అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడాది పాలన ఎలా ఉంది? స్వదేశంలో ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. అత్యంత కీలకమైన విదేశాంగ విధానం ఎలాఉంది? ఆయన వ్యక్తిత్వం, వ్యవహార శైలి ఎలా ఉందన్న ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం లభించదు. కొంతమంది ప్రజల్లో అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విపక్షాల సంగతి సరేసరి. వాటి విమర్శల దాడి తీవ్రంగా ఉంది.
ఏరంగం చూసుకున్నా.....
అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా 45వ అధ్యక్షుడిగా గత ఏడాది ఎన్నికైన ట్రంప్ పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో అంచనాలు వేసుకున్నారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన ట్రంప్ అగ్రరాజ్యాన్ని మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని ఆశించారు. అంతర్జాతీయంగా ‘పెద్దన్న’ పాత్రను పోషిస్తారని ఆశించారు. కాని ఆచరణలో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఏ ఒక్క రంగంలోనూ అధ్యక్షుడి పనితీరు ప్రశంసనీయంగా లేదన్న ఆందోళన, ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. తాజాగా జరిగిన వర్జీనియా, న్యూజెర్సీ, ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ఈ రెండు చోట్ల జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. తగ్గుతున్న అధ్యక్షుడి ప్రజాదరణకు ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. గత 70 ఏళ్లలో అతి తక్కువ ప్రజాదరణ పొందిన అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు. ప్రస్తుతం 37 శాతం మంది ప్రజల ఆమోదమే ఆయనకు మిగిలింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆర్థికరంగం అభివృద్ధి 2.6 శాతానికే పరిమితమయింది. 3 శాతం లక్ష్యం సాధించాలన్నది అధ్యక్షుడి అభిమతం. విదేశీ పర్యాటకులు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగించే పరిణామం. దేశవ్యాప్తంగా 362 ఉగ్రవాద ఘటనలు జరగడం శాంతి భద్రతల పరిస్థతికి దర్పణం పడుతోంది. ఏడాది కాలంలో 13 దేశాల్లో పర్యటించినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 82 కొత్త చట్టాలను తీసుకొచ్చారు. 50 కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీచేశారు. ట్రంప్ హయాంలో పార్లమెంట్ 321 తీర్మానాలను చేసింది. 2470 ట్వీట్లు చేసి సంచలనం సృష్టించారు ట్రంప్.
వివాదాస్పద నిర్ణయాలు.....
అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే జనవరి 27న ఏడు ముస్లిం మెజారిటీ దేశాల ప్రజల రాకపోకలపై విధించిన నిషేధం వివాదాస్పదమైంది. దేశ విదేశాల్లో ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమయింది. లిబియా, ఖతార్, సిరియా, యెమన్ తదితర దేశాల నుంచి రాకపోకలపై నిషేధాన్ని స్వయంగా అమెరికా కోర్టులే కొట్టివేయడం గమనార్హం. నిషేధం నిర్ణయంతో హేతుబద్ధతను న్యాయస్థానాలు సూటిగా ప్రశ్నించాయి. అక్రమ వలసలను అరికట్టడం అవసరమే అయినప్పటికీ చట్టబద్ధమైన వలసలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య దేశానికి తగదు. హెచ్1బీ వీసాల విధానాన్ని సమీక్షించాలన్న నిర్ణయం అంతర్జాతీయ సమాజాన్ని ముఖ్యంగా మేథో ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. 2018 సంవత్సరానికి ఈ తరహా వీసాలకు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించాలని నిర్ణయించారు. గత ఐదేళ్లలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రధమం. ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే యువతపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వారి భవిష్యత్ ఆశలను నీరుగార్చింది. ముఖ్యంగా భారతీయులకు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువతను నిరాశపర్చింది ఈ నిర్ణయం. యునెస్కో సభ్యత్వం నుంచి వైదొలగాలన్న నిర్ణయం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది. యునెస్కో తాను చెప్పినట్లు పనిచేయడం లేదన్న అక్కసుతోనే వైదొలగారన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమయింది. సరైన వీసాలు లేకుండా 11.3 మిలియన్ల మంది అమెరికాలో ఉన్నారని, వారిని పంపించేస్తానని ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఎన్నికల అనంతరం నేరచరిత్ర గల 2 నుంచి 3 మిలియన్ల మంది ఉన్నారని, వారిని అధికారంలోకి రాగానే పంపిస్తానని ప్రకటించారు. ఇందులో అభ్యంతర పెట్టాల్సింది లేదు. ఇది సరైన నిర్ణయమే.
ఎందుకు వైదొలిగినట్లు....
ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలన్న నిర్ణయంలో సహేతుకత కొరవడిందన్న విమర్శ ఉంది. సుమారు 207 మందిని వివిధ పోస్టులకు ట్రంప్ నామినేట్ చేశారు. అయితే ఆయన విధానాలు నచ్చక వారిలో చాలామంది వైదొలిగారు. ప్రతిష్టాత్మకమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) చీఫ్ జేమ్స్ కామేను ఆ పదవి నుంచి తొలగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణను ఆపాలన్న అధ్యక్షుడి నిర్ణయాన్ని తిరస్కరించినందువల్లే తనపై చర్య తీసుకున్నారని కామే ఆరోపించడం సంచలనం సృష్టించింది. అమెరికా-మెక్సికో మధ్య గోడ నిర్మించాలన్న నిర్ణయం అత్యంత వివాదాస్పదమైంది. మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన ఆశ్చర్యానికి గురి చేసింది. అక్రమ వలసలను అడ్డుకోవడం అవసరమే అయినప్పటికీ అందుకోసం ఏకంగా 40 అడుగుల ఎత్తున గోడ నిర్మించాలను కోవడంపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మొత్తం 3100 కిలోమీటర్ల సరిహద్దులో 1600 కిలోమీటర్ల మేర గోడ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 1200 కోట్ల డాలర్లను వెచ్చించనున్నారు. ఆధునిక సమాజంలో అడ్డుగోడలను నిర్మించాలనుకోవడం అహేతుకమని, గతంలో ఉన్న బెర్లిన్ గోడనే ప్రజలు పడగొట్టారని ప్రజలు గుర్తు చేస్తున్నారు.
క్షీణించిన శాంతిభద్రతలు....
362 ఉగ్రదాడులు ఏడాది కాలంలో జరగడం దేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు నిదర్శనం. ట్రంప్ విధానాల కారణంగా అమెరికా సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 43 లక్షల మంది పర్యాటకులు తగ్గడంతో 74 బిలియన్ డాలర్ల మేరకు నష్టం జరిగినట్లు అంచనా. ఏడాది కాలంలో 2470 ట్వీట్లు చేసి సంచలనం సృష్టించారు. అధ్యక్షుడి హోదాలో హుందాగా వ్యవహరించాలని, పరిణితితో, అవగాహనతో వ్యవహరించాలని అంతేతప్ప సాధారణ పౌరులు మాదిరిగా ట్వీట్లు చేయడం ఎంతవరకూ సమంజసమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతున్న చైనాను నిలువరించడంలో ట్రంప్ ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఒకప్పటి అగ్రరాజ్యమైన రష్యా స్థానాన్ని అందుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడికి ఉండాల్సినంత పరిణితి, అవగాహన, సమన్వయం, సంయమనం ట్రంప్ లో కొరవడిందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్త మవుతోంది. ఏది ఏమైనా ఏడాది కాలంలో అధ్యక్షుడి పనితీరు అంత అభినందనీయంగా లేదన్నది అందరి అభిప్రాయం.
-ఎడిటోరియల్ డెస్క్