మూడక్షరాల ముత్తెపు చినుకు...తెలుగు పోస్ట్ ఘన నివాళి

Update: 2018-02-25 09:30 GMT

ఆ పలుకు కోట్ల హృదయాలను మంత్రముగ్ధం చేసింది. ఆ నవ్వు వలపు సవ్వడుల చిలిపితనాన్ని చిలకరించింది. ఆ నాట్యం నవలాస్యం ఒలికించింది. ఆ తనువులో అణువణువు అభినయ విన్యాసమే. కనులతో కవ్వించి నటనాసుమ పరిమళాలు వెదజల్లి అశేష భారత సినీ ప్రేక్షకులను మత్తులో ముంచెత్తిన ‘శ్రీ’ చెదిరిపోని స్వప్నం. ఇకపై చెరిగిపోయిన కల. నటిగా అగ్రస్థానానికి చేరడమే కాదు, అయిదు దశాబ్దాలపాటు సినీరంగంలో తనదైన చరిత్ర రాయడం సామాన్యులకు సాధ్యం కాదు. తళుకుబెళుకుల ప్రపంచంలో ఒక మెరుపు మెరిసి మాయమయ్యే వారెందరెందరో ఉంటారు. కానీ ఇంధ్రదనుస్సులా సప్తవర్ణ శోభితమై శాశ్వతమైన జ్ణాపకంగా మిగిలేవారు అరుదు. అందులోనూ చలనచిత్ర రంగం నడిచే ఒక స్మృతి. అటువంటి క్షణభంగుర ప్రపంచంలో శాశ్వతముద్ర శ్రీదేవి. దక్షిణభారతాన ఎగసి ఉత్తరభారతాన మెరసిన వెన్నెల సోన. పేరు చెబితే చాలు పదహారేళ్ల వయసు నాటి పరువపు సడి అలజడి చేస్తుంది. వసంతకోకిల కుహుకుహు సవ్వడి వినవస్తుంది. తూ హే రాజా, మై హూ రాణీ అంటూ ప్రతి యువకుని గుండెలో కౌమారాన్ని గంతులు వేయించిన లావణ్య సిరి.. ఆమె శ్రీదేవి.

చెదరని కల...

ఒకనాడు శ్రీదేవి అంటే యువహృదయాల్లో ఉవ్వెత్తున ఎగసిపడే అల. కలలు పెనవేసుకున్న స్వప్న సుందరి. అందుకే భారతీయ చలనచిత్ర సీమలో ఎవరికీ దక్కనంత క్రేజు ఆమె చేజిక్కించుకోగలిగింది. చిలిపితనము, జాణతనము, కొంటెతనము కలగలిపిన మాధుర్యం ఆమె మాటల్లో తొణికిసలాడుతుండేది. అదే ఆమెకు ఒకఅసెట్ గా నిలిచింది. సావిత్రి, వాణిశ్రీ వంటి సీనియర్లు కూడా నటనలో శిఖరసదృశమైనవారే. జయప్రద, జయసుధ వంటి సమకాలికులు అందం, అభినయంలో సమఉజ్జీలే. కానీ పాత్రకు తనదైన లాలిత్యం అద్దడం ఆమెకే సొంతం. సహజత్వంతోపాటు పాత్రను తనచుట్టూ తిప్పుకునే నేర్పరితనమే ఆమెను మేటి నటిగా నిలిపింది. క్యారెక్టర్ లో ఒదిగిపోవడం, ఒరిగిపోవడమే కాదు, కాంటెంపరరీ సొబగులు అద్దడమూ శ్రీదేవి సొంతం. అందుకే సమకాలికులైన నటీనటులతోను, పూర్వతరం తారామణులతోనూ ఆమెను పోల్చలేని స్థాయిని సంతరించుకున్నారు. 1977 నుంచి 1996 వరకూ పూర్తిస్థాయి నాయికగా రెండు దశాబ్దాలపాటు రాణించడమంటే మాటలు కాదు. నాలుగైదేళ్లకే నేటి హీరోయిన్ల పట్ల ప్రేక్షకులకు బోర్ కొడుతోంది. ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. శ్రీదేవి ని మాత్రం ఇంకా ఇంకా చూడాలని కోరుకున్నారు. 2012 లో ఆమె రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు అంతే ఆదరణ కనబరిచారు. వయసుకు తగిన రీతిలోని పాత్రతో పున: ప్రవేశం చేసి తన సత్తాను నిరూపించుకున్నారు. శభాస్ శ్రీదేవి అని మరోసారి ప్రేక్షకాభిమానుల జేజేలు అందుకున్నారు. భౌతికంగా ఆమె లేకపోయినా కోట్లమంది అభిమానులకు ఆమె జ్ణాపకాలు కనులముందు కదలాడే నిత్యవసంతాలే.

