మోడీ అభద్రతకు గురవుతున్నారా?

Update: 2017-12-26 15:30 GMT

భారత దేశంలో కేంద్రస్థాయి ఆధిక్య రాజకీయాలకు ముఫ్ఫై ఏళ్ల క్రితం తెరపడింది. సంకీర్ణశకం మొదలైంది. ఆధిపత్య, పెత్తందారీ పద్ధతులూ అటకెక్కాయి.ఏకచ్ఛత్రాధిపత్యంగా పార్లమెంటరీ రాజకీయ పెత్తనం కొనసాగే పద్ధతి 1989 లోనే అంతరించింది. సమ్మిశ్ర,సంకీర్ణ శకానిదే పై చేయి అవుతూ వస్తోంది. ఇందులో కొంత మంచి ,మరికొంత చెడు ఉన్నాయి. భిన్న భాషలు, సంస్కృతుల నెలవైన భారత్ లో ఇది ఒక మంచి పరిణామమని చెబుతారు కొందరు. ఒకే మాట, ఒకేబాటగా సాగాలన్నా, త్వరిత గతిన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏక పార్టీ ఆధిక్యం ఉండటమే మేలైనదనే వారూ ఉన్నారు. ప్లస్సు, మైనస్సులను పక్కనపెడితే సంకీర్ణ ప్రభుత్వాలు కచ్చితంగా మెజార్టీ ప్రజల మనోభిప్రాయానికి దర్పణం పడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వ్యక్తి నియంతృత్వం స్థిరపడిన ఏకపార్టీ రాజకీయం కంటే విధాన ప్రక్రియలో బహుళ పార్టీల సమ్మతి సర్వజనామోదమే. అనుకున్నంత వేగంగా సంస్కరణలు అమలు చేయడం , ఆర్థిక రథాన్ని ఉరుకులు పరుగులు పెట్టించడం సంకీర్ణశకంలో కొంత కష్టమే. కానీ అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా నివారించడమూ బహుళపార్టీల అభిప్రాయం కారణంగా సాధ్యమవుతుంది. కానీ 2014 ఎన్నికలు దీనికి బ్రేకులు వేశాయి. మళ్లీ భారత కేంద్ర రాజకీయ ముఖచిత్రంలో సంకీర్ణశకం స్థానంలో గుత్తాధిపత్య రాజకీయం మొదలు కాబోతోందన్న అనుమానానికి తెర లేచింది. గడచిన మూడున్నర సంవత్సరాలుగా బీజేపీ సాధిస్తున్న విజయాలు, మోడీ, అమిత్ షా ద్వయం ఎత్తుగడలు ఏడు,ఎనిమిది దశకాల్లోని ఇందిర రాజకీయ చాణక్యాన్ని మళ్లీ భారత ముంగిట్లో ఆష్కరిస్తాయోమోనన్నఆందోళన మొదలైంది.

ఏకాభిప్రాయం వర్సస్ ఏక పక్షం...

సాధారణంగా సంకీర్ణ రాజకీయాల్లో వివిధ పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి సారథ్యం వహిస్తున్న పార్టీ ప్రయత్నిస్తుంది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ, యూపీఏ1,2 ప్రభుత్వాల కాలంలో ఇదే జరిగింది. కొన్ని సందర్భాల్లో ఏకాభిప్రాయం సాధ్యం కాకపోయినా మెజార్టీ అభిప్రాయానికే మన్నన దక్కుతుండేది. బలాబలాలతో సంబంధం లేకుండా మిత్ర ధర్మాన్ని, సంకీర్ణ విలువలను పాటించేవారు. ఈ విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి పెద్దన్నగా చెప్పుకోవాల్సిన ఎన్డీఏ 1 పరిపాలనను మచ్చుతునకగా చూపించాలి. ప్రజాస్వామ్య విలువల పట్ల ఎంతో గౌరవం కలిగిన వాజపేయి అందరినీ కలుపుకుని పోయేందుకు ప్రయత్నించేవారు. ప్రతి విషయంలోనూ మిత్రపక్షాలతో సంప్రతించేవారు. ప్రాంతీయ పార్టీల మాటను మన్నించేవారు. పదేళ్లపాటు యూపీఏ కు ఛైర్ పర్సన్ గా సారథ్యం వహించిన సోనియా గాంధీ కూడా చాలా నేర్పుతో, ఓర్పుతో వ్యవహరించారు. మమతా బెనర్జీ,లాలూ వంటి పేచీకోర్లతో బహుజాగ్రత్తనే రాజకీయం నెరిపారు. దాదాపు దేశ రాజకీయాల్లో సంకీర్ణం స్థిరపడిపోయిందని భావిస్తున్న దశలో నరేంద్రమోడీ నేతృత్వంలో ఒక ఉప్పెనలా బీజేపీ విరుచుకుపడింది. కొత్త ఆశలు, ఆశయాలతో యువతరానికి బావుటాగా సింగిల్ పార్టీ మెజార్టీతో బీజేపీ లోక్ సభలో కొత్త చరిత్ర సృష్టించింది. దాంతో మొత్తం రాజకీయ సమీకరణలే మారిపోయాయి.

పార్టీని మించి వ్యక్తి స్వామ్యం ...

