బడ్జెట్ బాజా బరాత్

Update: 2018-03-08 14:30 GMT

చెవుల తుప్పు వదలగొట్టేశారు. లక్షాతొంభైవేల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని హోరెత్తించారు. సంక్షేమ స్వరాలాపన చేశారు. అసలుకు, ఆచరణకు పొంతన లేని పద్దును పట్టాలపైకి ఎక్కించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ ద్వారా ఎన్నికల బాజా మోగించేసినట్లే. ఒకవైపు కేంద్రంతో ఘర్షణ కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థిక గండాలను అధిగమించి ఎంతవరకూ అమలుకు నోచుకుంటాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల దిశలో రాజకీయ ఊరేగింపును ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా బడ్జెట్ ను పక్కా సమీకరణలతో రూపొందించారని రాజకీయవేత్తలు పేర్కొంటున్నారు. కులాలవారీ నిధుల కేటాయింపు, నిరుద్యోగ భృతి, సంక్షేమ ఫలాల పేరిట నిధుల పప్పుబెల్లాలు పంచేయాలనే వ్యూహంతో రూపుదిద్దిన బడ్జెట్ దాదాపు ఎన్నికల ప్రణాళికను తలపించింది.

ఎలక్షన్ సైరన్....

2018-19 బడ్జెట్ ద్వారా రాష్ట్రప్రభుత్వం ఎన్నికల సైరన్ మోగించింది. కులాలవారీ తాము చేపడుతున్న పనులు, సహాయాలు, సంక్షేమ కార్యక్రమాలను ఏకరవు పెడుతూ తాము సమాజంలో అందరి బాగుకు కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. అదే సమయంలో కేంద్రం సహకరించి ఉంటే మరింతగా మీ మేలు కోరుకునేవాళ్లమంటూ బీజేపీపై కొంత ఆక్షేపణీయ విమర్శలనూ గుప్పించారు. వ్యవసాయ రంగాన్ని ప్రత్యేక పద్దుగా చూపించేందుకు అగ్రిబడ్జెట్ ను ప్రతిపాదించడమూ జనాభాలో అత్యధిక శాతమున్న రైతాంగాన్ని ఆకట్టుకునే ప్రయత్నంగానే చూడాలి. అయితే తాజా బడ్జెట్ పూర్తిస్థాయి అమలుపై మాత్రం ఆర్థిక వేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న వనరులు, పన్నుల ఆదాయం, కేంద్ర గ్రాంట్లు, ఎఫ్ ఆర్ బీఎం కు లోబడి అప్పు చేయగల సామర్థ్యం, రుణ చెల్లింపులు మొత్తం మదింపు చేసుకుంటే 1.40 లక్షల కోట్ల నుంచి 1.50 లక్షల కోట్ల కే బడ్జెట్ పద్దును పరిమితం చేయాల్సి ఉంటుందనేది అంచనా. అయితే ఎన్నికల ఏడాది కావడంతో తాము గొప్పగా ఖర్చు చేయనున్నామని చెప్పుకునే క్రమంలో భాగంగా బడ్జెట్ పరిమాణాన్ని భారీగా పెంచేశారు. వాస్తవ అమలు పూర్తయ్యేనాటికి 30 శాతం కోత పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ మేరకు శాఖల వారీ కేటాయింపులకు కూడా కోత పడుతుందన్నమాట.

నిరుద్యోగుల ‘కాపు’...

తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో రైతు రుణమాఫీతోపాటు మరో రెండు ప్రధాన హామీలు ఒకటి కాపు రిజర్వేషన్లు, రెండు నిరుద్యోగ భృతి. మొదటిది జనాభా పరంగా ప్రధానమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను ఆకర్షించేందుకు ఉద్దేశించింది. రెండోది ఉపాధి పొందలేకపోతున్న నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకున్నది. కాపుల రిజర్వేషన్లపై తీర్మానం ఆమోదించి పంపినప్పటికీ కేంద్రం తొక్కిపట్టింది. రాజ్యాంగ పరమైన ఆటంకాలు ఉండటంతో ఈ రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని సంతృప్తి పరిచేందుకు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. గడచిన రెండేళ్లలో ఈ సంస్థకు నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే సాగింది. ఈ ఏడాది వెయ్యికోట్ల రూపాయలు కేటాయించారు. చిన్న కుటీర పరిశ్రమలు,స్వయం ఉపాధి పొందదలచిన కాపు యువతకు ఈనిధులు సంతృప్తి కలిగిస్తాయనే భావనలో ఉంది టీడీపీ. అదే విధంగా నిరుద్యోగ భృతి గురించి కూడా తొలిసారిగా స్పందించి నిధుల కేటాయింపు చేశారు. అయితే కేవలం వెయ్యికోట్ల రూపాయలనే ఈ పద్దులో చూపడం వల్ల సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయనే నమ్మకం లోపించింది. ఆంధ్రప్రదేశ్ లో చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య ఇరవై లక్షల వరకూ ఉంటుందని అంచనా. కానీ ఇప్పుడు కేటాయించిన నిధులు ఏమూలకూ సరిపోవంటున్నారు. కనీసం మూడువేల కోట్ల రూపాయలు నిరుద్యోగభృతి నిమిత్తం అవసరం. హామీ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అది ఎంతవరకూ ఓట్ల వర్షం కురిపించగలదో వేచి చూడాలి.

