దేశ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ, ప్రజల ప్రాథమిక హక్కులకు పూచీకత్తుగా నిలిచే సర్వోన్నత న్యాయస్థానమే నేడు న్యాయం మీరే చెప్పాలంటే ప్రజాకోర్టును అభ్యర్థిస్తోంది. కోర్టు ధిక్కారం వంటి రక్షణ కవచాల ఉక్కుచట్రంలో విమర్శకులు కన్నెత్తి చూసే సాహసం చేయలేని ఒక మహోన్నత వ్యవస్థ ముదురుతున్న తన రుగ్మతలను నేటికైనా బహిరంగం చేయగలిగింది. మాలో లోపాలున్నాయి. మమ్మల్ని మేము మార్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే సుప్రీం కోర్టు స్వతంత్ర ప్రతిపత్తి ని కాపాడుకోవాలంటూ సీనియర్ న్యాయమూర్తులే ఆవేదన చెందారు. ఆక్రోశం వెలిబుచ్చారు. ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెళ్లగక్కారు. న్యాయవ్యవస్థ ఉన్నతప్రమాణాలను కాపాడటానికి ఈ చర్య ఉపకరిస్తుందా? ఇప్పటికే దిగజారిన విలువలను బట్టబయలు చేయడం ద్వారా ప్రజల్లో పలచనైపోతుందా? ఏం జరగబోతోందన్నదే నేడు సర్వత్రా చర్చనీయమవుతోంది.
లోపాల ‘లా’ వా ఉప్పొంగింది....!
హైకోర్టులు, సుప్రీం కోర్టుల న్యాయమూర్తుల నియామకాల్లో లోపాలున్నాయని చాలా కాలంగా విమర్శలున్నాయి. దిగువస్థాయి న్యాయాధికారుల నియామకాలకు ప్రతిభాపరీక్షలతో పాటు అన్నిరకాలుగా నిర్ధరించుకున్న తర్వాత మాత్రమే నియామకాలు జరుగుతాయి. కానీ రాజ్యాంగానికి నిర్వచనం చెప్పే హైయర్ జ్యుడిషియరీ లో మాత్రం కేవలం ప్రాక్టీసు ఆధారంగా కొలీజియం సిఫార్సులతో నియామకాలు సాగిపోతున్నాయి. న్యాయమూర్తులు తమను తామే నియమించుకునే ఈ ప్రక్రియ ఒక రకంగా స్వతంత్ర ప్రతిపత్తికి అద్దం పడుతుంటే, మరోవైపు ఆశ్రితపక్షపాతానికి ఆస్కారం కల్పిస్తోందన్న విమర్శలనూ తోసిపుచ్చలేని పరిస్థితి. అసలే న్యాయవ్యవస్థను అంకుల్ సిండ్రోమ్ ఆరోపణ వెన్నాడుతోంది. బంధుమిత్రులు ప్రాక్టీసులు చేయడం అనుచిత లబ్ధికి వీలు కల్పిస్తోందన్నదే ఈ సిండ్రోమ్ లక్షణం. తాజాగా సీనియర్ న్యాయమూర్తులు అసలు సుప్రీం పరిపాలనే సజావుగా లేదని తేల్చేశారు. వివిధ కేసులకు బెంచీల ఎంపికల నుంచి కేసుల కేటాయింపుల వరకూ అసంబద్దంగా, హేతురహితంగా సాగుతోందన్న విమర్శ సుప్రీం కోర్టు నిష్పాక్షికతనే ప్రశ్నార్థకం చేసింది. గతంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా చేసిన కేజీ బాలకృష్ణన్ పై ఆరోపణలొచ్చాయి. అనేకమంది హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ న్యాయవ్యవస్థలో అంతర్భాగమైన న్యాయమూర్తులు మాత్రం బహిరంగంగా వీటిని ప్రకటించిన దాఖలాలు లేవు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు సంబంధించిన కేసు, అమిత్ షా ఆరోపణలు ఎదుర్కొన్న కేసును విచారించిన జడ్జి లోయ మరణం, కొలీజియం లో లుకలుకలు..ఇలా అనేక అంశాలపై లోపాలు ఒకటొకటిగా బయటికి వస్తున్నాయి.
