మాయలోడు మోడీ ఎక్కడ?

Update: 2018-02-16 16:30 GMT

హర్హద్ మెహతా, కేతన్ పరేఖ్, లలిత్ మోడీ, విజయ్ మాల్యా.... పేర్లు పూర్తిగా మర్చిపోకముందే వారి సరసన మరొకరుచేరిపోయారు. అతనే వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న సామెత మాదిరిగా కుంభకోణంలో వారిని మించిపోయాడు నీరవ్ మోడీ. వారి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు మొత్తం నాలుగంకెలకే పరిమితమయింది. నీరవ్ మోడీ మాత్రం వీరి రికార్డులను అధిగమించాడు. 11వేల కోట్లకు పైగా మొత్తానికి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టోపీ పెట్టి ప్రశాంతంగా భార్య, సోదరుడు, వ్యాపారి భాగస్వామితో నెలన్నర క్రితమే స్విట్జర్లాండ్ చెక్కేశాడు. దొంగలు పోయిన తర్వాత కుక్కలు మొరిగినట్లు ఇప్పుడు బ్యాంకు, నిఘా, దర్యాప్తు సంస్థలు హడావిడి చేస్తున్నాయి. పది, పదిహేను రోజుల పాటు పత్రికల్లో అధికారుల్లో హడావిడి కనిపిస్తుంది. ఆ తర్వాత అంతా మామూలే. మళ్లీ అధికారులు విషయాన్ని మర్చిపోతారు. మాల్యా, లలిత్ మోడీల మాదిరిగానే నీరవ్ కూడా విదేశాల్లో ప్రశాంత జీవనం గడుపుతారు.

పి.ఎన్.బి.ని ముంచేసి.....

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏమీ ఆషామాషీ బ్యాంకు కాదు. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి. స్టేట్ బ్యాంక్ తర్వాతి స్థానం దానిదే. ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో దానిది నాలుగో స్థానం. 1894 మే 19న ఆవిర్భవించిన ఈ బ్యాంకుకు 123 ఏళ్ల చరిత్ర ఉంది. న్యూఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న బ్యాంకుకు 6937 శాఖలు, 10,681 ఏటీఎంలు ఉన్నాయి. 70801 మంది ఉద్యోగులు దేశవిదేశాల్లో పనిచేస్తున్నారు. 80 మిలియన్ల మంది ఖాతాదారులు ఉన్నారు. నీరవ్ మోడీ నిర్వాకం వెలుగులోకి రావడంతో బ్యాంకు పరువు, ప్రతిష్ట ఒక్కసారిగా బజారున పడింది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయతపైనే విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఏర్పడింది. ప్రజల కష్టార్జితానికి పూచీకత్తు వహించాల్సిన బ్యాంకుల పనితీరు ఎలా ఉందో ప్రజానీకానికి అర్థమైంది.

2010 నుంచే షురూ చేసి.....

నీరవ్ మోడీ వ్యవహారం ఇప్పటికిప్పుడు వెలుగులోకి వచ్చింది కాదు. దానికి పూర్వరంగం చాలా ఉంది. 2010 నుంచే ఈ ప్రక్రియ మొదలయింది. 2015లోనే ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు అందినా పట్టించుకునే వారే కరువయ్యారు. మొదట రూ.280 కోట్లతో వెలుగులోకి వచ్చిన అవినీతి మకిలీ వ్యవహారం 11 వేల కోట్లకు పైగానే ఎగబాకింది. యావత్ బ్యాంకింగ్ రంగం కొలువుదీరిన ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులోని ఒక శాఖలో 1.77 బిలియన్ డాలర్లు (సుమారు 11,400 కోట్లు) కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మరో ఆభరణాల కంపెనీ మోసపూరిత లావాదేవీలకుపాల్పడినట్లు బ్యాంకింగ్ వర్గాలు సీబీఐకి ఫిర్యాదు చేసిందాకా ఎవరికీ తెలియదు. తాజా ఘటనతో 10 మంది బ్యాంకు అధికారులపై వేటు పడింది. ఉన్నతాధికారులప్రమేయంతోనే ఈ కుంభకోణానికి రెక్కలు వచ్చాయన్నది కాదనలేని నిజం. కుంభకోణం ఒక్క ఈ బ్యాంకుకే పరిమితం కాలేదు. యూనియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులకు కూడా ఇందులో పాత్ర ఉన్నట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఇంకా ఇతర బ్యాంకుల పాత్ర ఉందన్న అనుమానాలూ లేకపోలేదు.

