తెలుగదేల యన్న ..తక్కువే(మీ) మనకు..?

Update: 2017-12-20 14:30 GMT

ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో 16 వ స్థానంలో ఉండి కూడా తెలుగు మృతభాషగా మారి అడుగంటిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం కావడమే విచారకరం. విశ్వ భాష అంటూ దేశ ప్రథమపౌరుడు ధ్రువపత్రం ఇచ్చేసినంత మాత్రాన తెలుగు వైభవంగా వెలిగిపోతోందని భ్రమ పడితే అంతకంటే నయవంచన మరొకటి ఉండదు. గడచిన రెండు దశాబ్దాలుగా ప్రపంచం ద్వారాలు తెరుచుకొన్నాయి. ఆ అవకాశాలను అందుకోవడంలో తెలుగు వారు ముందంజలో ఉన్నారు. ప్రత్యేకించి సాఫ్ట్ వేర్ రంగంలో అత్యధికంగా ఉపాధి అందుకుంటూ ఇతర దేశాలకు తరలిపోతున్నారు. స్వదేశంలోనూ అవుట్ సోర్సింగ్ ద్వారా లక్షల మంది ఉద్యోగాలు పొందుతున్నారు. సంప్రదాయేతర రంగాల్లో జీవిక సాధించాలంటే ఇంగ్లిషు అనుసంధాన భాష గా, తప్పనిసరి అవసరంగా మారింది. తల్లిదండ్రులూ దానిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. 20 ఏళ్ల కాలంలో ఒక తరం మారిపోయింది. స్వరం కూడా మారింది. అమ్మానాన్నలు మమ్మీడాడీలు అయిపోవడమే కాదు, మాటలో తేడా వచ్చేసింది. అ, ఆ, ఇ,ఈ ల స్థానంలో ఏబీసీడీలు పిల్లల నోళ్లపై నానుతున్నాయి. సమాజంలోని భిన్నవర్గాల ఆర్థికస్థితిగతులతో దీనికి సంబంధం లేదు. పేదాగొప్పా తేడా లేకుండా అందరూ అదే కోరుకుంటున్నారు. పిల్ల పలికే బుల్లి ఇంగ్లిషు మాటలకు తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. మైమరచిపోతున్నారు. చదువుకునే పిల్లల్లో 30 శాతం కంటే తక్కువ మంది మాతృభాషలో విద్యను అభ్యసిస్తే రెండు మూడు దశాబ్దాల్లోనే ఆ భాష మనుగడ ప్రమాదంలో పడుతుందని అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలా ప్రపంచలోని అనేక భాషలు కనుమరుగైపోయాయి. జనాభా, వ్యాప్తి దృష్ట్యా మరో శతాబ్దం పాటు తెలుగుకు ఇటువంటి దుస్థితి రాకపోవచ్చు. కానీ తెలుగులో చదివి, రాసేవారి సంఖ్య మాత్రం తీవ్రంగా పడిపోతుంది. అంటే మన పిల్లలు తెలుగువాళ్లుగానే ఉంటారు కానీ అక్షరజ్ణానం మాత్రం ఉండదు. తెలుగు మాట్లాడే నిరక్షర కుక్షులన్నమాట. భాషా పరిజ్ణానం లో కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లిపోతామన్నమాట. తెలుగుకు ఈ డేంజర్ పొంచి ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడేయాలనే ఉద్దేశమే ప్రపంచ తెలుగు మహాసభలు.

తెలంగాణంలో తొలి అడుగు..

ప్రపంచ సభల పేరిట తెలుగు వైభవాన్ని చాటి చెప్పడంతోపాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నేతృత్వంలో ప్రపంచంలోని తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం సాగింది. ప్రపంచంలోని 42 దేశాల్లో తెలుగు సంఘాలు పనిచేస్తున్నాయి. దేశంలోని 15 రాష్ట్రాల్లో తెలుగు వారు నివసిస్తున్నారు. ఆయా సంఘాల బాధ్యులకు ఆహ్వానాలు పంపించారు. భాషా ప్రియుల అనుసంధానానికి ఇదో మంచి ప్రయత్నమే. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికార భాషోత్సవాలు నిర్వహించడం, అందులోనూ ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ మాండలికానికి, ఈప్రాంత కవులు,రచయితలకు పెద్దపీట వేయడం ముదావహం. ఎందుకంటే ఇంతకాలం చినచేపను పెదచేప కబళించినట్లు కోస్తాంధ్ర లోని రెండు మూడు జిల్లాల వారి వాడుకభాషనే తెలుగు ప్రామాణిక భాషగా పెద్ద పీట వేశారు. ఏదో ఒక ప్రామాణికత ఉండటం తప్పులేదు. కానీ మిగిలిన ప్రాంతాల భాషా వైవిధ్యాన్ని పూర్తిగా విస్మరించడమే నష్టం చేకూర్చింది. తెలుగు భాషకు కూడా చేటు తెచ్చి పెట్టింది. పద వైవిధ్యం, విస్తృతితో తులతూగాల్సిన భాషను చట్రంలో బంధించారు. కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభల పేరు చెప్పినప్పటికీ తెలంగాణ భాషా,సాహిత్యాలకు అగ్రతాంబూలం ఇచ్చారు. ఇక్కడ పుట్టి పెరిగి తెలుగు భాషకు సేవ చేసిన సాహితీ వేత్తలను, మార్గదర్శకులను స్మరించుకోవడం ఈ తరంపై కొత్త వెలుగులు ప్రసరింపచేసినట్లే. అసలు తెలుగు అన్న పేరే తెలంగాణ నివాసానికి ప్రతిరూపంగా, పర్యాయంగా ప్రాచీన వాంగ్మయం చెబుతోంది. ఈ గడ్డపై తెలుగు చిరకాలం వర్ధిల్లేందుకు ప్రభుత్వ సంకల్పం తోడైతే ప్రజలు కూడా కలిసి కదలక తప్పదు. అందుకు తొలి అడుగుగా ప్రభుత్వ వర్గాలు ప్రస్తుత సభలను వర్ణిస్తున్నాయి.

