పెద్దల సభకు పంపాల్సిన రాజకీయవేత్తలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా 58 స్థానాలు ఖాళీ అవుతుండగా అందులో ఆంధ్రప్రదేశ్,తెలంగాణలకు సంబంధించి 6 స్థానాలున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగా సాగుతున్న రాజ్యసభ ఎన్నిక కావడంతో సామాజిక, ఆర్థిక, ప్రాంతాల వారీ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఆయా స్థానాలను భర్తీ చేయడం తప్పని సరి అవసరంగా మారింది. తెలంగాణలో పిక్చర్ క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తోంది. ఇక్కడ ఖాళీ అయిన మూడు స్థానాలు అధికారపక్షం ఖాతాలోనే జమకానున్నాయి. వీటిని ఎవరికి కేటాయించాలనేది కేసీఆర్ ఇష్టమే. ఎంపికలో వేరెవరూ జోక్యం చేసుకునే సాహసం కూడా చేయరు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మాత్రం అంతసాఫీగా లేవు. తెలంగాణ తరహాలోనే మూడు సీట్లనూ తమ కిట్టీలోనే వేసుకోవాలనే యోచనలో ఉంది టీడీపీ అధిష్టానం. కానీ గణాంకాలు అందుకు సహకరించడం లేదు. ఫిరాయింపుల తర్వాత కూడా కనీసం ఒక స్థానం గెలుచుకునే ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీకి ఉంది. అయితే బోర్డర్ లో ఉంది. మరో ముగ్గురు లేదా నలుగురు జంప్ అయితే మాత్రం సీటు కష్టం. ఏదో విధంగా ముగ్గురిని తమవైపు మొగ్గు చూపేలా చూసుకోవాలనుకుంటోంది టీడీపీ. తమ వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకోవాలనుకుంటోంది వైసీపీ. దీంతో రాజకీయం గరంగరంగా మారుతోంది.
దోబూచులు...
తెలుగుదేశం పార్టీ మంత్రుల్లో కొందరు, అనుసంధానకర్తలు గడచిన ఆరునెలలుగా పొలిటికల్ యాక్టివిటీలో బాగా బిజీ అయిపోయారు. తమ నియోజకవర్గంలో పటిష్టం కావడానికో, పార్టీని సార్వత్రిక ఎన్నికలకు సిద్దం చేయడానికో వారు బిజీ అయ్యారంటే పప్పులో కాలేసినట్లే. వైసీపీ ఒక్క రాజ్యసభ స్థానం కూడా గెలుచుకోకుండా ఆ పార్టీ నుంచి తగిన సంఖ్యలో ఎమ్మెల్యేలను టీడీపీలోకి ఆకర్షించే బాధ్యతను వారికి అప్పగించింది అధిష్టానం. దీంతో నిరంతరం మంతనాలు, సంప్రతింపులు, ప్రలోభాలతో వారికి కాలం గడిచిపోతోంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే 22 మందిని వివిధ రకాల హామీలతో టీడీపీ ఆకర్షించగలిగింది. కర్నూలు, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న మరో నలుగురు ఎమ్మెల్యేలను టీడీపీ వలలో పడేలా చూసుకోవాలనే యత్నాలు సాగుతున్నాయి. టీడీపీతో దాదాపు పదిమంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉంటున్నట్లుగా సమాచారం. తామంతా టీడీపీకి అనుకూలమే . అవసరాన్ని బట్టి పార్టీ మారతామని చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ నాయకత్వానికి కూడా చేరువలో ఉంటున్నారు. దోబూచులాట కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఎవరినీ నమ్మలేని పరిస్థితి కనిపిస్తోంది. డిసెంబరు తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా పచ్చకండువా కప్పుకోకపోవడం టీడీపీలో ఆందోళనకు దారితీస్తోంది. ఎన్నికయ్యే రాజ్యసభ సభ్యులంతా తమవారే ఉండాలనుకుంటున్నటీడీపీ కల నెరవేరుతుందో లేదో చెప్పలేని పరిస్థితి కొనసాగుతూ సస్పెన్స్ ను పెంచుతోంది.