ఒక పార్టీగా బీజేపీ బలం పుంజుకుంటే ఎవరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పార్టీ విధానాలను అమల్లోకి తెచ్చేముందు కొంత కసరత్తు సాగుతుంది. భారత దేశం భిన్నమైన సంస్కృతులకు నిలయమన్న విషయం బీజేపీ వరిష్ట నేతలకు కూడా తెలుసు. అందువల్ల సంఘ్ సిద్దాంతాలను ఎంతగా ప్రవచించినా వాటిని ప్రభుత్వ స్థాయిలో ఆచరణలో పెట్టడానికి బీజేపీ నాయకులు గతంలో పెద్దగా ప్రయత్నించలేదు. పార్టీ చింతన్ బైఠక్, మేధో మధనాల సందర్బంగా వివాదాస్పద అంశాలను కోల్డు స్టోరేజీలో పెట్టడమో, ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేయడమో చేస్తున్నారు. ఇదంతా పక్కా ప్రణాళికే. వ్యక్తుల సమూహం నిర్ణయాలు తీసుకోవడం వల్ల తగినంత జాగ్రత్తలు, మంచి చెడ్డల బేరీజు, పర్యవసనాలపై ముందుచూపు కారణంగానే ఎన్డీఏ ప్రభుత్వం విధానాల విషయంలో పక్కాగా వ్యవహరించగలిగింది. మెజార్టీ మాటే నెగ్గుతూ వచ్చింది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మోడీ, అమిత్ షాలు పార్టీని మించి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోగల స్థాయికి ఎదిగిపోయారు. పేరుకే ఎన్డీఏ ప్రభుత్వం తప్పితే మిగిలిన పార్టీలన్నీ నామ్ కే వాస్తే గా మారిపోయాయి. వీరిరువురి ఆలోచనలకు మమ అనిపించి ఆమోదముద్ర వేయిస్తున్నారు. భిన్నమైన ఆలోచనలు సంఘర్షించడం లేదు. అంతా ఏకపక్షం. పార్టీలో కూడా ఎదురు చెప్పేవారు లేకపోవడంతో మార్గదర్శక్ మండలి, పార్లమెంటరీ బోర్డు వంటివి నామమాత్రపు వ్యవస్థలుగా చట్రంలో మిగిలిపోతున్నాయి.

అభద్రతకు అదే కారణం...

దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో రాజ్యాధికారంతోపాటు కేంద్రప్రభుత్వంలోనూ సంపూర్ణమైన ఆధిక్యంతో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రాజకీయ సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. ఇంతటి బలమైన పార్టీ దేశంలో మరొకటి లేదు. బీజేపీ విజయాల పరంపరతో రికార్డులు చెరిపివేస్తోంది. నరేంద్రమోడీ కాకుండా మరొకరు ప్రధానిగా ఉంటే ఇంతటి బలాధిక్యత సాధ్యమా? అంటే చెప్పలేం. ఇంతటి దుర్నిరీక్ష్య స్థితిలో ఒక అభద్రత బీజేపీని వెంటాడుతోంది. దేశం మొత్తం వ్యాపించిన పార్టీ ఒకటి రెండు రాష్ట్రాల్లో ఓటమిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ బీజేపీలో ఆ వాతావరణం కనిపించడం లేదు. వ్యక్తి స్వామ్యంతో పార్టీని, ప్రభుత్వాన్ని గుప్పెట పట్టడంతో పార్టీలోని మిగిలిన నాయకులకు, ఎన్డీఏలోని మిగిలిన పక్షాలకు ఊపిరి సలపడం లేదు. ఏ రాష్ట్రంలోనైనా పరాజయం పాలై మోడీ కి ఎదురుదెబ్బ తగిలితే కాసింత పట్టు సడలుతుంది. ఊపిరి సలుపుతుందని మిత్రపక్షాలు, బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే బీజేపీ ఓటమిని మోడీ ఓటమికి సంకేతంగా సొంతపార్టీ నేతలు,మిత్రపక్షాలు భావిస్తున్నాయి. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిందేనని మోడీ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అభద్రతకు లోనవుతున్నారు. గుజరాత్ ఎన్నికే ఇందుకు ఉదాహరణ. వాజపేయి కాలంలోని బీజేపీకి, సోనియా సమయంలో కాంగ్రెసుకి ఇంతటి అభద్రత భావం ఎన్నడూ లేదు. వాజపేయి, సోనియా ఎన్డీఏ,యూపీఏ లకు నేతృత్వం వహించారు. అయినప్పటికీ వారు ఇంతటి ఒత్తిడికి గురికాలేదు. అరకొర మెజార్టీతో కొనసాగినా ధీమాగానే నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీకి సొంతంగానే ఆధిక్యం ఉండి కూడా ఆ స్థైర్యం కనబరచలేకపోతోందిప్పుడు. ఇద్దరు నాయకులనే నమ్ముకోవడం, వారి కరిష్మా , వ్యూహాలపైనే పార్టీని నడపాల్సి రావడమే ఇందుకు ప్రధాన కారణం. దీర్ఘకాలం పాటు ఇదే పంథా కొనసాగితే అటు బీజేపీకి, ఇటు మోడీ, అమిత్ షా లకు కూడా మంచిది కాదు. సంస్థాగత బలాన్ని కాలదన్ని వ్యక్తులపై ఆధారపడితే వ్యవస్థ కు చేటు వాటిల్లుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News