ఇక తప్పించుకోలేవు చంద్రబాబూ..!

Update: 2017-11-23 15:32 GMT

పోలవరం నా జీవితాశయం.ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరతాను అంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఈ మేరకు సంకేతాలు, సూచనలు కనిపించడం లేదు. నిధులు మొదలు అనుమతులు , డిజైన్ల వరకూ అన్నిటా షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా వ్యవహరిస్తోంది కేంద్రప్రభుత్వం. 16 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు 58 వేల కోట్లకు ఎలా చేరిందనేది మొదటి ప్రశ్న. కాఫర్ డాం కట్టకుండానే నేరుగా ప్రాజెక్టు నిర్మించేయొచ్చు కదా? అనేది మరో సందేహం. కాంట్రాక్టరును మారిస్తే ఖర్చు పెరుగుతుంది. వీల్లేదనేది ఒక షరతు. పునరావాసం, కొత్తకాలనీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులో భాగంగా చూపడమెందుకు? ఇతర పథకాల పద్దులో పెట్టేయొచ్చు కదా? అనేది ఒక ఉచిత సలహా. వీటన్నిటి సారాంశమేమిటంటే తమ ఖర్చు తగ్గించుకోవడమే. ఎలాగోలా రాష్ట్రప్రభుత్వ కోటాలోనే మేజర్ పనులను చుట్టేస్తే పోతుందనే దురుద్దేశమూ ఇందులో కనిపిస్తోంది. మొత్తమ్మీద రాష్ట్రప్రభుత్వం , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత హడావిడి కనబరుస్తున్నా కేంద్ర పెద్దలు అడుగడుగునా మోకాలడ్డే ధోరణిని వీడటం లేదు. పెరిగిన అంచనా వ్యయానికి ఇంతవరకూ అనుమతి లభించలేదు. ప్రధాన ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కొన్ని పనులకు సాంకేతిక క్లియరెన్సులు లభించలేదు. ఆయా విషయాలు సాధికార కమిటీల పరిశీలనలోనే నలుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చూపుతున్న ఉత్సాహం రాజకీయ సందడే తప్ప ఫీల్డు లెవెల్ లో సాకారమయ్యే సూచనలు లేవని నీటిపారుదల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

వాటాల బేరం?

పోలవరం ప్రాజెక్టుకు ప్రధాన ఆటంకం ఆర్థిక వనరులే. తాజాగా కేంద్రప్రభుత్వం పొమ్మనకుండా పొగ బెట్టే ధోరణిలో మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఎంతో కొంతమొత్తం రాష్ట్రప్రభుత్వం భరించే విధంగా పావులు కదుపుతోంది. 2014 నాటికి ఉన్న అంచనా వ్యయమే తాము భరిస్తామంటూ ఇప్పటికే స్పష్టం చేసేశారు. అప్పట్నుంచి ఇప్పటికి అంచనా వ్యయం రెట్టింపు పైగానే ఉంది. అందులోనూ భూసేకరణ భాగమే అధికమొత్తంగా ఉంది. అప్పటి అంచనాలను అనుసరించి చూస్తే కేవలం 3వేల కోట్లరూపాయలు మాత్రమే భూసేకరణకు అంచనాగా చూపించారు. ఇప్పుడు అది 33 వేల కోట్ల రూపాయలుగా తాజా అంచనా. అంటే పదకొండు రెట్లు పెరిగింది. అలాగే ప్రాజెక్టు భౌతిక నిర్మాణానికి అప్పటి అంచనా 13 వేల కోట్ల రూపాయలు కాగా తాజా అంచనాల్లో ఇది 25 వేల కోట్ల రూపాయలకు చేరింది. అంటే రెట్టింపు పెరిగింది. దీనిని కూడా భరించేందుకు కేంద్రం సిద్దంగా లేదు. 2013 భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రప్రభుత్వం తనకు నచ్చిన రేటుకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకునే అవకాశం లేకుండా పోయింది. అందువల్ల కచ్చితంగా భూసేకరణ,పునరావాసం నిమిత్తం భారీగానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇంకా 60 వేల 258 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. 371 ఆవాస ప్రాంతాలను తరలించాలి. 98 వేల కుటుంబాలకు కొత్త కాలనీలు నిర్మించాలి. ఇవన్నీ చిన్నాచితకా పనులు కాదు. ప్రతి సోమవారం తనకు పోలవారం అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావిడి భౌతిక నిర్మాణాలకే పరిమితమవుతోంది. సామాజిక అంశాలైన పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన , భూ సేకరణ వంటి అంశాలపై పెద్దగా చర్చ సాగడం లేదు. ప్రాజెక్టుకు ఇవే భవిష్యత్తులో ప్రధాన ఆటంకాలుగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం ఇప్పటికే నాబార్డు నుంచి రుణం రూపంలో 9 వేల కోట్ల రూపాయలు ఇప్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే ఫైనల్ సాయం అన్నరీతిలో కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట్ర అధికారులు అంతర్గతంగా వాపోతున్నారు.

