మంత్రి పరిటాల సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు! అనంతపురానికి చెందిన పరిటాల రవి సతీమణిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. అనంతరం , చంద్రబాబు మంత్రివర్గంలో సీటు సంపాయించుకున్నారు. తొలుత పౌరసరఫరాల శాఖను చేపట్టిన మంత్రి.. తొలినాళ్లలో మంచి పేరు సంపాయించుకున్నా.. తర్వాత మాత్రం ఈ శాఖలోని అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అత్యంత కీలకంగా భావించిన చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న సంక్రాంతి కానుకల విషయంలో జరిగిన అక్రమాలు ఆమెకు బ్యాడ్ నేమ్ తెచ్చాయి.
వివాద రహితంగా...
వ్యక్తిగతంలో పరిటాల సునీత సౌమ్యురాలు, వివాదరహితురాలు అనే పేరు సంపాయించుకున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోనూ సునీతకు మంచి ఆదరణ ఉంది. అందరితోనూ కలుపుగోలుగా ఉండడమే కాకుండా ఎవరైనా ఇళ్లకు ప్రత్యేకంగా ఆహ్వానించినప్పుడు కూడా ఆమె ఎలాంటి భేషజాలకు పోకుండా అందరినీ కలుపుకొని పోతూ.. కార్యక్రమాలకు హాజరవుతారనే మంచి పేరు కూడా సంపాయించారు. ఇక ఈ అతి మంచితనమే పౌరసరఫరాల శాఖలో ఉన్నతాధికారులకు కలిసి వచ్చింది. మంత్రి ఏమీ అడగరులే అనే ధీమాతో వారు మిల్లర్లతో కుమ్మక్కయి.. అంతా చక్కపెట్టేశారు.
కఠిన నిర్ణయాలు తీసుకోలేక...
దీంతో అవినీతి తార స్థాయికి చేరిపోయింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఇటీవల జరిగిన మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను పౌరసరఫరాల శాఖ నుంచి తప్పించారు. ప్రస్తుతం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సునీత. అయితే, ఇప్పుడు కూడా ఆమె కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఉదాశీన వైఖరితోనే వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బలోపేతం కావాల్సిన అంగన్ వాడీల విషయంలో కేంద్ర ప్రభుత్వం వంకలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక, మహిళలకు సరైన పౌష్టికాహారం అందడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి.
సర్వేలో తేలిందేంటంటే...
మధ్యాహ్న భోజన పథకాలు అధ్వాన్న భోజన పథకాలుగా మారిపోయాయని ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే స్పష్టమైంది. ఇక, కోడిగుడ్లు పక్కదారి పట్టడం, కుళ్లిపోవడం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరిగా అందకపోవడం వంటి కారణాలతో మంత్రి సునీత పనితనం ఏమిటో చంద్రబాబుకు అర్దమైందని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన సునీతకు క్లాస్ ఇచ్చారని అంటున్నారు. ఇక, ఆమె నియోజకవర్గం రాప్తాడులోను అభివృద్ధి పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని అంటున్నారు. ఆయా విషయాలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని సమాచారం. పరిస్థితి ఇలానే ఉంటే ఎలా? అని ప్రశ్నించారని తెలుస్తోంది. మంత్రిగా ఈ మూడున్నరేళ్లలో సునీతకు మరీ ఫస్ట్ క్లాస్ మార్కులు రాలేదు. అలాగని మరీ మైనస్ మార్కులూ లేవు. అయితే ఆమెపై ఉన్న అంచనాలతో పోల్చుకుంటే తక్కువ మార్కులే వచ్చాయి. కాంట్రవర్సీలు లేకపోవడం ఆమెకు కలిసొచ్చేదే ? మరి ఈ యేడాదిన్నరలో అయినా ఆమె దూకుడు పెంచుతారేమో ? చూడాలి.