బాబు అడ్డంగా బుక్కయ్యారు

Update: 2018-03-21 11:30 GMT

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మరోసారి చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చేసిన ప్రసంగంలోని లోపాలను, అబద్ధాలను ససాక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్ట్ పై పెట్టిన మినిట్స్ చూపుతూ కుండబద్దలు కొట్టారు. ఆది నుంచి చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నట్లు నిర్ధారణ అయిందని దీనికి ఆధారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఇచ్చిన మినిట్స్ సాక్ష్యమని తేల్చారు. మినిట్స్ లో ఒకలా ఉంటే అసెంబ్లీలో మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలగంటున్నారా అంటూ కల్పిత కధలు చెప్పడం ఏమిటని కడిగేశారు ఉండవల్లి. ప్రభుత్వం వెబ్ సైట్ లో పెట్టిన లెక్కలు ఒకలాగా, కేంద్రం ముందు మరోలా, అసెంబ్లీలో ఇంకోలా, ప్రజలముందు మరోలా చంద్రబాబు తేలిపోతున్నారని ఎద్దేవా చేశారు అరుణ కుమార్.

ఆర్ అండ్ ఆర్ కి రాష్ట్ర ప్రభుత్వం మినిట్స్ లో ...

అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్ పునరావాస ఖర్చు తాము భరిస్తామని ఎక్కడా చెప్పలేదని పచ్చి అబద్ధం చంద్రబాబు నిజంలా చెప్పారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఇచ్చిన మినిట్స్ ప్రకారం రాష్ట్రప్రభుత్వం ఎగువ కాఫర్ డ్యామ్ కడితే ముంపు ప్రాంతాల బాధితుల సొమ్ము ఎలా ఇస్తారని ప్రాజెక్ట్ అధారిటీ ప్రశ్నిస్తే తొలి కాఫర్ డ్యామ్ కి నష్టపరిహారం చెల్లించి రెండవది పూర్తి అయ్యాక దాని నష్టపరిహారం చెల్లిస్తామని రాయడాన్ని ఉండవల్లి నిలదీశారు. ఇక అరుణ్ జైట్లీ స్పష్టమైన ప్రకటన చేశారని ఏపీ ప్రభుత్వం నీతి ఆయోగ్ ను అభ్యర్ధించడం వారు కేంద్రానికి సిఫార్స్ చేసి రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ అప్పగిస్తే బాబు మాత్రం తమ ప్రభుత్వం కోరుకుని తీసుకోలేదని అసెంబ్లీలో అబద్ధాలు ఎలా చెబుతారన్నారు ఉండవల్లి. ఇక పోలవరం లో అడుగడుగునా అవినీతి ఎలా జరిగిందో చెప్పేందుకు సిద్ధంగా వున్నా తన సవాల్ ను స్వీకరించి ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు ఎందుకు రావడం లేదని ప్రశ్నలు సంధించారు. ఇక పవర్ ప్రాజెక్ట్ మేమే అంటూ కేంద్రంపై వత్తిడి చేయడం మాకు బ్యాంక్ లో వేసేయండి పనులు మేం చేసుకుంటామనడం, నవయుగ నష్టానికి ముందుకు వచ్చిందని, పేరు కోసం వచ్చిందని అంటూ అబద్ధాలు చెప్పి 2017 ఎస్సార్ ధరలకే ఆ కంపెనీకి ఒక బిట్ పని కట్ చేసి అప్పగించింది నిజమా? కాదా? అని అడిగారు అరుణ కుమార్. పోలవరం ప్రాజెక్ట్ కోసం ప్రజల తరపున గత రెండు మూడేళ్ళుగా గొంతు చించుకు ప్రశ్నిస్తే తనకు ఏ ఒక్కరు సమాధానం ఇవ్వకపోగా మంత్రి దేవినేని తాను మెయిల్స్ పెట్టి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆరోపించడం ఏమిటని నిలదీశారు.

పార్లమెంట్ లో అంతా డ్రామా...

