రాజకీయాల్లోకి వచ్చేది పదవుల కోసం. పదవులు లేకపోతే.. రాజకీయాలే లేవు! ఈ క్రమంలోనే అనేక మంది నేతలు పార్టీలు సైతం మారి పదవులు అందుకున్నారు. ఈ విషయంలో ఎవరూ ఎవరికీ తీసిపోరు! అతిరథ మహారథులు అనదగిన నేతలే.. పార్టీలు మారి ప్రయోజనాలు అందుకున్నారు. అందుకుంటున్నారు. ఇలాంటి వారి జాబితాలో ఎక్కిన పేరే బొబ్బిలి రాజవంశానికి చెందిన సుజయ కృష్ణ రంగారావు! రాజకీయంగా అనేక అనుభవాలను సొంతం చేసుకున్న రాయల్ ఫ్యామిలీ నుంచి వంశపారంపర్యంగా రాజకీయాల్లోకి వచ్చారు సుజయ్! అత్యంత సౌమ్యుడిగా, వివాద రహితునిగా పేరొందారు. బొబ్బిలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుజయ్.. తండ్రి కాంగ్రెస్ ఎంపీగా, అనంతరం స్థానిక సంస్థల ఎంఎల్‌సీగా కూడా ఎన్నికయ్యారు.
వారసత్వంగా పాలిటిక్స్ లోకి వచ్చి....
ఈ క్రమంలోనే సుజయ్‌కి కూడా వారసత్వంగా రాజకీయాలు అబ్బాయి. 2004లో అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తునిగా దగ్గరైన సుజయ్.. అప్పటి ఎన్నికల్లో బొబ్బిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2009లోనూ సుజయ్ అక్కడి నుంచే విజయం సాధించారు. స్థానికుల్లో సుజయ్‌కు ఉన్న ఫాలోయింగ్ బాగా కలిసివచ్చింది. ఈ రెందు దఫాలలోనూ సుజయ్.. అనేక కీలక పదవులు అనుభవించారు. ఇక, 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉంటే ప్రయోజనం లేదని గ్రహించిన ఆయన అప్పటికి మంచి ఫాంలో ఉన్న వైఎస్ తనయుడు జగన్ నేతృత్వంలోని వైసీపీలోకి చేరారు. అప్పటి ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అయితే, అనూహ్యంగా అధికారంలోకి రావాల్సిన పార్టీ.. ప్రతిపక్షానికే పరిమితం అయింది.
మంత్రి పదవి కోసమే....
దీనికి తోడు పార్టీ పుంజుకుంటుందన్న దాఖలా కూడా కనిపించలేదు. దీంతో పార్టీ మార్పు తప్ప మరో పరిస్థితి కనిపించలేదు. దీంతో సుజయ్.. పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. సుజయ్ టీడీపీలోకి జంప్ వెనక బొత్స సత్యనారాయణ కూడా ప్రధాన కారణం. బొత్సకు రాజకీయంగా పడని సుజయ్ ఫ్యామిలీ ఆయన వైసీపీలోకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ బొత్స పార్టీలోకి వచ్చినప్పుడు సుజయ్ ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా చేసుకుంటానని చెప్పినా బొత్స ఎంట్రీ ఇచ్చాక సుజయ్‌కు ఇబ్బందులు తప్పలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూడా వైసీపీని సాధ్యమైనంత గా వీక్ చేయాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌కు టీడీపీ పావులు కదిపింది. దీనికి సుజయ్ నేరుగా వచ్చి పడ్డారు. మంత్రి పదవి ఇస్తామన్న ఆశతో సుజయ్ పార్టీ మారారు. అయితే, మంత్రిగా ఆయనకు పదవి అయితే దక్కింది కానీ, ఆయన అనుకున్న రేంజ్ మాత్రం దక్కలేదని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా పనేమీ లేకుండా ఉన్న ఏకైక శాఖ గనుల శాఖ. దీనిలో ఏ పనులూ జరగడం లేదు.
పని లేని శాఖలో...
ఇలాంటి దానిని తెచ్చి సుజయ్ చేతిలో పెట్టారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సుజయ్‌ను మంత్రిగా తీసుకున్న బాబు.. ఆయనకు గనుల శాఖను అప్పగించారు. దీంతో ఉన్నపళంగా సుజయ్‌లో ఆందోళన మొదలైంది. తాను అనుకున్నది ఏమిటి? దక్కింది ఏమిటి? అని తనసహచరులతో పదే పదే చెప్పుకొని బాధపడుతున్నారని సమాచారం. ఇదిలావుంటే, సుజయ్ అలా మంత్రిగా బాధ్యతలు చేపట్టారో లేదో గుంటూరులోని క్వారీలో పెద్ద ఎత్తున పేలుడు జరిగి ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా అలజడి రేగింది.
అంతా గంటాదే హవా....
చంద్రబాబు చాలా సైలెంట్‌గా దీనిని మేనేజ్ చేసేశారు. ఇక, ఆ తర్వాతనైనా సుజయ్ పాత్ర బాగుందా? అంటే అదీ లేదు. దీంతో ఆయన తీవ్ర డిప్రెషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. పదవి కోసం పార్టీ మారినా ఫేట్ మారలేదని అంటున్నారు. నిజానికి విజయనగరం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా గంటా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో ఆయనే పర్యటిస్తూ.. కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. విజయనగరం జిల్లా మంత్రి సుజయ్‌కృష్ణానా ? లేకా ? గంటానా ? అన్న సందేహాలు ఆ జిల్లా వాసులకే వస్తున్నాయి. దీంతో సుజయ్‌కు కాలు చెయ్యి కూడా ఆడని పరిస్థితి నెలకొందని అంటున్నారు. చంద్రబాబు కూడా ఎన్నో ఆశలు, అంచనాలతో మంత్రి పదవి ఇస్తే సుజయ్ జిల్లాలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే పరిస్తితి కొనసాగితే.. మంత్రి పదవిని స్వయంగానే త్యజించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరి ఏంజరుగుతుందో ? చూడాలి.