‘కళా’కి కళ్లెం....
శ్రీకాకుళం జిల్లాలో మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడులు ఉప్పునిప్పులా వ్యవహరిస్తుంటారు. ఒకరంటే ఒకరికి పడదు. కళా వెంకట్రావుకు లోకేశ్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. జిల్లాల్లోని ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలతో కళా వెంకట్రావు సంప్రతింపులు జరిపి వారికి టీడీపీ తీర్థం ఇచ్చేందుకు జనవరి నెలలో రంగం సిద్దం చేశారు. కొన్ని షరతులతో వారు కూడా సానుకూలత వ్యక్తం చేశారు. కళా ప్రాబల్యం, పలుకుబడి పార్టీ అధిష్ఠానం వద్ద బాగా పెరిగిపోతుందనే అంచనాతో ఈ వ్యవహారానికి మంత్రి అచ్చెన్నాయుడు గండి కొట్టినట్లు పార్టీలో ప్రచారం జోరందుకుంది. ఆ ఎమ్మెల్యే లతో తనకు కూడా రాజకీయంగా సత్సంబంధాలు ఉండటంతో ఈ సమయంలో పార్టీ మారడం తెలివితక్కువ నిర్ణయంగా వారికి నచ్చచెప్పినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యేలకు శ్రేయోభిలాషిగా అచ్చెన్నాయుడు ఈ మేరకు సలహా ఇచ్చారనేది కళా వర్గం ఆరోపణ. దాంతో చివరి నిముషంలో ఎమ్మెల్యేలు తమ ఆలోచనను విరమించుకున్నారు. మళ్లీ ఎంతెంత దూరం అన్నట్లుగా తయారైంది వ్యవహారం.
‘పనులు’ కావాలి...
టీడీపీ అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. తాము టీడీపీ ప్రభుత్వానికి సహకరిస్తామంటూ సంకేతాలు పంపుతూ తమ పనులు అయ్యేలా చూసుకుంటున్నారు. కాంట్రాక్టులు మొదలు, వ్యక్తిగత లబ్ధి పథకాల వరకూ తమ అనుచరులకు దక్కేలా చేసుకుంటున్నారు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఆర్థికంగా లాభపడుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయించుకుంటూ ప్రజల్లో పలుకుబడి పెంచుకోవాలనుకుంటున్నారు. ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్న ఎమ్మెల్యేలతో టీడీపీకి తలపోటు వస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ఆదోని , మంత్రాలయం, నెల్లూరు జిల్లాకు చెందిన కావలి, గుంటూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో టీడీపీ నాయకులు పూర్తిస్థాయి చర్చలు పూర్తి చేశారు. మూడునెలల క్రితమే వీరంతా పార్టీలోకి రావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూ వస్తోంది. మార్చి 23 న రాజ్యసభ ఎన్నిక జరుగుతుంది. మార్చి అయిదో తేదీనాటికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆలోపుగా కనీసం మరో ఇద్దరు ముగ్గురినైనా ఆకర్షించలేకపోతే టీడీపీ రెండుస్థానాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. తాము ఇంతవరకూ ఆకర్షించిన 22 మంది ఎమ్మెల్యేల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. వైసీపీ ఒక స్థానాన్నిఎగరేసుకుపోతుంది. ఇప్పుడు చంద్రబాబు ఏ వ్యూహం అనుసరిస్తారోననే ఆసక్తి నెలకొంది. రహస్య ఓటింగు పద్ధతిని ఉల్లంఘించనంతవరకూ రాజ్యసభకు ఓటు వేసే ఎమ్మెల్యేలకు అనర్హత వర్తించదు. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చు. దీనిని ఆసరాగా చేసుకుంటూ స్వతంత్ర అభ్యర్థిని రంగంలోకి దింపి చంద్రబాబు చాణక్యం నడుపుతూ వైసీపీ సీటుకు గండికొడతారేమోననే భయం కూడా వైసీపీని వెన్నాడుతోంది.
-ఎడిటోరియల్ డెస్క్