ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ గేమ్ మొదలై పోయింది. ప్రజల జీవనంతో ముడిపడిన ప్రాజెక్టును ఓట్లు కురిపించే రాజకీయ మస్కాట్ గా మార్చేసేందుకు ప్రధాన పక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన పోలవరం నిర్మాణానికి రంగు రుచి వాసన కలిపి రాజకీయ మసాలా దట్టిస్తున్నారు. పనులు సాగుతున్న తీరు, నిధుల లభ్యత, భూ సేకరణ చేయాల్సిన ప్రాంతం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటే 2019 ఎన్నికలకు ముందుగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యమని సాంకేతిక నిపుణులు తేల్చి చెప్పేస్తున్నారు. 2018 నాటికే దీనిని పూర్తి చేసి చూపిస్తామని రంగంలోకి దిగిన చంద్రబాబు నాయుడు ఈ విషయం తెలిసి ముందుగా తానే ఆట మొదలు పెట్టేశారు. ఉలిక్కిపడిన బీజేపీ ప్రతివ్యూహంతో పావులు కదుపుతోంది. ఆటలో అరటిపండులా మిగిలిపోవడం ఇష్టం లేని జనసేన పోలవరం పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సుద్దులు చెబుతూ కొత్త పార్టీకి పాయింట్లు తెచ్చిపెట్టాలని తొలి అడుగు వేసింది. రాష్ట్రవిభజనతో శుష్కించిపోయిన కాంగ్రెసు వట వృక్షం పోలవరం ఇచ్చే రాజకీయ ఊటతో ఊపిరిపోసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రాజెక్టు ఆగడం ఖాయం. అది తమ పార్టీకి వరంగా మారడమూ తథ్యమే అన్నట్లుగా విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది వై.సి.పి.
సైకిల్ గాలి తీసేస్తోంది...
రాష్ట్రం మొత్తానికి ప్రయోజనాలు సమకూర్చి పెట్టే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల వచ్చే కీర్తి,ప్రతిష్ఠలను తెలుగుదేశం పార్టీ , ప్రభుత్వం ఖాతాలో వేసుకోవాలనే దురాశతో ముందూ వెనకా చూసుకోకుండా దీనిని మేమే చేపడతామంటూ చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించారు. సాంకేతిక అనుమతులు మొదలు నిధుల విడుదల వరకూ అనేకానేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్రమే చేపట్టాలని చట్టంలో సైతం స్పష్టంగా ఉంది. అయినా ప్రతివిషయాన్ని రాజకీయ కోణంలో చూసే చంద్రబాబు ఈ ప్రాజెక్టు క్రెడిట్ బీజేపీకి, కేంద్రానికి పోకుండా చేయాలనే వ్యూహంతో ప్రతివారం సమీక్షలు, వర్చువల్ తనిఖీల పేరటి ఏడాదికాలంగా హడావిడి చేస్తున్నారు. మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ దీనిని చంద్రబాబు మాత్రమే పూర్తి చేస్తున్నారన్నంత హంగామా సృష్టించారు. నిధులు, అనుమతులు ఇచ్చే కేంద్రం పేరు నామమాత్రం చేసేశారు. ఈ విషయాన్ని గ్రహించే సబ్ కాంట్రాక్టులు, టెండర్ల విధానంలోని లోపాలకు చెక్ పెట్టేందుకు పూనుకుంది బీజేపీ నేతృత్వంలోని కేంద్రం. పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టు పూర్తి కాకపోతే అందుకు కేంద్రమే కారణమన్న రీతిలో అసెంబ్లీ సాక్షిగా ప్లేటు ఫిరాయించేశారు చంద్రబాబు. కీలెరిగి వాత పెట్టిన కేంద్రం దెబ్బకు తెలుగుదేశం ప్రభుత్వం కుయ్యోమొర్రో అనక తప్పని స్థితి ఏర్పడింది. చంద్రబాబుకు పగ్గాలు వేయడంతోపాటు కేంద్రమే నిధులు ఇస్తోందన్న విషయం సాక్షాత్తు రాష్ట్రప్రభుత్వమే అనుక్షణం స్మరించేలా , ప్రతి సారీ తమ ముందు దేబిరిల్లేలా పథకం రచించారు కమలనాథులు. అందుకే పదిహేను రోజులకోసారి నేను కూడా పోలవరం సమీక్ష చేస్తానంటున్నారు కేంద్రమంత్రి గడ్కరీ. దీంతో బాబు దూకుడుకు పగ్గాలు వేసేసినట్లే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు చేతులు కట్టుకుని చెప్పినట్లు వినాల్సిందే.
మరిచిపోవద్దు ..మమ్మల్ని...
