను నుంచి పాఠాలు నేర్చోకోవాల్సిన అవసరాన్ని కాదనగలమా?
ఆర్థికం కాదు.. హార్థికమే....
అన్ని దేశాలూ జీడీపీని అభివృద్ధికి కొలమానంగా పరిగణిస్తాయి. కానీ భూటాన్ ఇందుకు భిన్నం. అక్కడ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కన్నా స్థూల జాతీయ ఆనందం (జీఎస్ హెచ్)కి పాలకులు, ప్రజలు పట్టం కడుతున్నారు. ఆర్థికంగా ఎంత ఎదిగామన్నది ముఖ్యం కాదు. హార్థికంగా ఎంత సంతోషంగా ఉన్నామన్నదే వారి విధానం. ఫలితంగా ప్రపంచంలోనే ఎక్కువ ఆనందంగా గడుపుతున్న దేశంగా భూటాన్ గుర్తింపు పొందింది. సంతోషం, ఆనందం కేవలం భౌతిక సదుపాయాలు. భౌతిక సంపదలపైనే ఆధారపడి లేవన్నది వారి విశ్వాసం. లక్షాధికారి అయినా లవణమన్నమే గాని.. మెడరు బంగారాన్ని మింగబోడు... అన్న భావనను బలంగా నమ్మారు. మొదట్లో భారత్ లో కూడా ఇలాంటి ఆలోచన విధానమే కనిపించేది. కాని కాలక్రమంలో ఆ విధానానికి క్రమంగా దూరమవుతూ వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ అలసి పోతోంది. అయినా పరుగును ఆపడం లేదు.
రాచరికపు ఆనవాళ్లు కన్పించకుండా....
భూటాన్ లో రాచరికం ఉన్నప్పటికీ రాజకుటుంబంలో దర్పం కనపడదు. ప్రజలను వారు సొంతబిడ్డలుగా చూస్తారు. వారు కూడా రాజును దేవుడిగా భావించి ఆరాధిస్తారు. రాచరికంలో గాని, ప్రజాస్వామ్యంలోని అధికారాన్ని ఎవరూ వదులుకోరు. జీవితాంతం తామే చక్రం తిప్పాలని భావిస్తుంటారు. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్ లో కూడా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తామే ఎల్లకాలం పదవుల్లో ఉండాలని భావిస్తుంటారు. ఇక నియంతృత్వ నేతలకు, రాజ కుటుంబాల పరిస్థితి చెప్పనక్కర లేదు. కానీ భూటాన్ రాజకుటుంబం ఇందుకు భిన్నం.రాచరికం నుంచి దేశాన్ని ప్రజాస్వామ్యం దిశగా మళ్లించిన ఘనత వారిది. 2001లో రాజకుటుంబం స్వయంగా కొన్ని అధికారాలను మంత్రి మండలికి బదలాయించింది. 2008లో ఈ దిశగా మరికొంత ముందడగు వేసింది. ఆ ఏడాది మార్చి 24న ఎన్నికలు జరిపించి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించారు. ఓటింగ్ లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు దోహదపడాలని స్వయంగా రాజు ప్రజలకు పిలుపునివ్వడం విశేషం. ఇంతటి చొరవను ఇతర దేశాల రాజకుటుంబాల నుంచి ఆశించడం అత్యాశే అవుతుంది.
రాజు ప్రేమ అందరికీ.....
రాజును అక్కడి ప్రజలు ఎంతగా గౌరవిస్తారో... అభిమానిస్తారో.... రాజు కూడా అంతే విధంగా ప్రజలను సమాదరిస్తారు. రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేయల్ వాంగ్ ఛుక్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తన బాల్య స్నేహితురాలు జెట్సూన్ పెమాన్ నున ఆయన వివాహమాడినప్పుడు ప్రజలు పండగ చేసుకున్నారు. నూతన దంపతులు వేలాది మంది ప్రజలను కలిసి వారి ఆశీస్సులను తీసుకున్నారు. వాస్తవానికి రాజదంపతులు ఇలాంటి ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నాలుగురోజుల అధికార పర్యటన నిమిత్తం భూటాన్ రాజదంపతులు భారత్ లో పర్యటిస్తున్నారు. డోక్లాం వివాదం అనంతర నేపథ్యంలో రాజదంపతుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్, భూటాన్, చైనా సరిహద్దుల్లోని ‘డోక్లాం’ కు ట్రై జంక్షన్ గా పేరుంది. ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన చైనా భారత్ ప్రతిఘటనతో వెనక్కు తగ్గింది. సర్వకాల సర్వావస్థల్లోనూ భూటాన్ కు భారత్ నమ్మకమైన నేస్తం. అందుకే 2014 లో మోడీ అధికారంలోకి వచ్చాక తొలి విదేశీ పర్యటనను భూటాన్ తో ప్రారంభించడం గమనార్హం. మనకూ ఇలాంటి రాజుగారు ఉంటే బాగుంటుంది కదూ....!
-ఎడిటోరియల్ డెస్క్