అందం ఆకాశమంత...

భారతదేశంలో సినీ పరిశ్రమలో ఉత్తర,భారత అంతరం స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాది నటుల పట్ల వివక్ష కొనసాగుతుంది. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ లలో మెరిసిన శ్రీదేవి మాత్రం బాలీవుడ్ లో బావుటా ఎగరవేశారు. ఉత్తరభారత ప్రేక్షకజనం ఆమె దక్షిణాది సొబగుకు దాసోహం అన్నారు. ఆమెను ఆకాశానికెత్తేశారు. దశాబ్దం పైగా బాలీవుడ్ లో తిరుగులేని నెంబర్ వన్ నటిగా కొనసాగారు. ఆమె కాల్షీట్లు దొరికితే చాలు కాసుల వర్షమే అన్నట్లుగా సాగింది శ్రీదేవి హవా. ఆమె ఓ అద్భుతం. మానవాళిని వినోదింపచేయడానికి బ్రహ్మదేవుడు సృజించిన దేవత అంటూ రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్య. కోట్లాదిగా ఉన్న అభిమానుల సౌందర్యోపాసనకు ప్రతీక మాత్రమే. అక్కినేని వంటి అగ్రహీరో డ్యూయెట్ లోనే ‘ దేవీ మౌనమా, శ్రీదేవి మౌనమా? నీకై జపించు తపించు భక్తునిపై ’అనిపించుకునేంత స్టార్ డమ్ సంపాదించుకోవడమే శ్రీదేవి కీర్తికిరీటానికి మచ్చుతునక. ప్రత్యేకించి నటన వృత్తి గా స్వీకరించిన వారు ఆ రంగంలో రాణించడం పెద్ద గొప్పేమీ కాదు. కానీ వృత్తి నిబద్ధత. నైపుణ్యం, క్రమశిక్షణ ఆమెకు యశోభూషణాలుగా నిలిచాయంటుంటారు సినీ దర్శక,నిర్మాతలు.

అభినయం.. అపురూపం

బాలనటిగా రంగప్రవేశం చేసి యాభై ఏళ్లపాటు ఈ రంగంలో కొనసాగడమే కాకుండా ఏ సినిమా చేసినా, దాంట్లో తనదైన ముద్ర వేయడం శ్రీదేవి ప్రత్యేకత. అభినయానికి వ్యక్తిత్వం తోడైతే మరింత రాణింపు వస్తుందనేందుకు ఆమె ఒక నిదర్శనం. మఖలో పుట్టి పుబ్బలో కలిసిపోయే నటీమణులకు చిత్రపరిశ్రమలో కొదవ లేదు. అటువంటి వారు పరిశ్రమకు, ప్రేక్షకులకు ఎంతో కాలం గుర్తుండరు. అనుసరించి, అనుకరించే నటీమణులు కూడా శాశ్వతమైన ముద్ర వేయలేరు. సొంత శైలి,ఎప్పటికప్పుడు ప్రతిభకు సానపెట్టుకునే అధ్యయనశీలత ఆమె నటవైదుష్యానికి వజ్రకిరీటం పెట్టాయి. పాత తరం నటీమణుల్లో గ్లామర్ పై పెద్దగా ఆసక్తి కనిపించదు. కొత్తతరం వారిలో నటనపై పెద్దగా పట్టు కనిపించదు. అటు గ్లామర్, ఇటు అందం, అభినయం ముచ్చటగా రంగరించుకున్న ముగ్ధమందారం భారతచలనచిత్ర రంగంలో శ్రీదేవి మాత్రమే. బహుముఖ ప్రజ్ణ, బహుభాషా చిత్రాల నట ప్రావీణ్యం కలబోసిన కళామూర్తి. భారత చిత్ర సీమ మరో శ్రీదేవిని మళ్లీ స్రుజించలేదు. ఆమెకు ఆమే సాటి. ఆమెకు ఆమెనే పోటీ. అందుకే ఆమె చెదిరిపోని స్వప్నం. చలనచిత్ర జగత్తులో చెరిగిపోని ముద్ర. శాశ్వతం, సదా స్మరణీయం. నవ తరం నటీమణులు... నిత్యం అభ్యసించాల్సిన పాఠం.

Similar News