ఎల్.ఓ.యూలు ఇబ్బడిముబ్బడిగా.....

నీరవ్ మోడీ తన వ్యాపార కార్యకలాపాలకు దన్నుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్.ఓ.యూ) లు జారీ చేసింది. బ్యాంకింగ్ పరిభాషలో ఎల్ ఓయూకు విస్తృతార్ధం ఉంది. తమ ఖాతాదారుడు తరుపున చెల్లింపులకు పూచీకత్తు వహించడం, హామీ ఇవ్వడమే దీని అర్థం. ఈ ఎల్.ఓ.యూ లను అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీల్లో వినియోగిస్తారు. సాధారణంగా ఖాతాదారుల ఆస్తులను హామీగా పెట్టుకుని బ్యాంకులు ఎల్.ఓ.యూలు జారీ చేస్తుంటాయి. కాని ఇక్కడ అలాంటి ప్రక్రియ జరిగినట్లు కనపడటం లేదు. ఎల్.ఓ.యూలు జారీ చేసిన సంస్థ, స్వీకరించిన సంస్థ, ఈ కార్యకలాపాలను సాగించిన సంస్థ, లబ్దిపొందిన వ్యక్తులకు వీటి గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మూడో కంటికి తెలియకుండా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈవ్యవహారాన్ని నడిపింది.

పథకం ప్రకారమే......

నీరవ్ మోడీ ఒక ప్రణాళిక ప్రకారమే ఈ కథను నడిపినట్లు అర్థమవుతోంది. విషయం చూచాయగా తెలియగానే విదేశాలకు చెక్కేశాడు. జనవరి 1న భార్య, సోదరుడు, వ్యాపార భాగస్వామితో కలసి స్విట్జర్లాండ్ కు వెళ్లారు. వీరిలో ఒక్క నీరవ్ కే భారత పౌరసత్వం ఉంది. భార్యత అమీకి అమెరికా పౌరసత్వం ఉంది. సోదరుడు నిషాద్ బెల్జియం పౌరసత్వం కలిగి ఉన్నాడు. వీరిని భారత్ కు రప్పించడం ఎంత కష్టమో విజయ్ మాల్యా ఉదంతం చూసిన తర్వాత ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పటిష్టమైన అంతర్జాతీయ చట్టాల మాటున ఆర్థిక నేరస్థులు రక్షణపొందడం తెలిసిందే. విజయ్ మాల్యా, లలిత్ మోడీ వంటి ఆర్థిక నేరగాళ్లకు ఇప్పటివరకూ భారతీయ చట్టాలు ఏమీ చేయలేకపోయాయి. రేపు నీరవ్ మోడీ విషయంలో కూడా ఇంతకు మించి ఏదో జరుగుతుందనుకోవడం భ్రమే. భారతీయ చట్టాలు, నిఘా సంస్థల వైఫల్యానికి ఇది నిదర్శనం. ప్రస్తుతం నీరవ్ మోడీ న్యూయార్క్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

అప్పటి నుంచే ఆయన.....

2013లో ప్రపంచ కుబేరుల జాబితాలో ఫోర్బ్స్ సంస్థ నీరవ్ మోడీ పేరును ప్రకటించినప్పటి నుంచి అతని దశ మారింది. ప్రముఖులతో రాసుకు పూసుకు తిరగడం ప్రారంభమైంది. గత నెలలో దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నీరవ్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, ఇతర వాణిజ్య ప్రతినిధులతో కలిసి ఫొటోలు దిగారు. గతంలో మద్యం వ్యాపారి విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులకు సుమారు 9వేల కోట్లకు పైగానే బురిడీ కొట్టించారు. ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఆయనను భారత్ కు రప్పించేందుకు అధికారులు కిందా మీదా పడుతున్నారు. ఫెరా నిబంధనలను ఉల్లంఘించి రూ.2148 కోట్ల మేరకు అక్రమాలకుపాల్పడినట్లు లలిత్ మోడీపై ఆరోపణలున్నాయి. ఈయన కూడా ఇంగ్లాండ్ లో ఉన్నారు. దాదాపు వెయ్యి కోట్ల మేరకు లెక్కలు చూపని ఆదాయానికి సంబంధించి కార్పొరేట్ కంపెనీలకు సలహాదారుగా పనిచేసిన దీపక్ తల్వార్ కుటుంబంతో సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లాడు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు లేకుండా వీరు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పగలమా....?

 

-ఎడిటోరియల్ డెస్క్

 

 

Similar News