గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీ ఈశాన్య భారతంపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపురలను చేజిక్చించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికీ ఈశాన్యంలోగల అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లలో అధికారాన్ని అందుకున్న కమలం పార్టీ ఈ మూడు రాష్ట్రాలను కూడా తన ఖాతాలో వేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఈశాన్య రాష్ట్రాల ఇన్ ఛార్జి రామ్ మాధవ్ లు పలుమార్లు ఈ రాష్ట్రాల్లో పర్యటించారు. తొలిగా ప్రధాని నరేంద్రమోడీ మిజోరాం, మేఘాలయను సందర్శించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఎన్నికల ప్రచారానికి తెరదీశారు. మిజోరాంలో 60 మెగావాట్ల త్యురైల్ జలవిద్యుత్తు కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీనివల్ల రాష్ట్రం మిగులు విద్యుత్తు రాష్ట్రంగా మారుతుంది. పశ్చిమ మేఘాలయలోని తుర నుంచి షిల్లాంగ్ వరకూ నిర్మించిన 271 కిలోమీటర్ల రహదారిని ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి 30 వేల కోట్ల రూపాయలను ప్రకటించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోడీ పర్యటన సాగిందని ప్రత్యేకంగాచెప్పనక్కర లేదు. త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్ లలో 2018 ఫిబ్రవరి ఆఖరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. మిజోరాంలో మాత్రం వచ్చే ఏడాది ఆఖరులో ఎన్నికలు జరగనున్నాయి.
మొన్నటి వరకూ ఉనికే లేని....
2014 వరకూ ఈశాన్య భారతంలో బీజేపీ ఉనికే లేదు. ఈ ఏడాది జరిగిన అస్సోం, మణిపూర్ లలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అస్సోంలో ఘనవిజయం సాధించగా, మణిపూర్ లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి స్వతంత్రుల మద్దతుతో అధికారాన్ని అనుభవిస్తోంది. ఫిరాయింపుల ద్వారా అరుణాచల్ ప్రదేశ్ లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మొత్తం మీద వరుస విజయాల ఊపుమీద ఉన్న పార్టీ నాగాల్యాండ్, మేఘాలయ, త్రిపురలపై పూర్తి స్థాయి దృష్టిపెట్టింది. నాగాల్యాండ్ మేఘాలయలపై ధీమాగా ఉన్నప్పటికీ త్రిపుర సీపీఎం ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. మేఘాలయలో కాంగ్రెస్, నాగాల్యాండ్ లో నాగా పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఉంది. 1978 నుంచి అప్రతిహతంగా త్రిపురనను సీపీఎం పాలిస్తుంది. మధ్యలో (1988-1993) ఐదేళ్ల పాటు సుధీర్ రంజన్ బర్మన్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. నృపేన్ చక్రవర్తి, దశరథ్ దేవ్ గతంలో సీపీఎం ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పగా ప్రస్తుతం మాణిక్ సర్కార్ సీఎంగా కొనసాగుతున్నారు. 60 స్థానాలున్న అసెంబ్లీకి 2013 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో సీపీఎం 59, కాంగ్రెస్ 10 గెలుచుకున్నాయి. ఇందులో పది ఎస్సీలకు, పది ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. వాస్తవానికి బీజేపీకి ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి వచ్చిన ఏడుగురిని బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వీరు బీజేపీ మద్దతిచ్చిన రామ్ నాధ్ కోవింద్ కే ఓటేశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ బలహీన పడిన నేపథ్యంలో ఆ స్థానాన్ని చేజిక్కించుకుని సీపీఎంను దెబ్బతీయాలన్నది కమలనాధుల వ్యూహం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపైనే పూర్తిగా ఆశపెట్టుకుంది. మాణిక్ సర్కార్ కు వ్యక్తిగతంగా గల ప్రతిష్ట కారణంగా బీజేపీని ఆయనను ఢీకొన్నప్పటికీ గద్దె దించలేదన్నది విశ్లేషకుల భావన. అయినా కమలనాధులు పట్టును వీడలేదు.
ఇక్కడ ఆశలు పెట్టుకుని....
60 స్థానాలు గల మేఘాలయలో ముకుల్ సంగ్మా సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. 2013 ఎన్నికల్లో 29 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ 14 మంది స్వతంత్రుల మద్దతుతో సర్కార్ ను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ సర్కార్ లోని లుకలుకలు ప్రభుత్వ వ్యతిరేకత, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం క్రియాశీలంగా లేకపోవడం తదితర అంశాలు తమకు కలిసి వస్తాయని కమలనాధులు ఆశాభావంతో ఉన్నారు. త్రిపుర సీపీఎం సర్కార్ కన్నా, మేఘాలయ కాంగ్రెస్ సర్కార్ ను ఢీకొనడం తేలికన్నది కాషాయ పార్టీ నాయకుల అంచనా. ఈశాన్యాన సమస్యాత్మక రాష్ట్రమైన నాగాల్యాండ్ పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్.పీ.ఎఫ్) నేతృత్వంలోని డెమొక్రటిక్ అలయన్స్ ఆఫ్ నాగాల్యాండ్ కూటమి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా టీఆర్ జెలియాంగ్ చక్రం తిప్పుతున్నారు. 2013 ఫిబ్రవరిలో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో నాగా పీపుల్స్ ఫ్రంట్ 37, కాంగ్రెస్ 8, బీజేపీ 2, నేషనలిస్ట్ కాంగ్రెస్ 4, జనతాదళ్ (యు) ఒక్క స్థానం గెలిచాయి. గిరిజనులు, క్రైస్తవులు అధికంగా గల ఈశాన్య భారతంలో 2014 వరకూ బీజేపీకి ఉనికే లేదు. ఈ రెండు వర్గాలు పార్టీకి దూరమే. ప్రభుత్వ వ్యతిరేకత, కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండటం తమకు కలిసి వస్తాయని కమలనాధులు అంటున్నారు. కాంగ్రెస్ తో పాటు ఈ ప్రాంతంలో గల ప్రాంతీయ పార్టీలు ప్రభావవంతంగా లేకపోవడం కూడా తమకు కలిసి వస్తుందన్నది వారి అంచనా.
-ఎడిటోరియల్ డెస్క్