మంచి యన్నది కొంచెమేనోయి..

సభలపట్ల అనేక విమర్శలు కూడా వెల్లువెత్తాయి. పద్యాలు, అవధానాలు, కళారూపాలు ప్రదర్శిస్తే సరిపోతుందా? తెలుగుకు మేలు జరుగుతుందా? అన్న కోణంలోనూ పలువురు ప్రభుత్వాన్ని తీవ్రంగానే దుయ్యబట్టారు. ఒక శతాబ్దకాలంగా తెలంగాణ గడ్డపై ప్రజాసాహిత్యం వెల్లి విరిసింది. ప్రజలను చైతన్య పరిచింది. ఉర్రూతలూగించింది. తీవ్రంగా వెనకబడిన నైజాం పాలనలో ఉడుకు నెత్తురు సెలయేరులు పొంగించింది. నేటికీ ఆ మూలాలు తెలంగాణలో చెరిగిపోలేదు. అయితే ఇప్పటి తెలుగు సభల్లో ఆ సంగతులను విస్మరించడం చాలామందికి ఆవేదన కలిగించింది. సమకాలీన సాహిత్యంలో ప్రజలను ముందుకు నడుపుతున్న కవిత్వాన్ని, గేయాన్ని కూడా ఆదరించకపోవడంపైనా ఆందోళన వ్యక్తమైంది. ప్రాచీన సాహిత్యానికి దక్కిన ఆదరణలో పదోవంతైనా ఆధునిక కవులకు ఇచ్చి ఉంటే బాగుండేదనే సూచనలు వెలువడ్డాయి. కోట్ట రూపాయలు వ్యయం చేసినప్పటికీ నాలుగు రోజుల ముచ్చటగా ముగిసిపోవడం తర్వాత కొనసాగింపు ఉంటుందో లేదో తెలియని వాతావరణం కొనసాగింది. ఏర్పాట్లను ఆదరాబాదరగా చేసేశారు. ఒక ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తూ టీవీల ద్వారా వాటిని ప్రసారం అయ్యేలా చూసుకుని ఉంటే మరింత మేలు జరిగి ఉండేది. ప్రారంభ, ముగింపు సభలు, కళారూపాలకే టీవీ చానళ్లు ఆసక్తి చూపించాయి. సాహితీ ప్రక్రియలను పరిచయం చేయడానికి, ప్రసారం చేయడానికి పెద్దగా ముందుకు రాలేదు. సన్నాహక ఏర్పాట్లు అంతంతమాత్రంగానే సాగినట్లు నిర్వహణను పరిశీలిస్తే అర్థమైపోతుంది.

బడిలో బలపం...

నిజానికి తెలుగు సభల వంటివి మాతృభాషకు దూరమవుతున్న పిల్లల్లో భాషా చైతన్యాన్ని కలిగించడం వల్ల అధిక ప్రయోజనం చేకూరుతుంది. జీవనసంధ్యలో ఉన్న వృద్ధులు , నడివయస్కులు తమ చిన్ననాటి సంగతులు, తమ పాండితీ ప్రకర్షను ప్రదర్శించుకోవడం వల్ల పెద్దగా వచ్చే లాభమేమీ లేదు. రేపటి తరం పౌరులైన చిన్నారులు తెలుగులో చదవడం, రాయడం, పద్యాలు నేర్చుకోవడం వల్ల భాష బతుకుతుంది. కొన్ని తరాలపాటు నిలబడుతుంది. వారిలో ఆ ఆసక్తిని కలిగించాలి. నిజానికి భాషోత్సవాలు జరిపేందుకు సన్నాహకంగా గ్రామంలో పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, పద్యపఠనం వంటి పోటీలు నిర్వహించి అందరూ పాల్గొనేలా చూడాలి. గ్రామపెద్దలు , ప్రజాప్రతినిధులు, కలెక్టర్ల వంటి పెద్దల చేతుల మీదుగా పాఠశాల స్థాయి విజేతలకు కూడా బహుమతులు అందేలా చూసుకోవాలి. పోటీ వాతావరణం ఇష్టపడే తల్లిదండ్రులు కచ్చితంగా తమ పిల్లలు గెలవాలనే ఉద్దేశంతో శ్రద్ధగా వీటికి పిల్లలను సిద్దం చేస్తారు. గ్రామ,పట్టణ,మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి దాదాపు ఏడాది పాటు ఒక వేడుకగా పిల్లల్లో ఈ పోటీ వాతావరణం నెలకొల్పగలిగితే తెలుగుదనం వద్దన్నా ప్రతిచోటా ఉట్టి పడుతుంది. ప్రతి చిన్నారి నోటిలో పద్యం నానుతుంది. తెలుగు మాట నుడికారం దిద్దుకుంటుంది. పోటీ పేరుతో నాటిన మొక్క ఎదిగే కొద్దీ భాషాభిమానం శాఖోపశాఖలై విస్తరిస్తుంది. అప్పుడే తెలుగు భాషకు ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఏర్పడుతుంది. అస్తమించే సూర్యకాంతి వంటి నేటి తరం సాహితీ చంద్రికగా మారి రేపటి భానూదయానికి ప్రభాతగీతం పాడాలంటే కొత్త తరం అందిపుచ్చుకోవాలి. ఆ దిశలో కృషి సాగినప్పుడే కేసీఆర్ క్రుషి సార్థకమవుతుంది. అతని ఆలోచనకు అర్థం దొరుకుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News