అధికార పక్షానికి అభయం ఇవ్వడం, ప్రతిపక్షాల్లో ఆశలు రేకెత్తించడం మొత్తానికి మొత్తంగా అందరికీ అంతా బాగుందన్న సందేశంతో ఊహల్లో విహరింపచేసే లక్ష్యంతో పొలిటికల్ పంచాంగం ఈ ఏడాది కూడా సాగిపోయింది. భవిష్యత్తు బంగారుమయమంటే ఎవరికైనా కొండంత భరోసా. ఆశ మనిషికి జీవం పోస్తుంది. ఇంధనమై నడిపిస్తుంది. అందులోనూ రాజకీయ పార్టీల్లో పనిచేసేవారికి అధికారమిచ్చే కిక్కే వేరు. అందుకే పవర్ కోసం పాకులాడుతుంటారు. విళంబి నామసంవత్సరంలో రాజకీయం కొత్తరంగులు సంతరించుకుంటుంది. ఎన్నికల ఏడాదిగా దీనిని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే రాజకీయ జోస్యాలు జోరందుకున్నాయి. పంచాంగాల్లోనూ దానిని చొప్పించి భవిష్యత్ అవకాశాలను బేరీజు వేసుకునే పనిలో పడ్డాయి పార్టీలు. నాయకులకు దీనిపై పెద్దగా నమ్మకం ఉండి కాదు, కానీ ప్రజల్లో ఎక్కువమంది విశ్వసిస్తారు కాబట్టి తమకు అనుకూలమైన పంచాంగవేత్త ద్వారా తమ పార్టీకి మంచి జరుగుతుందని చెప్పుకోవడంతో సంతృప్తి చెందుతుంటారు. ఈ ఏడాది కూడా అదే జరిగింది. అధికారపార్టీలైన తెలుగుదేశం, టీఆర్ఎస్ లు ప్రభుత్వ నిధులతో భారీగానే పంచాంగ శ్రవణాలు, వేడుకలు జరిపించేసుకున్నాయి. విపక్షాల్లోని జగన్, కాంగ్రెసు , పవన్ కల్యాణ్ లు కూడా తమవంతు పంచాంగ జాతకాలు విప్పి చెప్పించుకున్నారు.
రాజకీయ రసోదయం.....
భారత రాజకీయాల్లో కొత్త శకానికి ఈ ఏడాది మళ్లీ జీవం పోస్తుందని పొలిటికల్ పండితులు పేర్కొంటున్నారు. ఉప్పు, కారం,తీపి, చేదు, పులుపు, వగరుల సమ్మిశ్రమంగానే నేటి భారత రాజకీయమూ నడుస్తోందంటున్నారు. దేశంలోని పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో దాదాపు 25 సంవత్సరాల తర్వాత సమాజ్ వాదీ, బహుజనసమాజ్ పార్టీ చేరువ కావడం కీలక రాజకీయ పరిణామమే. ఉప్పు ,కారం మాదిరిగా కాంట్రాస్టు రుచులతో కూడిన ఈ పార్టీలు కలవడం దాదాపు ఖాయమనేది తాజా ఎన్నికల్లోనే తేలిపోయింది. యూపీ లో ఈ రెండు పక్షాల పొలిటికల్ రెసిపి ఘుమఘుమలాడితే హస్తిన నాసిక అదిరిపోతుంది. ఈ దిశలో చకచకా అడుగులు పడుతున్నాయి. అవసరమైతే తమను తాము తగ్గించుకుని మధ్యవర్తిత్వం వహించేందుకు కాంగ్రెసుపార్టీ నేత రాహుల్, మమతా బెనర్జీ వంటివారు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా పశ్చిమబంగ రాజకీయాలలో బీజేపీ నానాటికీ బలపడేందుకు ఎత్తుగడలు వేస్తోంది. దేశం గర్వించదగ్గ వివేకానంద, రవీంద్రనాథ్ టాగూర్, బకించంద్రఛటర్జీ , సుభాష్చంద్రబోస్ వంటివారు బెంగాల్ నుంచే వచ్చారు. వారంతా తమ సిద్దాంతాలకు ప్రతినిధులే అన్నట్లుగా ప్రచారం ప్రారంభించింది బీజేపీ. ఈ విషయమే మమతను చికాకు పరుస్తోంది. ఈ రాజకీయ వగరు ఆమెను కమలానికి వ్యతిరేకంగా బలమైన కూటమి నిర్మాణం చేయాల్సిన అవసరం వైపు తోసి వేస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాలకు, మరోవైపు మిత్రపక్షాల్లోని కొందరికి బీజేపీ చేదుగా మారిపోయింది. విస్తరణ కాంక్ష కారణంగానే బీజేపీని చూస్తే భయపడాల్సిన పరిస్థితి పార్టీలకు ఏర్పడింది. పొత్తు పెట్టుకున్న చోట్ల క్రమేపీ ఆయా పార్టీలను బలహీనపరచి సొంతంగా తాను బలపడే ప్లాన్ ను అమలు చేస్తోంది బీజేపీ. మైనర్ పార్టీగా మొదలైన ప్రస్థానం మేజర్ పార్టీగా రూపాంతరం చెందుతోంది. ఈరకంగానే ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్ర కమలం పరమయ్యాయి. ఒడిసా ముఖ్యమంత్రి ముందుగానే మేలుకొని దూరం పెట్టారు. మమతతో కూడా ఒకానొక దశలో బీజేపీ పొత్తు కొనసాగింది. కానీ అప్పట్లో మోడీ, అమిత్ షాల బీజేపీ కాకపోవడం వల్ల మిత్రుల నష్టం , తనకు లాభం అన్న రాజకీయ ఎత్తుగడను