అభివృద్ధా..అదెక్కడ?

బడ్జెట్ లో కనిపిస్తున్న ప్రధాన లోపం పెట్టుబడి వ్యయం, రెవిన్యూ వ్యయం మధ్య చాలా వ్యత్యాసం కనిపించడం. ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ, సంతులనంతో కూడిన అభివృద్ధి కనిపించాలంటే పెట్టుబడి వ్యయం, రెవిన్యూ వ్యయాలు 1;2 నిష్పత్తిలో ఉండటం మేలు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ది పనులకు వినియోగించే నిధులు మొత్తం బడ్జెట్ లో కనీసం 33 శాతం అయినా ఉండాలి. ఇక జీతభత్యాలు, ప్రభుత్వ నిర్వహణ , ఇతర ఖర్చులు 67 శాతం వరకూ ఉంటుంటాయి. కానీ ఏపీ సర్కారు ఈ బ్యాలెన్సును తొలి నుంచీ పాటించడం లేదు. తాజా బడ్జెట్ లో 1.50 లక్షల కోట్లు రెవిన్యూ ఖర్చు ఉండగా, పెట్టుబడి కేవలం 30 వేల కోట్ల లోపునకే పరిమితమైంది. అంటే రెవిన్యూ వ్యయంలో పెట్టుబడి వ్యయం అయిదోవంతునకే కుదించుకుపోయింది. ఆర్థిక లోటు కూడా 25 వేల కోట్ల రూపాయల పైచిలుకు చేరింది. ఇవన్నీ ఆర్థిక అనారోగ్యానికి చిహ్నాలుగానే భావించాలి. నిజానికి కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయరు. దీంతో అభివృద్ధి చిరునామా గల్లంతవుతోంది. కేవలం అప్పులు తెచ్చి సర్కారును నిర్వ హించుకోవడమే పరిపాలన అన్నట్లుగా మారుతోంది. ఎన్నికల ఏడాది ఈ తంతే చోటు చేసుకోబోతోంది.

కొర్రీల కొర కొర...

కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో పాలనపరమైన ఆటంకాలు కూడా టీడీపీ ప్రభుత్వానికి చిక్కులు కల్పించవచ్చు. ఉపాధి హామీ పథకం, పోలవరం, రాజధాని నిర్మాణం వంటి అంశాల్లో రాష్ట్రప్రతిపాదనలకు కొర్రీలు వేసే అవకాశాలున్నాయి. గతంలోనే ఉపాధి హామీ నిధుల ఖర్చులో లోపాలు చోటు చేసుకుంటున్నాయంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. రాజకీయ ఒత్తిడితో ఆయా ఫిర్యాదులను టీడీపీ ప్రభుత్వం పక్కనపెట్టించగలిగింది. ఇప్పుడు అటువంటి వాటిని తిరగదోడే అవకాశాలున్నాయి. తాజా బడ్జెట్ లో కూడా 4 వేల కోట్ల రూపాయల పైచిలుకు ఉపాధి నిధులపై రాష్ట్రప్రభుత్వం అంచనాలు వేసింది. ఏదో సాకు చూపి వీటిని నిలుపుదల చేస్తే గ్రామ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీల్లో అసంత్రుప్తి రగులుకుంటుంది. పోలవరం నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం శ్రద్ధ చూపుతున్నట్లుగా బడ్జెట్ కేటాయింపులను బట్టి తేటతెల్లమవుతోంది. దాదాపు తొమ్మిదివేల కోట్ల రూపాయలు ఇందుకు వెచ్చించనున్నట్లుగా పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో నిధుల విడుదల కేంద్రం బాధ్యత. ఈ నిధుల విడుదల , వ్యయం విషయంలో కూడా కొర్రీలు వేసి పెండింగులో పెట్టే ప్రమాదం ఉంది. కొత్త ప్రాజెక్టుల మంజూరు మాట మరిచిపోవాలసిందే. ఇప్పటికే ప్రారంభమైన జాతీయ విద్యాసంస్థలు, కార్పొరేషన్లు ఇంకా శైశవ దశలో నిర్మాణంలో ఉన్నాయి. వీటి విషయంలో ఆటంకాలు, అంతరాయాలు కూడా పొంచి ఉన్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News