ఏపీ ప్రజలు కాంగ్రెసు పార్టీని తుడిచిపెట్టేశారు. అసలు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా తామే చట్టంలో చేర్చామంటూ, కాంగ్రెసు మళ్లీ రాష్ట్రంలో ఊపిరి పోసుకునేందుకు దీనిని ఊతంగా చేసుకోవాలని యత్నిస్తోంది. గడ్కరీ ని కాంగ్రెసు సభ్యులు కలిసి చంద్రబాబు నాయుడిని ఈ బాధ్యతలనుంచి తప్పించి కేంద్రమే చేపట్టాలని అధికారికంగా వినతి పత్రం అందించారు. మరోవైపు హైకోర్టులో పోలవరం నిర్మాణం పూర్తి చేయాలంటూ పిటిషన్ వేశారు. ఇంకో వైపు రాజ్యసభలో ఈ నెల 22 వ తేదీన ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టేందుకు రాజ్యసభ సభ్యులు కేవీపీరామచంద్రరావు అనుమతి సంపాదించారు. ఇలా బహుముఖాలుగా తమ పోరాటాన్ని కొనసాగించడం ద్వారా 2019 ఎన్నికల నాటికి ఎంతోకొంత బలపడి అస్తిత్వాన్ని అయినా నిలుపుకోవచ్చనే దింపుడు కళ్లెం ఆశతో పొలిటికల్ గేమ్ లోకి దిగింది కాంగ్రెసు. జాతీయస్థాయి నాయకుల మద్దతును కూడా కూడగడుతున్నారు. రానున్న సమావేశాల్లో లోక్ సభలో సైతం పోలవరం ప్రస్తావన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
దొందూ దొందే..
అసలు పోలవరం విషయంలో మీ ఇద్దరిదీ తప్పే అంటూ జూనియర్ పార్టనర్ బీజేపీ, టీడీపీలను తప్పుపడుతోంది. పవన్ కల్యాణ్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి వచ్చిన తర్వాత అసలు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును తీసుకోవడమే తప్పంటూ తేల్చేశారు. ఒప్పుకున్న తర్వాత దానిని పూర్తి చేసి తీరాల్సిందేనన్నారు. భూసేకరణ విషయంలో నిధులను కేంద్రమే భరించాలన్నారు. శ్వేతపత్రం విడుదల చేయండి అవసరమైతే కేంద్రంతో పోరాడదామంటూ తన స్నేహహస్తాన్ని టీడీపీకి అందించారు. ఈ రకంగా ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన ఓటు బ్యాంకును పటిష్ఠం చేయాలనుకుంటున్నారు పవన్. రాజకీయాల్లోకి లేటుగా వచ్చినా లేటెస్టు విషయాలను వదిలేది లేదంటూ తొలి పోరాట వేదికగా లాంగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు పోలవరాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ సమస్య ఎన్నికల వరకూ కొనసాగేందుకు అవకాశం ఉంటుంది.
భలే మంచి బేరం...
పోలవరం రూపంలో తమ రొట్టె విరిగి నేతిలో పడుతుందని వై.సి.పి. సంబరాలు చేసుకొంటోంది. టీడీపీ, బీజేపీల మధ్య విభేదాలు ఏర్పడటం కూడా ఆ పార్టీ ఆనందానికి మరో కారణం. ఈ నిర్మాణం నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి కావడం అసాధ్యం. పోలవరానికి సంబంధించి కాలువలు, కొన్ని పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని ఎన్నికలకు ప్రధానాంశం చేయబోతున్నారు. అదే సమయంలో వై.సి.పి. అధికారంలో ఉంటే రాజశేఖరరెడ్డి చేపట్టిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉండేవారమని చెప్పుకునేందుకు కూడా వారికి అవకాశం వచ్చింది. తెలుగుదేశం పార్టీపై ఆధిక్యం సాధించడానికి, రైతాంగం మద్దతు కూడగట్టడానికి పోలవరాన్ని మించిన బ్రహ్మాస్త్రం ఉండదనేది జగన్ వ్యూహకర్తల ఆలోచన. ఇప్పటికే ప్రాజెక్టు ప్రాంతాన్ని వై.సి.పి. బృందం సందర్శించి రాజకీయ విమర్శలకు తెర తీసింది. అన్ని పార్టీలు కూడా ప్రజల కోణంలో కాకుండా పోలవరం చుట్టూ పొలిటికల్ వార్ గేమ్ కు శ్రీకారం చుట్టడం మాత్రం బాధాకరం. రాజకీయ రొంపిలో ప్రాజెక్టు మరింత ఆలస్యమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.
-ఎడిటోరియల్ డెస్క్