పార్లమెంట్ లో అంతా డ్రామా నడుస్తుందని బిజెపి కావాలనే ఏపీపై చర్చకు సిద్ధపడటం లేదని వారికే చిత్తశుద్ధి ఉంటే వెల్ లో అల్లరి చేసే వారిని సస్పెండ్ చేసి అవిశ్వసాన్ని స్వీకరించి చర్చ జరపవచ్చన్నారు. సభ ఆర్డర్ లో లేకుండా చర్చలు జరిగిన సందర్భాలు, హెడ్ కౌంట్ జరిగిన సందర్భాలను ఉండవల్లి ఉదహరించారు. టిడిపి అల్లరి చేస్తున్న ఎంపీలు పార్టీలతో సంప్రదింపులు జరిపితే కొంత ప్రయోజనం ఉండేదని పళని స్వామిని, పన్నీర్ సెల్వం, కేసీఆర్ లతో చంద్రబాబు మాట్లాడితే కొంత మెత్తబడొచ్చని చర్చ జరగడం బిజెపితో పాటు టిడిపి కి ఇష్టం లేనట్లు క్లియర్ గా కనపడుతుందన్నారు ఉండవల్లి. గతంలో తాము వెల్ లోకి వెళ్లినందుకు సస్పెండ్ చేశారని, విభజనకు అడ్డుపడినప్పుడు పార్టీ బహిష్కరించి లోపలి కి రాకుండా చేసిందని, కనీసం ఏపీ ప్రజల ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ మీరాకుమార్ ఏకపక్షంగా ఆనాటి గోల లో బిల్లు ఆమోదించడం హెడ్ కౌంట్ అన్ని అయిపోయినట్లు చెప్పడం గుర్తు తెచ్చుకోవాలని ఇప్పుడు బిజెపి అదే డ్రామా ఆడుతోందన్నారు. భవిష్యత్తులో పార్లమెంట్లో ఏ ప్రధానిపై కూడా ఇక అవిశ్వాసం రావడం జరగకపోవొచ్చన్నారు ఉండవల్లి. ప్రజాస్వామ్య నిబంధనలను బిజెపి తుంగలోకి తొక్కేస్తుందని దుయ్యబట్టారు ఆయన.

అవినీతి వుంది కాబట్టే ...

లోకేష్, చంద్రబాబు లపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయని పవన్ ఆరోపణల్లో తప్పేమిటని వాటికి సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు ఎందుకన్నారు ఉండవల్లి. బిజెపి ఏజెంట్ జగన్ అని కాసేపు తరువాత పవన్ కళ్యాణ్ అంటూ నాలుగేళ్లు ఆ పార్టీతో అంటకాగిన టిడిపి అనడం విడ్డురమన్నారు. గుంటూరు సభలో పవన్ మాట్లాడింది తన స్క్రిప్ట్ అంటూ తొలిరోజు ఆ తరువాత బిజెపి పై నెట్టేశారని విమర్శించారు ఉండవల్లి. ప్రత్యేక హోదా కాదని ప్యాకేజి అంటే ప్రజలు మీ వెంటే ఉండాలన్నారు ఇప్పుడు మాట మార్చి మళ్ళీ హోదా కావాలంటే ప్రజలంతా నా వెనుక నిలబడాలని చంద్రబాబు చెప్పడాన్ని ఘాటుగా విమర్శించారు అరుణ కుమార్.

విజయసాయి రెడ్డి పిఎంఓ కి వెళితే తప్పేంటి ...

పార్లమెంట్లో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి పిఎంవోలోకి వెళితే తప్పేంటని అరుణ కుమార్ ప్రశ్నించారు. అదేదో పెద్ద విషయం గా కుట్రగా అసెంబ్లీలో బాబు స్థాయి వ్యక్తి ప్రస్తావించడం హాస్యాస్పదమని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా నిజం చెప్పాలని అవన్నీ వదిలి అబద్ధాలు ప్రచారం సాగించడం ఏమిటన్నారు అరుణ కుమార్. పోలవరం అన్ని సార్లు వెళ్ళా ఇన్నిసార్లు వెళ్ళా అని చెప్పే సీఎం వర్ట్యువల్ రివ్యూ అంటూ ఇంట్లో కూర్చుని టివిలో చూసినా మినిట్స్ లో అసలు ముఖ్యమంత్రి ప్రస్తావనే లేదని మరీ ఇంత డ్రామా ఏమిటని నిలదీశారు ఉండవల్లి.

Similar News