ఈ నెల 27న ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో త్రిముఖ పోరు జరగనుంది. అధికారపక్షమైన కాంగ్రెస్ పార్టీని ప్రదాన ప్రతిపక్షమైన నేషనల్ పీపుల్స్ ఫ్రంట్, బీజేపీలు ఢీకొంటున్నాయి. మొత్తం 60 నియోజకవర్గాల్లో ఎస్సీలకు కేటాయించారు. మిగిలినవి అయిదు జనరల్ స్థానాలు. మొత్తం 18,30,'04 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనేందుకు వీలుగా ఎన్నికల సంఘం 3082 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 29 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ స్వతంత్రులు, చిన్నాచితకా పార్టీల మద్దతుతో ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసింది. రెండు నెలల క్రితం పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొనలేదు.
కాంగ్రెస్ తిరిగి కైవసం చేసుకుంటుందా?
అధికార కాంగ్రెస్ కు సంబంధించి ముక్యమంత్రి ముకుల్ సంగ్మా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితర కేంద్ర నాయకులు ప్రచారానికే పరిమితమయ్యారు తప్ప టిక్కెట్ల పంపిణీ వంటి వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోలేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయడం అసాధారణం. అలాంటి అరుదైన రికార్డును సొతం చేసుకున్నారు ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా. కాలం కూడా ఆయనకు కలిసి వచ్చింది. 2013లో తాము అధికారం చేపట్టేనాటికి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చిక్కుల్లో ఉండటం, 2014 ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేంద్ర నాయకత్వం మేఘాలయ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సంగ్మాకు సానుకూల వాతావరణం ఏర్పడింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 60 స్థానాల్లో పోటీచేస్తోంది. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. అంపట నియోజకవర్గం పాతదే. సాంగ్ సక్ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారు. ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారని, పార్టీ పరాజయాన్ని ముందుగా ఒప్పుకున్నట్లే అయిందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనడం కష్టమేనన్న వాదన వినపడుతోంది. క్రిస్టియన్ల ఆధిక్యం గల రాష్ట్రంలో ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పెద్దయెత్తున ఆ వర్గం నాయకులను రంగం లోకి దించింది. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, మాజీ కేంద్రమంత్రులు ఎ.కె. ఆంటోని, ఆస్కార్ ఫెర్నాండజ్ లతో పాటు మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వంటి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలుమార్లు పర్యటించారు. నాగాలాండ్, త్రిపురపై ఎలాంటి ఆశ లేని కాంగ్రెస్ కనీసం అధికారంలో ఉన్న మేఘాలయను కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది. చిన్న రాష్ట్రమైనప్పటికీ ఇక్కడ గెలుపు జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పోటీలో ఎన్పీఎఫ్.....
ప్రధాన ప్రతిపక్షమైన నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ 52 స్థానాల్లో పోటీ చేస్తోంది. కేంద్రంలోని ఎన్డీయేలో భాగస్వామి అయినప్పటికీ రెండు పార్టీలూ రాష్ట్రంలో విడివిడిగా పోటీ చేస్తుండటం గమనార్హం. ఎన్పీఎఫ్ సారధి కాన్ రడ్ సంగ్మా. ఈయన లోక్ సభ మాజీ స్పీకర్ పీఎ సంగ్మా కుమారుడు. పీఎ సంగ్మా కుమారుడిగా మంచి పేరున్నప్పటికీ కాంగ్రెస్ ను ఎదిరించి అధికారం కైవసంచేసుకోవడం అంత తేలిక కాదు. అయితే ఎన్నికల అనంతరం బీజేపీ ఆయనకు మద్దతిచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముందే బీజేపీతో కలిసి నడిస్తే క్రిస్టియన్ ఓట్లు ఎక్కడ దూరమవుతాయో అన్నది నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ భయం. అదే విధంగా హిందుత్వ, బీఫ్ మాంసం వంటి అంశాల్లో రెండు పార్టీల మధ్య తేడాలున్నాయి.
బీజేపీ ఒంటరిగా......
గత ఎన్నికల్లో కనీస ప్రాతినిధ్యం లేని బీజేపీ ఈసారి 47 స్థానాల్లో పోటీ చేస్తోంది. వాస్తవానికి ఎన్పీఎఫ్ తో కలిసి పోటీ చేయాలని ముందు అనుకుంది. అయితే ఎవరికి ఎక్కువ స్థానాలు కేటాయించాలన్న విషయంలో విభేదాలు వచ్చాయి. దీంతో సొంతంగా పోటీ చేస్తోంది. ఎన్నికల అనంతరం బీజేపీ, ఎన్పీఎఫ్ పొత్తు పెట్టుకునే అవకాశాలను కాదనలేం. క్రిస్టియన్ల ఆధిక్యం గల రాష్ట్రానికి ఎన్నికల ఇన్ ఛార్జిగా కేంద్రమంత్రి కె.జె ఆల్ఫోన్స్ ను పార్టీ నియమించింది. కేరళకు చెందిన ాయన కేంద్రమంత్రి. 2017లో కేంద్రమంత్రి అయ్యారు. ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వంటి ఉద్దండులు ప్రచారంలో పాల్గొన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ వంటివి బరిలో ఉన్నప్పటికీ వీటి ప్రభావం పరిమితమే. కాంగ్రెస్, ఎన్పీఎఫ్, బీజేపీ మధ్యనే పోటీ ఉంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కాంగ్రెస్, ఎన్పీఫ్ మధ్య పోటీ కేంద్రీకృతమైంది. గట్టి విపక్షంగా ఆవిర్భవించాలన్నది బీజేపీ యోచన.
శాంతిభద్రతల సమస్య....
మరో పక్క రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి సంతృప్తికరంగా లేదు. ఇటీవల తీవ్రవాదుల దాటిలో ఎన్సీపీ అభ్యర్థి జోనానాథ్ ఎన్ సంగ్మా సహా మరో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలోని తూర్పు గారోహిల్స్ జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వస్తున్నవీరి బృందంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. 2013 ఎన్నికల సమయంలోనూ జోనానాథ్ సంగ్మాను హతమారుస్తామని బెదిరింపులు వచ్చాయి. సంక్షుభిత మేఘాలయలో శాంతిభద్రతలు ఎప్పుడూ సమస్మాత్మకమే. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు తర్వాత వీటిని పట్టించుకోక పోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందన్నది చేదు నిజం. మరి రేపు జరగనున్న ఎన్నికల్లో విజేత ఎవరనేది చూడాల్సి ఉంది.
-ఎడిటోరియల్ డెస్క్