అనుసరించలేదు. ఇప్పుడెవరూ కూడా బీజేపీతో చేయి కలిపేందుకు సాహసించడం లేదు. కాంగ్రెసు పార్టీనే ఇప్పుడు చిన్నాచితక పార్టీలకు, ప్రాంతీయ పక్షాలకు తీయగా కనిపిస్తోంది. కమలనాథులతో పోలిస్తే కాంగ్రెసుతో చెలిమి చేయడమే మంచిదనే భావన వైపు మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాల్లో అధికారంలోనూ, భాగస్వామిగానూ పవర్ పాలిటిక్స్ లో ఉన్నప్పటికీ బీజేపీ రాజకీయం నానాటికీ పులుపెక్కిపోవడంతో దానిని వదిలించుకునే పార్టీల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నలభైకి పైగా చిన్నాచితక పార్టీలు ఇప్పుడు బీజేపీతో మిత్రులుగా ఉన్నట్టుగా సంఖ్యాపరమైన గణాంకాలు చెబుతున్నాయి. మూడు,నాలుగు పార్టీలను మినహాయిస్తే మిగిలిన పార్టీల ప్రబావం జాతీయంగా తక్కువ. వాటి పేర్లు కూడా చాలామందికి తెలియవు. కానీ అవి వివిధ రాష్ట్రాల్లో , జిల్లాల్లో స్థానికంగా చాలా ప్రభావం చూపగల పార్టీలు. ఇప్పుడు బీజేపీని భయపెడుతున్న అంశం అదే. ఆయాపార్టీలకు ప్రదాన శత్రువుగా బీజేపీ మారుతూ ఉండటంతో కమలం పార్టీ తనంతతాను సొంతంగా బలపడితే తప్ప వచ్చే ఎన్నికల నాటికి స్నేహహస్తాలు అందించేవారు కరవు అవుతారు.
దక్షిణాది దశ దిశ..
ఉత్తర దక్షిణ భారతాల వైరుద్ధ్య భావన రోజురోజుకీ బలపడుతోంది. కేంద్రప్రభుత్వ తప్పిదాలు దీనికి కొంతకారణం. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం మరొక కారణం. తమిళనాడు ఎప్పుడో జాతీయ పార్టీలకు దూరమైపోయింది. హిందీ వ్యతిరేకత కావొచ్చు. కాంగ్రెసు వ్యతిరేకత కావొచ్చు. ఇక్కడ మాత్రం ప్రాంతీయాధిపత్యమే. తాజాగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెసు, బీజేపీలకు వ్యతిరేక పల్లవి అందుకున్నారు. వీటన్నిటినీ చూసి ద్రవిడనాడు అంటూ సౌత్ ఇండియాను ఏకం చేయాలన్న వాదనను తెరపైకి తెస్తోంది డీఎంకే. ఆ భావన బలపడితే కర్ణాటకలో కూడా జేడీఎస్ వంటి ప్రాంతీయ పార్టీలకు బలం పెరుగుతుంది. దీనిని అడ్డుకోవడానికి జాతీయ పార్టీలు రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెసు పార్టీ నాయకుడైనప్పటికీ కర్ణాటకకు ప్రత్యేక జెండా అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకోవడం, కన్నడ భాష తప్ప హిందీ కుదరదని చెప్పడం దక్షిణాది, ప్రాంతీయ సెంటిమెంటు బలపడుతుందనేందుకు నిదర్శనం. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక గాలులు వీస్తున్న నేపథ్యంలో దక్షిణాది భవిష్యత్ రాజకీయాల్లో కీలకంగా మారబోతోంది. ఇక్కడి నుంచే దేశరాజకీయాల దశదిశ మార్చడానికి పునాది రాళ్లు పడుతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దక్షిణాది నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన వెంకయ్యనాయుడి వంటివారిని రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టి బీజేపీ పక్కనపెట్టేసింది. దక్షిణాది ముఖ్యమంత్రులను చిన్నచూపు చూస్తోంది. ఇది రాజకీయ సెంటిమెంటుగా మారుతోంది. గతంలో దేశ రాజకీయాల్లో సి. రాజగోపాలాచారి, కామరాజ్ నాడార్, నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు వంటివారు జాతీయ రాజకీయాల్లో పెద్దపాత్రలే పోషించారు. ఎన్టీరామారావు, చంద్రబాబునాయుడు కూడా నేషనల్ పాలిటిక్స్ లో కీ రోల్ పోషించారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు, కేసీఆర్, రజనీకాంత్ వంటి వారు జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ సమీకరణలలో బలపడాల్సిన అవసరం ఏర్పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఒక రాజకీయ అనివార్యతగా కనిపిస్తోంది.
-ఎడిటోరియల్ డెస్క్