మోడీ అనుకుంటేనే ఎన్నికలా?

Update: 2017-10-14 17:30 GMT

ఏకకాలం ఎన్నికలు... గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం పాడుతున్న పాట ఇది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం సరే అంటూతలూపింది. లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకే దఫా నిర్వహించడమే ఏకకాల ఎన్నికలు. దీనివల్ల సమయం ఆదా అవుతుందని, ప్రజాధనం ఆదా అవుతుందని, అభివృద్ధి పనులకు అవాంతరాలు ఉండవని కేంద్ర ప్రభుత్వ పెద్దలు అదేపనిగా ఊదరగొడుతున్నారు. ఈ దిశగా చర్చ జరగాలని కూడా వారు అభిలషించారు. చివరికీ ఈసీ కూడా సై అన్నది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, గుజరాత్ పై ప్రకటనకు ముందుకురాని పరిస్థితి చూస్తుంటే అటు కేంద్రం, ఇటు ఎన్నికల సంఘం శకునంచెప్పే బల్లి కుడితిలో పడిందన్న పాత తెలుగు సామెత గుర్తుకు రాక మానదు. గతంలో ఏకకాల ఎన్నికలంటే శాంతి భద్రల పరిస్థితి, సాయుధబలగాలు అందుబాటులో ఉండటం, వాతావరణ పరిస్థితులు, ఎన్నికల సిబ్బంది సర్దుబాటు వంటి అంశాలు తెరపైకి వచ్చేవి. ఈ కారణంగా ఒకే రాష్ట్రంలో కూడా మూడు, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి ఏకకాల ఎన్నికలు అంటూ కేంద్ర పెద్దలు జపం చేయడం, అందుకు ఎన్నికల సంఘం వంత పాడటం ఆశ్చర్యం కలిగించే పరిణామం.

నాలుగోసారి పర్యటన కోసమేనా?

లోక్ సభ, శాసనసభ ఏదైనా దాని పదవీకాలానికి ఆరునెలల ముందు ఎన్నికలు నిర్వహించే విచక్షణాధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఆ విషయాన్ని విస్మరించి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మాటమారుస్తోంది. గుజరాత్ ఎన్నికలపై తడబడతోంది. మేధావులు, నిపుణులు, విపక్షాల ప్రశ్నలకు సూటిగా, స్పష్టమైన సమాధానం చెప్పలేక సతమతమవుతోంది. అధికార బీజేపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఇలా వ్యవహరించిందన్న విమర్శలు బలంగా వినపడుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా గుజరాత్ లో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఇప్పటి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. పార్టీకాన్నా ప్రధాని మోడీ, అధ్యక్షుడు అమిత్ షాలకు రాజకీయంగా జీవన్మరణ సమస్య లాంటిది. అందువల్లే ఎన్నికల ప్రకటనను వీలైనంత ఆలస్యం చేయిస్తే ఈలోగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అవకాశం ఏర్పడుతుంది. కొత్తగా సంక్షేమ పథకాల ప్రకటనకు సమయం చిక్కుతుంది. ఆ ఉద్దేశంతోనే కేంద్రం వత్తిడి మేరకు ఈసీ వ్యవహరించిందన్న వాదన వినపడుతోంది. ముఖ్యంగా ఈ నెల 16న ప్రధాని మోడీ గుజరాత్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభం, శంకుస్థాపనలు ఉన్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడి ఉంటే ఇందుకు అవకాశం ఉండదు. మోడీ ఇప్పటికే నెల వ్యవధిలో గుజరాత్ లో మూడుసార్లు పర్యటించారు. సెప్టంబరు 12, 13 తేదీల్లో జపాన్ ప్రధాన షిబో అబే పర్యటన సందర్భంగా బుల్లెట్ రైలు తదితర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సెప్టంబరు 17న తన జన్మదిన సందర్భంగా రెండోసారి సర్దార్ సరోవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ నెల 8,9 తేదీల్లో ద్వారకలోని శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాలుగోసారి ఈ నెల 16న పర్యటన సందర్భంగా ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తారని చెబుతున్నారు.

పాత పరిచాయల వల్లనేనా?

వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీల పదవీకాలం 2018 డిసెంబర్ జనవరి 7, జనవరి 22 తేదీలతో ముగుస్తుంది. రెండింటి మధ్య వ్యత్యాసం కేవలం పదిహేను రోజులే. ఈ కొద్దితేడాను కారణంగా చూపి రెండు రాష్ట్రాల ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నకు ఈసీ వద్ద సమాధానం లేదు. ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఖురేషీ కూడా ఈ విషయాన్ని సూటిగా చెబుతున్నారు. కాంగ్రెస్ తదితర విపక్షాలు కూడా ఈ అంశాన్నే ప్రస్తావిస్తున్నాయి. ఎన్నికల తేదీని ప్రకటించనప్పటికీ డిసెంబరు 18వ తేదీలోగా ఎన్నికలు జరుగుతాయన్న ఈసీ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రాష్ట్రంలోని ఓటింగ్ సరళి ప్రభావం మరో రాష్ట్రంపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న ఈసీ వాదనలో పస కన్పించడం లేదు. ఎన్నికల ప్రకటన, నోటిఫికేషన్ల మధ్య 21 రోజులకు మించి వ్యవధి ఉండకూడదని 2001లో న్యాయశాఖ, ఈసీ మధ్య అవగాహన కుదిరిందన్న వాదనలో కూడా బలం లేదు. ఇటీవల సంభవించిన వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, అందువల్ల సమయం తీసుకున్నామన్న ఈసీ వివరణ సంతృప్తి కరంగా లేదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఈసీ ఉదారంగా వ్యవహరించడానికి పాత పరిచయాలు కూడా ప్రభావితం చేశాయన్న విమర్శను కూడా పూర్తిగా తోసి పుచ్చలేం. ఎన్నికల సంఘం ప్రధానాధికారి అచల్ కుమార్ జ్యోతి నేపథ్యం విశ్లేషించినప్పుడు ఈ అనుమానం కలగక మానదు. ఈ ఏడాది జులైలో నసీం జైదీ పదవి విరమణ అనంతరం సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్యోతి 1975బ్యాచ్ గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన 2013 జనవరిలో పదవీ విరమణ చేశారు. మోడీ ప్రధాని అయ్యాక 2015లో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. అనంతరం సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. మోడీతో ఉన్న పాత సాన్నిహిత్యం మేరకే జ్యోతి ఉదారంగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. దీనిని అంత తేలిగ్గా తోసి పుచ్చలేం. ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ విమర్శలకు తావిచ్చే విధంగా వ్యవహరించడం ఎంత వరకు సబబు?

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News