టీడీపీలో వీరికి నో టికెట్‌.. బాబు సీక్రెట్‌ స‌ర్వే...!

Update: 2017-12-15 15:30 GMT

2019 ఎన్నిక‌ల్లో మరోసారి గెలవాల‌ని సీఎం చంద్ర‌బాబు కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందించ‌డం కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఆయ‌న ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా.. ఎమ్మెల్యేలు, ఆయా నియోజ క‌వ‌ర్గాల్లో ఇన్‌ఛార్జుల ప‌రిస్థితి నానాటికీ ఘోరంగా మారుతోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ స‌ర్వేలు నిర్వ‌హించినా.. అవి ఎవ‌రో ఒక‌రి ద్వారా లీకవ‌డంతో.. చర్య‌లు తీసుకోక‌ముందే లిస్టులోని కొంత‌మంది త‌మ ప‌నితీరు మెరుగుప‌రుచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేసేవారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయని నిర్వ‌హించిన సీక్రెట్ స‌ర్వే.. ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. ఇందులో విష‌యాలేంటో ఎవ‌రికీ లీకు ఇవ్వ‌డం లేద‌ట! ఈ సారి చాలా కొత్త ముఖాలు కనిపిస్తాయనే చ‌ర్చ మొద‌ల‌వ‌డంతో.. చాలా మందికి కంటి మీద కునుకు క‌రువ‌వుతోంద‌ట‌.

మొత్తం నలభై నుంచి అరవై నియోజకవర్గాల్లో....

చంద్రబాబు నిర్వ‌హించిన స‌ర్వే ఇప్పుడు పార్టీ నాయ‌కుల్లో గుబులు పుట్టిస్తోంది. దాదాపు 40 నుంచి 60 నియోజకవర్గాల్లో

పార్టీ ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలు. ఇత‌ర నాయ‌కుల‌కు ప‌నితీరు అధ్వానంగా మారింద‌ని ఎప్ప‌టినుంచో నివేదిక‌లు చెబుతూనే ఉన్నాయి. తాజాగా ఆయ‌న వివిధ మార్గాల ద్వారా తెచ్చుకున్న నివేదిక ఆధారంగా.. ఉత్తరాంధ్రలో 10, ఉభయగోదావరి జిల్లాల్లో 15, కృష్ణా,గుంటూరులో 9, ప్రకాశం, నెల్లూరులో 6, రాయలసీమలో 12 నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది. అంతేగాక నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పనితీరుపై కూడా చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. సుమారు 50 నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల పనితీరు దారుణంగా ఉందని తెలుసుకున్నారు.

బయటకు పొక్కకుండా...

అయితే మొత్తం అన్నీ కాక‌పోయినా సుమారు 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి దిగ‌జారింద‌ని చంద్ర‌బాబు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఆ నియోజకవర్గాల పేర్లు? ఎవరెవరు బాగా పనిచేయడంలేదనే విషయం వివిధ మార్గాల ద్వారా నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు ఆ విషయాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ నివేదికల్లో ఏముందో సీఎంవో అధికారులకు గానీ, చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా ఉండే పార్టీ నాయ‌కుల‌కు గాని తెలియ‌ద‌ట‌. అటు పార్టీ వర్గాలపై కానీ ఇటు సీఎంవో అధికారులపై కానీ చంద్రబాబుకు నమ్మకం లేక‌నే ఇలా వ్య‌వ‌హరిస్తున్నార‌నే గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.

మిగిలిన వారిని పట్టించుకోవద్దన్న...

ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చంద్రబాబుకు వీరవిధేయుడు దీనిపై అడ‌గ్గా.. 'అంతా నీకెందుకు. నీకు ఎటువంటి ఢోకా లేదు. మిగతా వారి గురించి పట్టించుకోవద్దని సున్నితంగా చెప్పారట'. 'మా జిల్లా విషయం తెలుసు కుందామని అడిగాను' అని ఆయ‌న అడ‌గ్గా.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టమని చెప్పారట. దీని బట్టి బాబు నోట 40 నియోజకవర్గాల అభ్యర్థుల విషయం మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేదు. అయితే ప్ర‌స్తుత సమాచారం ప్ర‌కారం.. మంత్రి పదవి నుంచి తొలిగించిన వారు, మంత్రి పదవుల కోసం బజారున పడిన వారు, పరోక్షంగా వాడివేడి విమర్శలు చేసిన వారిని ఈసారి తప్పించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయ‌ట‌.

మంత్రుల్లోనూ ఆరుగురికి డౌటే...

ప్రస్తుత మంత్రుల్లో కూడా ఐదుగురు లేక ఆరుగురికి మళ్లీ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చట‌. సీనియర్‌ ఎమ్మెల్యేల్లో చాలా మందికి పోటీ చేసే అవకాశం ఉండదని తెలుస్తోంది. దీంతో 30 నుంచి 40 మంది మాత్రమే ఉత్కంఠతకు గురి కాకుండా కనిపిస్తున్నారు. ఈ 30 మందిలో మంత్రులు, నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జిలు ఉండే అవకాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. దీన్ని బట్టి ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు కానీ సుమారు వంద మంది లోపు తిరిగిపోటీ చేసే అవకాశం లేదని స్పష్టమవుతుంది. 175 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు,కొంత మంది రాజకీయ భవిష్యత్‌కు బాబు తెరదింపబోతున్నట్లు స్పష్టం అవుతుంది.

Similar News