ఇతర పథకాలతో ముడి పెడితే...

ఎస్సీ,ఎస్టీలు, బీసీలు, ఇతర బలహీన వర్గాలకు వివిధ పథకాల కింద గృహనిర్మాణం, రక్షిత మంచినీటి పథకాలు, ఉపాధి కల్పన వంటి వాటిని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అయితే పోలవరం విషయం వేరు. ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేయించాల్సి వస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో తమ సొంతపొలాలు, ఇళ్లు కోల్పోయే వారిని వేరేచోట్లకు తరలించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. కానీ ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న పథకాలతో ముడిపెట్టి లబ్ధి కల్పించాలని కేంద్ర సహాయపునరావాస కమిటీ ఇటీవల రాష్ట్రప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. తన బాధ్యతనుంచి తప్పించుకునే తెలివైన ఎత్తుగడ ఇది. అంతేకాకుండా ఆయా పథకాల ద్వారా ఇతర ప్రాంతాల్లో లబ్ధి పొందాల్సిన వారు వేరే ఉంటారు. వారు పొందాల్సిన సహకారాన్ని పోలవరం బాధితులకు మళ్లించడం అంటే మందిని కొట్టి మరొకరికి పెట్టినట్లే. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా సర్వస్వం కోల్పోయే వారికి చట్టబద్దంగా రైట్ రాయల్ గా రావాల్సిన సాయాన్ని దయాదాక్షిణ్యాలతో ముడిపడిన పథకాలతో లింకు పెట్టడమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రప్రభుత్వ వైఖరిలోని ద్వంద్వ ప్రవృత్తినే కమిటీ సూచనలు వెల్లడిస్తున్నాయంటున్నారు. నిధుల పరంగా లెక్కిస్తే ఇంతవరకూ పోలవరానికి అధికారిక లెక్కల ప్రకారం వెచ్చించిన మొత్తం 12 వేల కోట్లు మాత్రమే. ఇంకా చేయాల్సిన ఖర్చు నాలుగు రెట్లు ఉంది. తాము పోలవరానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని కేంద్రం చెబుతున్న మాటలు కానీ మరో రెండేళ్లలో పూర్తి చేసి తీరతామని చంద్రబాబు చేస్తున్న శపథం కానీ ఆర్థిక వనరుల కోణంలో చూస్తే అర్ధసత్యమని తేటతెల్లమై పోతోంది. రాష్ట్ర విభజన పర్వంలో ప్రధాన హామీ అయిన దీనిని నెరవేర్చకపోతే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో దోషులుగా నిలవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధించి ఎక్కువ బాధ్యత తీసుకుంటున్నట్లుగా ప్రజల్లోకి వెళ్లింది. లాభమైనా, నష్టమైనా ఆమేరకు టీడీపీ నిభాయించాల్సి ఉంటుంది. బీజేపీ నెత్తిన రుద్ది తాను తప్పించుకుందామని చూసినా సాధ్యం కాకపోవచ్చు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు రెండూ భాగస్వాములే. విమర్శలు ఎన్ని చేసుకున్నా ఎన్నికల ప్రణాళిక విషయంలో ఇద్దరూ సమ బాధ్యులే. రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశానిది పెద్దన్న పాత్ర. అదే ఎక్కువ దెబ్బలను కాయాల్సి ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News