మూడు యాత్రలు... ఓట్ల వర్షం కురిసేనా?

Update: 2018-02-20 15:30 GMT

మొత్తమ్మీద కాంగ్రెసు నాయకులు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ యాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. బస్సు యాత్ర, పాదయాత్ర, రథయాత్రల రూపంలో నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. రానున్న మూడు నెలలూ ఇక సందడే సందడి. లక్ష్యం ఏదైనప్పటికీ ప్రజల్లో ప్రచార వేడి రగిలించేందుకు ఈ యాత్రలు కచ్చితంగా దోహదం చేస్తాయి. అధికార తెలంగాణ రాష్ట్రసమితి కూడా ఈ యాత్రలపై ఆసక్తి వ్యక్తం చేస్తోంది. నిజంగా పొలిటికల్ మైలేజీ దిశలో వీటిని నడిపే సామర్థ్యం కాంగ్రెసు నాయకులకుందా? అనే సందేహం రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర విషయంలో సూపర్ సక్సెస్ సాధించిన వ్యక్తి వై.ఎస్.రాజశేఖరరెడ్డి. 2003 నాటికి కాంగ్రెసు కుదేలైపోయి ఉన్న స్థితిలో తెలంగాణలోని చేవెళ్లనుంచి చేపట్టిన పాదయాత్ర పార్టీకి మంచి ఉత్తేజం తెచ్చిపెట్టింది. అప్పట్లో జాతీయ స్థాయిలో వెలిగిపోతున్న చంద్రబాబు స్పీడుకు బ్రేకులు వేసి 2004లో కాంగ్రెసుకు అధికారం సంపాదించి పెట్టింది. కేసీఆర్ వంటి బలమైన నాయకుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న స్థితిలో పునరధికారం సాధించుకోవడానికి కాంగ్రెసు పార్టీ నాయకులు తిరిగి ఈ యాత్రామార్గాన్ని నమ్ముకుంటున్నారు. ఈ నెల 26 నుంచే ఇందుకు ముహూర్తం ఖాయం చేసుకున్నారు.

చేవెళ్ల సెంటిమెంటు ....

పార్టీ నాయకులు చేవెళ్ల సెంటిమెంటు పై చాలా నమ్మకంతో ఉన్నారు. వై.ఎస్. ఈ ప్రాంతం నుంచే తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి నేతృత్వం వహిస్తారు. సీనియర్ నాయకులు ప్రజలకు చేరువ కావడానికి దీనిని తమ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ ఈపర్యటన సాగాలని రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. దీనికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. దాదాపు తెలంగాణలోని సీనియర్ నాయకులంతా ఇందులో పాల్గొంటారు. ప్రజలను కలవడంతోపాటు నియోజకవర్గాల్లోని గ్రూపులను ఏకం చేసే బాధ్యత కూడా ఈ టీమ్ తీసుకోబోతోంది. టీఆర్ఎస్ బలమైన పక్షం. తిరుగులేని విజయాలు సాధిస్తోంది. ఆ పార్టీని ఎధుర్కోవాలంటే అంత సులభమేమీ కాదు. అంతా ఐకమత్యం గా కృషి చేస్తే తప్ప దీటుగా పోటీనిచ్చే పరిస్థితులు లేవు. అయినప్పటికీ గ్రూపుల గోల తగ్గలేదు. బస్సు యాత్ర లో ఈ వర్గాల గందరగోళాన్ని చల్లబరిచి నాయకులను సమన్వయదిశలో నడిపించే బాధ్యతను తీసుకునే విధంగా లక్ష్యాలను నిర్దేశించారు.

ఫైర్ బ్రాండ్ ల పాదయాత్ర....

ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెసు పార్టీ ఎంచుకున్న మరో మార్గం పాదయాత్రలు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల దాడితో ఫైర్ బ్రాండులుగా ముద్ర పడిన రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మల్లు భట్టివిక్రమార్కలు తమ దైన శైలిలో విడివిడిగా ఈ పాదయాత్రలు చేపడుతున్నారు. సామాజిక వర్గాల వారీగా కూడా ప్రత్యేకతలున్న ఈ నేతలు ముఖ్యంగా ఫీల్డు లెవెల్ క్యాడర్ ను సమీకరించడానికి ఉపకరిస్తారని పార్టీ భావిస్తోంది. రేవంత్ రెడ్డి పార్టీలో ప్రవేశించడంతోనే కొత్త శక్తి ప్రవేశించినట్లు భావించారు. నిరాశానిస్పృహల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కాంగ్రెసులో ప్రవేశిస్తారనే భావన కూడా నెలకొంది. కానీ ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. రేవంత్ నిష్క్రమణ టీటీడీపీపై బలంగానే ప్రభావం చూపింది. పార్టీ కకావికలం అయిపోయింది. కానీ అది కాంగ్రెసు కంటే టీఆర్ఎస్ కే ఎక్కువగా లాభించింది. టీడీపీ నాయకులు కాంగ్రెసు పార్టీ కంటే అధికారపక్షంలోనే ఎక్కువగా చేరిపోయారు. అందువల్ల రేవంత్ చేరికతో తాము ఆశించిన లబ్ధి చేకూరలేదని కాంగ్రెసు నాయకత్వం గ్రహించింది. ఇప్పుడు రేవంత్ కరిష్మాకు తాజా పాదయాత్ర సవాల్ గా చెప్పుకోవాలి. రెడ్డి సామాజిక వర్గం ఆయన చెంత ఎంతమేరకు సమీకృతం అవుతుందో ఈ పాదయాత్రను బట్టి తేలిపోతుంది. కొంత కోస్తా కల్చర్ కనిపించే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం లో టీడీపీ, కమ్యూనిస్టు కోటలు బద్దలైపోయిన తర్వాత నిజానికి కాంగ్రెసు బలపడాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో అది సాధ్యం కావడం లేదు. దళిత సామాజిక వర్గం నుంచి కాంగ్రెసు వర్కింగు ప్రెసిడెంటు మల్లు భట్టి విక్రమార్క బలమైన వాయిస్. ఈ వర్గంలో చైతన్యం తెచ్చే దిశలో మల్లు యాత్ర దోహదం చేస్తుందనే నమ్మకంతోనే కాంగ్రెసు ఆయన యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పొన్నం ప్రభాకర్ కూడా దూకుడు కనబరుస్తుంటారు. టీఆర్ఎస్ పై విరుచుకుపడటంలో ఆయనకు ఆయనే సాటి. వెనకబడిన తరగతులకు చెందిన పొన్నం జోరు కూడా ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ స్పీడుకు బ్రేకు వేస్తుందనే అంచనాతో ఉంది కాంగ్రెసు. అటు ఖమ్మంలో మల్లు, ఇటు ఉత్తర తెలంగాణలో పొన్నం, దక్షిణ తెలంగాణలో రేవంత్ ఇలా సామాజిక వర్గాల వారీగానే కాకుండా ప్రాంతాల వారీగా కూడా సమీకరణ చక్కగా కుదిరిందని నాయకులు చెబుతున్నారు.

నెరవేరుతున్న స్వప్నం....

కాంగ్రెసు అధిష్టానానికి సన్నిహితంగా మెలిగే వీరవిధేయుడు వీహెచ్. వై.ఎస్. వంటివారికి పెద్దగా ఇష్టం లేకపోయినా అధిష్టానం ఆశీస్సులతోనే మూడుసార్లు రాజ్యసభ స్థానాన్ని పొందగలిగారాయన. 80 లలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజీవ్ గాంధీ కోటరీలో కీలక సభ్యునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందిర కుటుంబం పట్ల అచంచల భక్తి భావం ప్రకటించే వి.హనుమంతరావు కల నెరవేరబోతోంది. 2003లో వై.ఎస్.కు పోటీగా పాదయాత్ర చేయాలనుకున్నప్పటికీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా అధిష్ఠానం నిలువరించింది. ఇన్నాళ్లకు రథయాత్ర చేపడుతున్నారు వీహెచ్. తనదైన యాస, శైలితో ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లోనూ అర్బన్ ఓటర్ల లక్ష్యంగా వీహెచ్ రథయాత్ర సక్సెస్ అవుతుందని కాంగ్రెసు చెబుతోంది. బడ్జెట్ సమావేశాలను మినహాయించి మార్చి , ఏప్రిల్, మే నెలల్లో ఈ మూడు రకాల యాత్రలు ప్రజల్లో విస్త్రుతంగా సాగిన తర్వాత జూన్ ఒకటిన తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం నాడు రాహుల్ గాంధీ హాజరయ్యే సభతో వీటికి ఒక ముగింపు నిస్తారని తెలుస్తోంది. గ్రామగ్రామాన వేడి రగిలించి పొలిటికల్ వార్ కు సన్నాహకంగా ఈ యాత్రలు దోహదపడితే సమర శంఖాన్ని రాహుల్ పూరిస్తారన్నమాట.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News