త్యాగమా? తెగతెంపులా?

Update: 2018-02-18 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడోపేడో తేల్చేదిశలో కార్యాచరణకు రంగం సిద్దం చేస్తున్నారు. ఎట్టి త్యాగాలకైనా సిద్ధమేనంటూ రాజకీయ ప్రకటన చేశారు. కేంద్రంపై వార్ డిక్లేర్ చేసినట్లే. ‘కాంగ్రెసు పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది. బీజేపీ న్యాయం చేయడం లేదంటూ చేసిన ప్రసంగంలోనే అంతరార్థం స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెసుతో బీజేపీని కూడా ఒకే పద్దులో జమ కట్టి ప్రజల ముందు దోషిగా నిలపాలని తెలుగుదేశం అధినేత నిర్ణయించుకున్నట్లుగా అర్థమవుతోంది. అయిదు కోట్ల ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలి, పోరాటంలో ముందుకు రావాలని కోరడంలోనే ఎత్తుగడ దాగి ఉంది. తెలుగుదేశం రాజకీయ పాచికలు ప్రయోగిస్తూ ఎన్నికల దిశలో సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలను తిప్పికొట్టేలా, ఆ పాపం బీజేపీ నెత్తిన వేసి, సెంటిమెంటుతో సేఫ్ గా 2019 ఎన్నికల ఘట్టం దాటేయాలనే వ్యూహం కూడా కనిపిస్తోంది.

దూకుడు పెంచిన బాబు.....

కేంద్రప్రభుత్వం 2018-19 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇంతవరకూ చంద్రబాబు నాయుడు అయిదు విడతలుగా పార్టీ ప్రముఖుల నుంచి జిల్లా బాధ్యుల వరకూ చర్చలు నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయ కమిటీ ల నేతలు, పొలిట్ బ్యూరో సభ్యుల వరకూ అందరినీ సంప్రతించారు. కేంద్రం అన్యాయం చేస్తోందంటూ ఎలుగెత్తి చాటుతూనే పొత్తు రచ్చ విషయంలో మాత్రం పూర్తి స్పష్టత నివ్వలేదు. సంకేతాలైతే పంపించారు. తన మనోభావాలను గుంభనంగా ఉంచి పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. బాస్ మనసు గ్రహించిన నాయకులు కొందరు తొందరపడ్డారు. మార్చి నాటికే పొత్తు విచ్ఛిన్నం అవుతుందంటూ ప్రకటించి నాలుక కరచుకున్నారు. నిజానికి వాస్తవం గా జరగాలని తలచినది, ఆలోచించినది అదే. పార్టీ అంతాసన్నద్ధంగానే ఉందని గ్రహించిన బాబు బహిరంగంగా బీజేపీపై దాడి మొదలు పెట్టారు. పార్టీ క్యాడర్ కూడా ప్రజల్లోకి వెళ్లి కమలదళాన్ని ఎండగట్టాలనేది చంద్రబాబు ఉద్దేశం. పార్టీ అంతర్గత సమావేశాల్లో సైతం ఇదే సందేశాన్ని అందించారు. పొత్తు రద్దు విషయాన్ని బహిరంగంగా చెప్పకుండానే జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం హైలైట్ చేయాలని నాయకులకు సూచించినట్లు సమాచారం. రెండూ ఒకదానికొకటి ముడి పడి ఉండటంతో నాయకుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. తాను ఆశించిన రియాక్షన్ క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి కనిపించకపోవడంతో నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇక లైన్ క్లియర్ .. సమరమే. అదీ కూడా అతి త్వరలోనే ఉండొచ్చనేది రాజకీయ పరిశీలకుల అంచనా.

అవిశ్వాసమూ ..అస్త్రమే...

ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా రాజీనామాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండు చేస్తోంది. తాను ఆడే ఆటలో రక్షణాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ డిమాండును కచ్చితంగా తెలుగుదేశం పట్టించుకోదు. మిత్రపక్షంగా ఉన్న జనసేన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని కోరుతోంది. నిజానికి టీడీపీ సభ్యుల సంఖ్య 15 మాత్రమే. అవిశ్వాస తీర్మానం చర్చ వరకూ వెళ్లాలంటే కనీసం లోక్ సభ సభ్యుల సంఖ్యలో పదిశాతం మంది మద్దతు అవసరం. చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగితే తృణమూల్, వామపక్షాలు,శివసేన వంటి పార్టీలను కలుపుకుని ఆ సంఖ్య సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ అందుకు పూనుకుంటే రాజకీయంగా టీడీపీకి కచ్చితంగా మైలేజీ వస్తుందనుకుంటే చంద్రబాబు అదే చేస్తారు. కానీ పరిస్థితులు ఇంకా ఫ్లూయిడ్ గానే ఉన్నాయనేది టీడీపీ అంచనా. మరోవైపు వైసీపీ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా జనసేన కూడా రంగంలోకి దిగింది. రాజకీయ ప్రత్యర్థి వైసీపీ చేస్తున్న డిమాండును అంగీకరిస్తే టీడీపీకి పెద్దగా ప్రయోజనం ఉండదు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కనుక రాజకీయంగా టీడీపీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉంటే అవిశ్వాస అస్త్రం ప్రవేశపెట్టడమే మంచిదనేది తెలుగుదేశం పార్టీ వర్గాల యోచన. అయితే అదే సమయంలో అటు కేంద్రంతో పేచీ పెట్టుకున్న తర్వాత జనసేన కలిసిరాకపోతే ఎన్నికల్లో ఇబ్బంది ఎదురవుతుందనే ఆందోళన కూడా ఉంది. కేంద్రప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు అవిశ్వాసం మంచి అస్త్రమే. అయితే దానికి ఎదురయ్యే రాజకీయ పర్యవసానాలకు కూడా సిద్దం కావాలి. ఇంకా ఎన్నికలకు ఏడాది గడువుంది. ఈలోపు రాష్ట్రాన్ని కేంద్రం నిధుల పరంగా , పథకాల పరంగా ఎండగడితే ఆర్థిక పరిస్థితి ఏమవుతుందనే భయం కూడా టీడీపీని వెన్నాడుతోంది. అల్టిమేట్ గా రాజకీయ ప్రయోజనమే పొత్తు భవిష్యత్తును నిర్ణయించనుంది.

చర్చకు సై...

నిధులకు సంబంధించి కేంద్రంతో చర్చకు సై అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇదో కొత్త మాట. గతంలో మాకు అవి కావాలి. ఇవి కావాలి. అంటూ నినదించేవారు. తాజాగా రాజకీయ లెక్కలు పక్కాగా కుదరడంతో బస్తీమే సవాల్ అని గళం పెంచారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఏమీ చేయలేదని చెప్పలేని స్థితి. అదే సమయంలో మొత్తం అన్నీ ఇచ్చేశామని కేంద్రం దబాయిస్తోంది. రాజకీయ నిర్ణయంతో ముడిపడిన అంశాలను పక్కనపెట్టేయడంతోనే అసలు సమస్య తలెత్తుతోంది. చంద్రబాబు నాయుడు ప్రతి అవసరాన్ని పెంచి చూపుతున్నారనే భావన కేంద్రంలో వ్యాపించింది. రాజధానికి 50 వేల కోట్ల రూపాయలకు పైగా కావాలని డిమాండు చేయడం, విడుదల చేసిన పదిహేను వందల కోట్లు తాత్కాలిక నిర్మాణాలకే ఖర్చు అయిపోయాయనడంతో కేంద్ర పెద్దలకు చిర్రెత్తుకొస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చులపైనా టెక్నికల్ గా రిపోర్టులను తెప్పించుకుంది కేంద్రం. పథకాలకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు, యుటిలిటీ సర్టిఫికెట్ల సమర్పణలోనూ రాష్ట్రం తాత్సారం చేస్తోంది. నిజంగా చర్చ జరిగితే ఎవరి తప్పు ఏమిటనేది బయటపడుతుంది. అయితే ఎవరికి వారు రాజకీయ కోణంలోనే ఆలోచిస్తూ ఉండటంతో మేధావుల కమిటీ వేసి జనసేన పైచేయిసాధించే యత్నంలో ఉంది. చంద్రబాబు తాను లెక్కలు ఎవరికీ చూపించాల్సిన పనిలేదంటూనే పవన్ కల్యాణ్ కు మాత్రం పూర్తివివరాలు పంపించారు. బీజేపీతో తెగతెంపులు ఖాయమని పిస్తున్నప్పటికీ జనసేనతో మైత్రి కొనసాగించాలనే టీడీపీ బలంగా భావిస్తోందనేందుకు ఇదే నిదర్శనం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News