కొలీజియం కొర్రీలు...
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ , మరో నలుగురు సీనియర్ మోస్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపిక, బదిలీల విషయాలను పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు ఈ కొలీజియంలోని నలుగురు సీనియర్లు కూడా సీజేఐ కి వ్యతిరేకంగా అభియోగాలు మోపారు. దీంతో కొలీజియం పనితీరే అనుమానాస్పదమైపోయింది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్స్ మెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని గతంలో పార్లమెంటు ఆమోదించిన చట్టాన్నే సుప్రీం కొట్టేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు, న్యాయశాఖమంత్రి మరో ఇద్దరు పౌరప్రముఖులతో న్యాయమూర్తుల నియామక కమిషన్ ను ఏర్పాటు చేయాలనేది ఈ చట్టం ఉద్దేశం. పౌరప్రముఖుల ఎంపికలో ప్రధాని, ప్రతిపక్షనాయకుడు, సీనియర్ మంత్రి పాలు పంచుకుంటారు. తమ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఇది రాజ్యాంగ విరుద్దమంటూ సుప్రీం కోర్టు కొట్టేసింది. మరిప్పుడు సీనియర్ మోస్టు న్యాయమూర్తుల తిరుగుబాటుకు బదులెవరిస్తారు? భవిష్యత్తులో న్యాయస్థానాలకు నియామకాలు ఎవరు చేస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. స్వతంత్ర భారత న్యాయ వ్యవస్థ చరిత్రలోనే అతి పెద్ద సంక్షోభం తలెత్తినా కేంద్రం గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తోంది. దొడ్డిదారిన సుప్రీం పనితీరులో కేంద్రం జోక్యం చేసుకోవడంతోనే న్యాయమూర్తులు కినుక వహించారనేది ఒక ఆరోపణ.
రాజకీయ ఆజ్యం...
ఎక్కడ అవకాశం దొరికినా తానున్నానని నిరూపించుకునే రాజకీయం సుప్రీం వివాదంలోనూ రంగప్రవేశం చేసింది. రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. స్వతంత్ర సంస్థతో జడ్జి లోయ మరణంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇకపై సుప్రీం వ్యవహారాలపై రాజకీయ నిఘా పెరిగే అవకాశం ఉంది. న్యాయమూర్తులే ఇందుకు ఆస్కారం కల్పించారని చెప్పాలి. ఒకసారి ఆరోపణలు మొదలైన తర్వాత వాటిని కట్టడి చేయడం అంత సులభం కాదు. ఇంత వరకూ న్యాయస్థానం అంటే ఉన్న విశ్వాసానికి కూడా కొంత భంగపాటు కలిగింది. దానిని రాజకీయ నాయకులు మరింత దిగజార్చే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే వామపక్షాలు,కాంగ్రెసు ,అనేక రాజకీయ పార్టీలు బీజేపీపై ధ్వజమెత్తేందుకు సుప్రీంలో లుకలుకలు ఎంతవరకూ ఉపయోగపడతాయనే కోణంలో ఆలోచన చేస్తున్నాయి. ఇకపై సుప్రీం స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ దాని వెనక కేంద్రం హస్తం ఉందేమోనన్న అనుమానపు చూపులు పెరుగుతాయి. వృత్తి ప్రమాణాల సమగ్రతకు, స్వేచ్ఛాయుత నిర్ణయాలకు ఇది ఆటంకం. ఆత్మ సమీక్షకు పూనుకొని తనంతతానుగా లోపాలను సరిదిద్దుకునేందుకు సుప్రీం పూనుకుంటుందా? లేక వ్యక్తిగత విభేదాలతో ఉన్నతవ్యవస్థ పరువు బజారున పడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? అన్న అంశము కాలమే తేల్చాలి. చీఫ్ జస్టిస్ పైనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాజీనామా చేసి విచారణకు అవకాశం కల్పిస్తే సత్సంప్రదాయాన్ని నెలకొల్పినట్లవుతుందని పలువురు న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే న్యాయప్రమాణాలు నిలబడతాయంటున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్