నా మాటే వేదం... నా నిర్ణయం శిలాశాసనం

Update: 2018-03-19 18:29 GMT

అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు. ప్రజలు ఆదరిస్తే మరో నాలుగేళ్లు అధికారంలో కొనసాగేందుకు అవకాశం ఉంది. ప్రజలు మద్దతు తెలిపినా, పార్టీ అంగీకరించినా రెండు సార్లకు మించి ఒక వ్యక్తి అధ్యక్ష పదవి అధ్యక్ష పదవి చేపట్టడానికి అమెరికా రాజ్యాంగం అనుమతించదు. ఎంతటి ప్రజాదరణ గల నాయకుడైనా, పార్టీ మీద ఎంత పట్టున్న నాయకుడు అయినా రెండుసార్లకు మించి అధికారం చేపట్టడానికి అగ్రదేశ రాజ్యాంగం ససేమిరా అంటుంది. భారత రాష్ట్రపతి పదవికి కూడా ఇలాంటి పరిమితి ఉంది. ఒక వ్యక్తి రెండు సార్లకు మించి రాష్ట్రపతి పదవి చేపట్టరాదు. అయితే ఇది రాజ్యాంగనిబంధన కాదు. కేవలం సంప్రదాయం మాత్రమే.

రాజ్యాంగాన్ని సవరించి మరీ....

అందువల్లే ఒక్క రాజేంద్ర ప్రసాద్ మినహా మరే నాయకుడు రెండో దఫా రాష్ట్రపతి కాలేదు. మన పొరుగుదేశం చైనాది కూడా ఇప్పటిదాకా అదే విధానం. ఎంతటి గొప్ప నాయకుడు అయినా రెండు సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టరాదు. ఒక దఫా అయిదేళ్లు, రెండో దఫా మరో అయిదేళ్ల చొప్పున మొత్తం పదేళ్లకు మించి పదవిలో కొనసాగేందుకు చైనా రాజ్యాంగం అనుమతించదు. 1982లో అప్పటి చైనా అధినేత డెంగ్ జియావో పింగ్ ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించారు. మావో అనంతరం మరో జీవితకాల నియంతృత్వ నేత ఉద్భవించకుండా, ముందుచూపుతో ఆయన ఈ మార్పును తీసుకువచ్చారు. ఈ మార్పునకు ఇప్పుడు కాలం చెల్లింది. అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడి పదవీ కాలంపై పరిమితిని ఎత్తివేసింది. ఈ మేరకు రాజ్యాంగాన్ని చేసిన సవరణను ఈ నెల 11న చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం సభలో 2958 మంది అనుకూలంగా ఓటు వేశారు. రెండు ఓట్లను వ్యతిరేకంగా వేశారు. మరో ముగ్గురు సభ్యులు గైర్హాజరయ్యారు. 1954లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ఇప్పటి వరకూ నాలుగు సార్లు సవరణలు చేశారు. తాజాగా జరిగిన అయితో సవరణ అత్యంత కీలకమైనది. ఈ సవరణ ఫలితంగా అధ్యక్షుడికి కాలపరిమితి ఉండదు. ప్రస్తుత అధ్యక్షుడు జి జిన్ పింగ్ జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా జిన్ పింగ్ శక్తిమంతమైన నేతలా అవతరించారు. ఎవరైనా ఆయనను వ్యతిరేకిస్తే దానిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా పరిగణిస్తారు.

ఇక తనకు తిరుగు లేకుండా.....

ఇప్పటివరకూ ఏడుగురు సభ్యులు గల నాయకత్వ కమిటీ ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకునేది. ఇక నుంచి జిన్ పింగ్ మాటకు ఎదురులేదు. తిరుగులేదు. ఆయన మాటే వేదవాక్కు. ఆయన నిర్ణయం శిలాశాసనం. మకుటం లేని మహారాజు. సర్వసామంత చక్రవర్తి. తాజా రాజ్యాంగ సవరణతో చైనా ఏక పార్టీ దేశం నుంచి ఏక నాయకుడి దేశంగా మారనుంది. మావో హయాంలో సాంస్కృతిక విప్లవం వంటి ఘటనల్లో ప్రజలు పెద్దయెత్తున హతులయ్యారు. దీంతో నియంతృత్వ వ్యవస్థను నివారించేందుకు సమిష్టి నాయకత్వ వ్యవస్థను అనుసరిస్తోంది. జిన్ పింగ్ కు ముందు రెండు దఫాలు 1993 నుంచి 2003 వరకూ అధ్యక్షుడిగా పనిచేసిన జియాంగ్ జెమిన్ , 2003 నుంచి 2013 వరకూ ఏడేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగిన హూ జింటావో ఈ వ్యవస్థను ప్రోత్సహించారు. రెండుదఫాల పదవీకాలంతో పాటు అత్యంత కీలకమైన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా వారు తప్పుకున్నారు. చైనా అధ్యక్ష పదవి లాంఛనప్రాయమే. దానికన్నా కమ్యునిస్టు ప్రధాన కార్యదర్శి పదవి, సైనిక కమిషన్ ఛైర్మన్ కీలకమైనవి. అసలైన అధికారాలు అన్నీ ఆయన వద్దనే ఉంటాయి.

అధికారం శాశ్వతం కాదు....

జిన్ పింగ్ చర్యను చైనీయులు ఆమోదించినట్లు కనపడటం లేదు. చైనా పీపుల్స్ ఫ్రంట్ ఆమోదించినప్పటికీ ప్రజల్లో పెద్దగా ఉత్సాహం, సంతోషం వ్యక్తం కావడం లేదు. సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక వ్యాఖ్యలను ప్రభుత్వం తొలగిస్తోంది. ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలనే అనుమతిస్తున్నారు. పదవీ కాలంపై అక్కడక్కడా అసమ్మతి గళాలు వినపడుతున్నప్పటికీ చైనా గట్టిగా సమర్థించుకుంటోంది. పార్టీ అధికారాన్ని, నాయకత్వ ఐక్యతను కొనసాగించడానికి పదవీకాలంపై పరిమితి ఎత్తివేయడం అవసరమని, అనివార్యమని స్పష్టం చేసింది. అధ్యక్ష పదవికి కాలపరిమితిని ఎత్తివేయడమంటే అస్తవ్యస్త పరిస్థితులకు ఆహ్వానం పలకడమేననిచైనా అధికారిక యువజన పత్రిక మాజీ సంపాదకుడు లి డాటాంగ్ హెచ్చరించారు. ఇది దారుణమని, నియంతృత్వానికి దారి తీస్తుందని ప్రభుత్వ సంస్కరణల్లో కీలక పాత్ర పోషించిన మహిళా వ్యాపారవేత్త లింగ్ యింగ్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా కీలక సవరణల రాజ్యాంగాన్ని ఎలా చేస్తారని యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోనిచైనా వ్యవహారాల నిపుణుడు డాలియాంగ్ ప్రశ్నించారు. ఇవేమీ జిన్ పింగ్, ఆయన అంతేవాసులు విన్పించుకునే పరిస్థితుల్లో లేరు. రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చుకున్నా అధికారం శాశ్వతం కాదని చరిత్ర చెబుతోంది. ఇందుకు బోలెడన్ని ఉదాహరణలున్నాయి. ఈ వాస్తవాలను జిన్ పింగ్ ఈరోజు కాకపోయినా, ఎప్పటికైనా గుర్తించక తప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News