తూర్పు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లో రాజకీయంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ తిరుగులేని శక్తిగా ఉన్నప్పటికీ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరిస్తున్న తీరు ఆమెకు ఆందోళన కల్గిస్తోంది. సంప్రదాయ ప్రతిపక్ష పార్టీలైన సీపీఎం, కాంగ్రెస్ లను తోసిరాజని కమలం తన పరిధిని విస్తరించుకోవడం తాజా పరిణామం. ముఖ్యమంత్రి మమతకు కమలం పార్టీ కంట్లో నలుసుగా, పక్కలో బల్లెం మాదిరిగా మారిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా గత నెల 29న జరిగిన ఒకలోక్ సభ అసెంబ్లీ స్థానం ఎన్నికల్లో తృణమూల్ తిరుగులేని శక్తిగా నిలిచింది. సీపీఎం, కాంగ్రెస్ లను నాలుగో స్థానానికి నెట్టి కమలం పార్టీ రెండో స్థానానికి దూసుకురావడం తృణమూల్ కు కలవరం కలిగిస్తోంది. ఈ ఎన్నికల ద్వారా కోల్ కత్తాలో కాలుమోపడానికి చోటుదొరికందన్న సంతోషం కమలం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తృణమూల్ గెలిచినా ఆనందం....
ఉలుబేరియా లోక్ సభ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో నిలబెట్టుకుంది. మైనారిటీ వర్గానికి చెందిన ఆపార్టీ అభ్యర్థి అహ్మద్ నాలుగు లక్షలకు పైగా మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. బీజేపీ అభ్యర్థి అనుపమ్ మాలిక్ ద్వితీయ స్థానంలో నిలవడం విశేషం. సీపీఎం, కాంగ్రెస్ నాల్గో స్థానానికి పరిమితమవ్వడం మరో ఆసక్తికర పరిణామం. 2014 లోక్ సభ ఎన్నికల్లో కన్నా ఈసారి తృణమూల్ కాంగ్రెస్ మెజారిటీని పెంచుకోవడం గమనార్హం. నాటి ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి సుల్తాన్ అహ్మద్ రెండు లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించగా సీపీఎం అభ్యర్థి సబీరుద్దీన్ రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు కమలం పార్టీ రెండోస్థానాన్ని చేజిక్కించుకోవడం ఇటు తృణమూల్ కు, అటు సీపీఎం, కాంగ్రెస్ లను కలవరపరుస్తోంది. ఇక నేపర అసెంబ్లీ స్థానాన్ని భారీ ఆధిక్యంతో కైవసం చేసుకున్న తృణమూల్ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 1095 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూధన్ ఘోష్ ఇక్కడ విజయం సాధించారు. తృణమూల్ అభ్యర్థి మంజు బసు ద్వితీయ స్థానంలో నిలిచారు. తాజా ఉప ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి సునీల్ సింగ్ 63వేల ఓట్లకు పైగా భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. బీజేపీ అభ్యర్థి సందీప్ బెనర్జీ రెండో స్థానంలో ఉండటం విశేషం.
మమతకు మింగుడుపడటంలేదు....
ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తృణమూల్ కు తిరుగులేనప్పటికీ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించడం దానికి మింగుడు పడని పరిణామం. సీపీఎం, కాంగ్రెస్ లను తోసి ద్వితీయ స్థానంలో బీజేపీ రావడం ఆ రెండు పార్టీలను సవాల్ చేసినట్లయింది. అంటే ఇక రాష్ట్రంలో బీజేపీ శక్తిగా మారనుంది. ఇదే మమతకు ఆందోళన కలిగిస్తున్న పరిణామం. కాంగ్రెస్, సీపీఎంలకన్నా కమలం పార్టీని ఎదుర్కోవడం కష్టమన్నది తృణమూల్ అంచనా. కాషాయ పార్టీ రాకవల్ల ఓట్ల పునరేకీకరణ జరగదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, సీపీఎంల నుంచి ముస్లిం ఓటు బ్యాంకును కైవసం చేసుకున్న మమత తిరుగులేని శక్తిగా ఉన్నారు. బెంగాల్ లో ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సగం నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావం చేయగల స్థితిలో వారున్నారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు మొదట్లో కాంగ్రెస్ తర్వాత సీపీఎం పక్షాన నిలిచారు. క్రమంగా ఆ రెండు పార్టీలు బలహీన పడటంతో వారు తృణమూల్ వైపు వచ్చారు. ఇప్పుడు వారే ఆ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంక్. దీనివల్ల హిందుత్వ నినాదంతో హిందువుల ఓట్లతో బీజేపీ బలపడగలదని తృణమూల్ ఆందోళన చెందుతోంది. ఓటర్లు రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశముందని, అంతిమంగా ఇది తమకు ఇబ్బందికర పరిణామమన్నది తృణమూల్ భావన. మున్ముందు కమలం పార్టీ మరింత బలపడగలదన్నది అంచనా.
కమలానికి పెరుగుతున్న ఓటు బ్యాంకు....
తృణమూల్ ఆందోళనలో వాస్తవముంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను 211 స్థానాలను గెలుచుకుని తృణమూల్ శక్తిగా నిలిచింది. 44.9 శాతం ఓటు బ్యాంకును కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఒక ఆసక్తికర అంశముంది. కేవలం 12.3 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ 44 స్థానాలను చేజిక్కించుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 38.2 శాతం ఓట్లు సాధించిన సీపీఎం మాత్రం కేవలం 16 సీట్లతో చతికలపడింది. 10.2 శాతం ఓట్లు సాధించిన కమలం పార్టీ కేవలం మూడు స్థానాలతో సంతృప్తి పడాల్సి వచ్చింది. కాంగ్రెస్, కమలం పార్టీల మధ్య ఓట్ల శాతంలో పెద్దగా వ్యత్యాసం లేదు. కేవలం రెండు శాతం మాత్రమే. వచ్చే ఎన్నికల నాటికి ఈ ఓట్ల శాతాన్ని మరింత పెంచుకుని ప్రధాన ప్రత్యర్థిగా అవతరిస్తామన్న ధీమా కమలనాధుల్లో ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 262 నియోజకవర్గాల్లో పదివేలకు పైగా ఓట్లను పార్టీ సాధించింది. ఇందులోని 60నియోజక వర్గాల్లో 20 వేల ఓట్లను సాధించడం గమనార్హం. వాస్తవానికి 2014 లోక్ సభ ఎన్నికల్లో 17 శాతం ఓట్లు సాధించి తృణమూల్, సీపీఎం, కాంగ్రెసుల్లో కలవరం కలిగించింది. నాటి ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకుంది. డార్జిలింగ్ నుంచి అహ్లువాలియా, అసన్సోల్ నుంచి బాబుల్ విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గంలో బాబుల్ సుప్రిమోకు చోటు దక్కింది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా రెండు స్థానాలకే పరిమితమైంది. సీపీఎం నాలుగు, తృణమూల్ 34 స్థానాలు సాధించాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో 17 శాతం ఓట్లు సాధించిన కమలనాధులు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10.2 శాతానికే పరిమితమయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలతో ఇనుమడించిన ఉత్సాహంతో మున్ముందు మమత బెనర్జీని మరింత ధీటుగా ఎదుర్కొంటామని కమలనాధులు చెబుతున్నారు. తమ పరిధిని విస్తరించుకుని మమతకు ముచ్చెమటలు పట్టిస్తామంటున్నారు. సీపీఎం, కాంగ్రెస్ లను తోసిరాజని బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ఆవిర్భవించడం అనివార్య పరిణామంగా కనపడుతోంది.
-ఎడిటోరియల్ డెస్క్