జ‌న‌సేన‌తో పొత్తు.... ఈ టీడీపీ సిట్టింగ్‌ల‌కు బాబు షాక్‌..!

Update: 2017-10-29 12:30 GMT

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ - జ‌న‌సేన మ‌ధ్య పొత్తు పొడుపుపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇవి ఊహాగానాల్లా కంటే నిజమ‌నే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముందునుంచి ప‌వ‌న్ జ‌నసేన ఏపీ, తెలంగాణ‌లో అన్ని చోట్లా పోటీ చేస్తుంద‌ని, తాను అనంత‌పురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతాన‌ని ప్రక‌టిస్తున్నారు. అయితే ఆ ప్రక‌ట‌న చేసిన‌ప్పటి నుంచి ప‌వ‌న్ స‌డెన్ షాకులు ఇస్తూనే ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం జ‌న‌సేన నుంచి ఏపీ, తెలంగాణ‌లో పార్టీ బ‌లంగా ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనే జ‌న‌సేన అభ్యర్థులు బ‌రిలో ఉంటార‌ని ప్రక‌ట‌న వ‌చ్చింది. అయితే ఇప్పుడు విన‌ప‌డుతోన్న టాక్ ప్రకారం జ‌న‌సేన తెలంగాణ‌లో ఎలా ఉన్నా ఏపీలో కేవ‌లం 30-35 సీట్ల‌లోనే పోటీ చేస్తుంద‌ని తెలుస్తోంది. అది కూడా టీడీపీతో పొత్తుతోనే అట‌.

గత ఎన్నికల్లోనూ....

గ‌త ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగానే జ‌న‌సేన పెట్టిన ప‌వ‌న్ ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయకుండా టీడీపీ - బీజేపీ కూట‌మికి మ‌ద్దతుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప‌ర్యటించారు. ఆ ఎన్నిక‌ల ప్రచారంలో ప‌వ‌న్ చంద్రబాబు,మోడీతో క‌లిసి కూడా పాల్గొన్నారు. ప‌వ‌న్ సాక్షిగానే మోడీ ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఎన్నో వ‌రాలు కురిపించారు. ఇక కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చాక మోడీ అస‌లు ఏపీ అనేది ఒక‌టుంద‌న్న విష‌య‌మే మ‌ర్చిపోయిన‌ట్టు ప్రవ‌ర్తిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికు ముందు వ‌ర‌కు చంద్రబాబుకే రెండుమూడు సార్లు మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేద‌న్న వార్తలు కూడా వ‌చ్చాయి.

ఇప్పటికి సస్పెన్సే.....

ఓ వైపు సినిమా షూటింగ్‌లు మ‌రోవైపు స‌భ‌ల ద్వారా జ‌నాల్లోకి వెళుతోన్న జ‌న‌సేనాని బీజేపీ ఏపీకి చేసిన అన్యాయంపై తీవ్రస్థాయిలో గ‌ళ‌మెత్తుతున్నారు. మోడీని, బీజేపీని ఏకేస్తూ కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో విమ‌ర్శిస్తూ జ‌నాల్లోకి చొచ్చుకుపోయే ప్రయ‌త్నం చేస్తున్నారు. అదే టైంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీని సుతిమెత్తగా విమ‌ర్శిస్తూ సూచ‌న‌లు చేస్తున్నారే త‌ప్ప గుచ్చుకునేలా విమ‌ర్శలు చేయ‌డం లేదు. ఇక ఇంట‌ర్నల్ టాక్ ప్ర‌కారం ఏపీ, తెలంగాణ‌లో టీడీపీ, జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసే పోటీ చేస్తాయ‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగా ఈ పొత్తు ప్రక‌ట‌న ఉండే ఛాన్సులు ఉన్నాయి. మ‌రి జ‌న‌సేన‌-టీడీపీ క‌లిస్తే ఏపీలో బీజేపీ ప‌రిస్థితి ఏంట‌న్నది మాత్రం ఇప్పటికి అయితే స‌స్పెన్సే.

ఈ సిట్టింగ్‌ల‌కు ఎర్త్ .....

జ‌న‌సేన‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ఏపీలో క‌నీసం త‌క్కువ‌లో త‌క్కువుగా 30 వ‌ర‌కు అసెంబ్లీ సీట్లు జ‌న‌సేన‌కు ఖ‌చ్చితంగా కేటాయించాలి. అదే జ‌రిగితే విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న సీట్లు కొన్ని ఇచ్చినా స‌గం సీట్లు అయినా సిట్టింగ్ ఎమ్మెల్యేలు జ‌న‌సేన కోసం త్యాగం చేయాల్సి ఉంది. జ‌న‌సేన కోసం సిట్టింగ్ సీట్లు వ‌దులుకునే వాళ్లలో టీడీపీ ఎమ్మెల్యేల‌తో పాటు విప‌క్ష వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేల్లో వీక్ ఎమ్మెల్యేల సీట్ల‌ను జ‌నసేన‌కే ఇచ్చేస్తార‌ని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కృష్ణా జిల్లాలో విజ‌య‌వాడ వెస్ట్‌, క‌దిరి, గిద్దలూరు సీట్లను జ‌న‌సేన‌కు ఇస్తార‌ని విశ్వస‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. విజ‌య‌వాడ వెస్ట్‌లో ప‌వ‌న్‌కు బ‌లంగా అభిమానులు ఉన్నారు. ఇక క‌దిరిలో చాంద్ బాషాను త‌ప్పిస్తే ప‌వ‌నే స్వయంగా అక్కడ నుంచి పోటీలో ఉండ‌వ‌చ్చని తెలుస్తోంది. ఇక గిద్దలూరులో ముత్తముల అశోక్‌రెడ్డిని ప‌క్కన పెట్టి గ‌తంలో అక్కడ ప్రజారాజ్యం నుంచి గెలిచిన అన్నా రాంబాబుకు జ‌న‌సేన టిక్కెట్ ఇస్తార‌ని వార్తలు వ‌స్తున్నాయి. టిక్కెట్ కోసం రాంబాబు ప‌వ‌న్‌తో భేటీ అయ్యారు కూడా. తూర్పుగోదావ‌రిలో ప్రత్తిపాడు కూడా ఈ లిస్టులో ఉంది.

ఇక్కడ కూడా.....

ఇక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో గుంటూరు వెస్ట్‌, ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలో మంత్రి పైడికొండ‌ల ఎమ్మెల్యేగా ఉన్న తాడేప‌ల్లిగూడెం, డెల్టాలోని న‌ర‌సాపురం లేదా పాల‌కొల్లులో ఒక‌టి, తూర్పు గోదావ‌రిలో కాకినాడ సిటీ స్థానాల‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న కొత్తపేట త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాలు, విశాఖ జిల్లాలో భీమిలి, టౌన్‌లోని నాలుగు సీట్ల‌లో ఒక సీటు కూడా జ‌న‌సేన‌కు ఇవ్వవ‌చ్చని ప్రాథ‌మికంగా తెలుస్తోంది. మ‌రి ఈ స‌మీక‌ర‌ణ‌లు ఎన్నిక‌ల టైంకు ఎలా మార‌తాయో ? చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News