ఒక్క అడుగు ముందుకు పడదు. బుజ్జగింపులు, నాన్చివేతలు, హామీలు, ఊరడింపులు మాత్రమే సాగుతున్నాయి. ఆందోళనలు కేంద్ర పెద్దలను కరిగించలేకపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతోందంటూ హస్తినవేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పెద్ద సీరియస్ గా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏపీకి చెందిన అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏదో రూపంలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంటుకు కూతవేటు దూరంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. స్వయంగా పార్లమెంటు హౌస్ లోనే టీడీపీ, వైసీపీలు గర్జిస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం కనికరించడం లేదు. రాజకీయ అవకాశాలు, ఆర్థిక పరిస్థితులు, అనుమానాలు, పునరేకీకరణలు కలగాపులగంగా కలిసిపోయి ఏపీ విషయం సంక్లిష్టంగా మారింది. మోడీ, అమిత్ షాలు మినహా వేరే మంత్రులెవ్వరూ చొరవ తీసుకునే పరిస్థితి లోపించింది. తమకెందుకొచ్చిన ఇబ్బందన్నట్లుగా అందరూ తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియని స్థితిలో టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. మిత్ర బంధం తెంచుకోక తప్పని అనివార్య పరిస్థితుల వైపు రాజకీయ గమనం సాగుతోంది.
బాబు పాత్రపై సందేహాలు...
‘కాంగ్రెసు కథ ముగిసింది. ఇక దేశమంతా మనదే. నిత్యం కలహించుకునే విపక్షాలు కలవడం కల్ల. ప్రాంతీయ పార్టీలను ప్రలోభపెట్టో, భయపెట్టో అదుపాజ్ణల్లో ఉంచుకోవచ్చు. ‘ ఇదీ కమల నాథుల ఆలోచన. కానీ కేసీఆర్ లేవనెత్తిన మూడో ప్రత్యామ్నాయం కొంత చికాకు కలిగిస్తోంది. రైతుల సెంటిమెంటు, దక్షిణాదికి అన్యాయం, రాష్ట్రాల హక్కుల హరణ వంటి కీలకమైన అంశాలే అజెండాగా ఈ థర్డ్ ఫ్రంట్ రూపుదిద్దుకోబోతోందన్న విషయం బీజేపీకి కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ అజెండా అనేది కచ్చితంగా తమకు కొంత నష్టం చేకూరుస్తుందనే అంచనాలో ఉన్నారు కమలం పార్టీవారు. నిజానికి జాతీయ స్థాయి రాజకీయాలలో గతంలో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడి నుంచి ఈ తిరుగుబాటు ఉంటుందని బీజేపీ భావించింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగితే విపక్షాలను కూడగట్టగలరని మోడీ, అమిత్ షాలు భావించారు. అయితే చంద్రబాబును రాజకీయంగా అదుపు చేయడం పెద్ద కష్టమేమీ కాదని వ్యూహం కూడా సిద్దం చేసుకున్నారు. వైసీపీ వంటి పార్టీలు తమకెలాగూ సహకరిస్తాయి కాబట్టి స్థానికంగానే చంద్రబాబుకు చుక్కలు చూపించవచ్చని ధీమాగా ఉన్నారు. కానీ తమకు చాలా వరకూ సహకరిస్తున్న కేసీఆర్ నుంచి థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. దీనివెనుక చంద్రబాబు ఆలోచనలు దాగి ఉన్నాయోమోననే కోణంలో బీజేపీ అధిష్టానం ఆరా తీస్తోంది. టీఆర్ఎస్, టీడీపీ ల పొత్తు విషయంలో కేసీఆర్, చంద్రబాబులు ఇటీవల పాజిటివ్ గా మాట్లాడటమే ఈ అనుమానాలకు కారణమవుతోంది.
వైసీపీ వైపు కమలం చూపు...
ఆంధ్రప్రదేశ్ లో కనీస మద్దతు కూడగట్టుకోవాలంటే ప్రధానపక్షాలైన టీడీపీ, వైసీపీలపై ఆధారపడక తప్పదన్న సంగతి బీజేపీకి తెలుసు. టీడీపీతో పొత్తు బంధం తెగిపోతే వైసీపీ కూడా ఎన్నికలకు ముందు బీజేపీతో జట్టుకట్టే అవకాశాల్లేవు. ఎన్నికల తర్వాత వైసీపీ బీజేపీని సమర్థించకతప్పని అనివార్యత ఏర్పడుతుందని మోడీ భావిస్తున్నారు. వైసీపీ తమను టార్గెట్ చేయకుండా వ్యూహాత్మకంగా ప్రత్యేక హోదా అంశంపైనే దృష్టి సారిస్తోందన్న విషయాన్ని బీజేపీ గమనించింది. రాజకీయ మనుగడ దృష్ట్యా, అవిశ్వాస తీర్మానం, ఎంపీల రాజీనామా వంటి అంశాలు పొలిటికల్ టూల్స్ గా వైసీపీ ప్రయోగించడం తప్పేమీ కాదనే భావన కమలనాథుల్లో నెలకొంది. అందువల్ల వైసీపీ తమపై పెద్దగా విమర్శలు చేయడం లేదు కాబట్టి, ప్రతిగా తాము కూడా ఆ పార్టీ పై ఆరోపణలు గుప్పించకూడదనే నియమాన్ని పాటిస్తున్నారు నాయకులు. ఆచరణలో మిత్ర ధర్మాన్ని బీజేపీ, వైసీపీలు పాటిస్తున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీలు మాత్రం రోడ్డున పడి ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ కాన్వాసును కంగాళీగా మార్చేస్తున్నాయి.
పక్కా పాలిటిక్స్...
టీడీపీ ఒత్తిడితో ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు మోక్షం లభిస్తుందా? అంటే పెదవి విరుపులే వినవస్తున్నాయి. రాజకీయ పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. అమిత్ షా అప్పుడప్పుడూ చంద్రబాబు ను పలకరిస్తున్నప్పటికీ మోడీ అసలు పట్టించుకోవడమే మానేశారు. రాష్ట్రానికి సాయం విషయం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకే వదిలేశారు. ఆయన పక్కా నిబంధనల పరిధిలో కేంద్ర అదికారుల సలహాలు, సూచనల మేరకే నడుచుకుంటున్నారు. మూడు, నాలుగు వేల కోట్ల రూపాయల సాయాన్ని మించి తాను ప్రత్యేకంగా ఏపీకి అందించే సాయమేమీ ఉండదని, అందుకు బడ్జెట్ అంగీకరించదని తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందానికి అరుణ్ జైట్లీ స్పష్టం చేసేశారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి విషయాల్లో రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మోడీ, అమిత్ షాల దే ఫైనల్ డెసిషన్. వారిద్దరూ ఇన్వాల్వ్ కాకుండా జైట్టీతో మాట్లాడండి, సురేశ్ ప్రభు చూస్తారనడంలోనే రాజకీయం దాగి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రం డిమాండ్లను అంగీకరించేందుకు సుముఖంగా లేకపోవడంతోనే అగ్రనాయకులు విషయాన్ని నాన్చుతూ దాటవేసే ధోరణిని అనుసరిస్తున్నారనేది విశ్లేషకుల అంచనా.
-ఎడిటోరియల్ డెస్క్