కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ విషయమై రాజమండ్రిలో చాలాసార్లు అనుకున్నామని, అయితే సెలబ్రిటీ కనుక పవన్ కళ్యాణ్ అన్నదానికి జగన్ స్పందించారని ఉండవల్లి తెలిపారు. అయితే చంద్రబాబు ప్రకటనే తనకు అర్ధం కావడం లేదని, అవిశ్వాసమే ఆఖరి అస్త్రం కావాలని అంటున్నారని, ఇదే ఆఖరి బడ్జెట్ అని, వచ్చే ఏడాది ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ వస్తుందని, అందుకని అవిశ్వాసానికి ఇదే అదను అని ఉండవల్లి స్పష్టంచేశారు.
రాజీనామాలతో పనికాదు....
" చాలా విచిత్రం ఏమిటంటే పోరాటం చేస్తున్నామని ఎంపీలు అంటున్నారు. పోయినసారి మేమంతా వెల్ లోకి వెళ్లాం. వెల్ లోకి వెళ్తే పని అవ్వదు. రాజీనామాలు చేసేస్తే పని అవ్వదు. అయితే పబ్లిక్ డిమాండ్ రాజీనామాలు చేయాలని ఉండవచ్చు. కానీ మేం ఆనాడు రాజీనామాలు చేసేసి ఉంటే, తలుపులేసి అన్యాయంగా బిల్లు ఆమోదించారని చెప్పుకోడానికి కూడా వీల్లేకుండా ఉండేది. పైగా ఏ హడావిడి లేకుండా బిల్లు పాసై పోయేది. ఏం అడగడానికి కూడా వీల్లేకుండా పోయేది. మేం రాజీనామాలు చేయకుండా పోరాడటం వల్ల జరిగిన అన్యాయం అందరికీ తెల్సింది. ఆఖరికి ఈ అన్యాయం ఎక్కడి దాకా వెళ్లిందంటే, మొన్న ప్రధాని మోడీ కూడా తలుపులు అన్యాయంగా విభజన చేసేశారని చెప్పేసారు"అని ఉండవల్లి గుర్తుచేశారు. "నేను కూడా చంద్రబాబుకి చెప్పబోయేదేమిటంటే,ఈ బడ్జెట్ సెషన్ లో జగన్ పెట్టబోయే అవిశ్వాసానికి మద్దతు పలకాలి. ఎందుకంటే కనీసం ఒక సభ్యుడు అవిశ్వాసం ప్రవేశపెడితే,దానికి మద్దతుగా 10శాతం అంటే 54మంది సభ్యులు మద్దతు పలికితే ఇక అన్నీ చర్చలు ఆపేసి, దానిమీదే చర్చించాలి. అవిశ్వాసం తేలేవరకూ ఏ ఒక్క బిల్లు ఆమోదం పొందదు. అందుకని ఇంకా ఏమీ చేయడానికి వీల్లేదు. 10శాతం మంది మద్దతు వచ్చిన వెంటనే, స్పీకర్ ఛాంబర్ లోకి అందరినీ పిలిచి ఎన్ని గంటలు చర్చ పెడదాం. ఎప్పుడు పెడదాం అని అడిగి, ఖరారు చేస్తారు. అలా చర్చ మొదలు పెట్టి, పూర్తయ్యేవరకూ ఏ సీరియస్ బిల్లు తీసుకోడానికి వీల్లేదు"అని ఉండవల్లి విశ్లేషించారు.
ఏపీ నుంచి అవిశ్వాసం పెడితేనే....
"కానీ నిన్నో, మొన్నే ఎక్కడో చూసాను. మా హయాంలో అవిశ్వాసం పెట్టినా, స్పీకర్ అనుమతించలేదు కదా! ఇప్పుడూ అంతే అంటున్నారు. కానీ మేము అవిశ్వాసం పెడుతూనే వున్నా,ఆ సమయంలో ఎవరో ఒకరిని వెల్ లోకి పంపించి, మద్దతు ఇచ్చే వారి సంఖ్యను లెక్కపెట్టకుండా చేసారు. పైగా బిల్లులు పాస్ చేస్తున్నా, అప్పటి విపక్షం అభ్యంతరం చెప్పలేదు. కానీ ఈవేళ ఆ పరిస్థితి లేదు. అవిశ్వాసం పెడితే అన్ని పక్షాలు మద్దతు ఇస్తాయి. నిజానికి నాకున్న స్నేహితుల్లో ఎవరో ఒకరి చేత అవిశ్వాసం పెట్టించగలను. అయితే, ఎన్నో సమస్యల్లో అంటే నోట్ల రద్దు, జీఎస్టీ,లాంటి సమస్యల్లో ఆంధ్రప్రదేశ్ సమస్య కూడా ఒకటి అయిపోతుంది. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి అవిశ్వాసం పెడితే,అప్పుడు ఇదే ప్రధాన సమస్య అవుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీ చెప్పడం వలన మంచి స్పందన వచ్చింది. దానికి జగన్ స్పందించారు. సంతోషం'అని ఉండవల్లి పేర్కొన్నారు.
వైసీపీయే తేల్చాలి....
‘‘ఇక రెండో విషయం ఏమిటంటే నన్నెవరు లెక్కలు అడగడానికి? లెక్కలు బయట ఎక్కడా చెప్పక్కర్లేదు, అసెంబ్లీలో చెబుతానని చంద్రబాబు అంటున్నారు. అందుకే జగన్ మోహన్ రెడ్డికి చెప్పేదేమంటే, మీరు పాదయాత్ర చేయనక్కర్లేదు. మీ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి హాజరవ్వమనండి. ఎప్పటికప్పుడు దశాదిశా నిర్దేశం చేస్తూ, ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం పోగొట్టుకోకండి. ఎందుకంటే, బీజేపీయే ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని, మేమే అధికార పక్షంగా వ్యవహరిస్తాం అని తెలుగుదేశం... కాదు మేము కూడా ప్రతిపక్షంగా కూడా వ్యవహరిస్తామని అంటున్నారు. ఎంతలేదన్నా టిడిపి, బిజెపి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాల్లో భాగస్వామ్యంగా వున్నాయి. అందుచేత నిజాలు బయటకు రావు. కనుక వైస్సార్ సిపి వాళ్ళు అసెంబ్లీకి వెళ్లి నిలదీయాలి' అని ఉండవల్లి సూచించారు.
నాలుగేళ్ల క్రితం ఇదేరోజు...
’’సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో వెంకయ్యనాయుడు ప్రసంగాన్ని ప్రతి ఊరులో సమైక్య ఆంద్ర ప్రదేశ్ ఉద్యమ కారులు, ప్రజలు టీవీల్లో చూశారు. అందుకే బిజెపి,టిడిపి ,పవన్ కళ్యాణ్ అలయన్స్ నెగ్గడానికి కారణం. ఆనాడు వెంకయ్య నాయుడు గారు ఎపి ప్రజలను ఆదుకునే ఓ పార్టీకి ప్రతినిధిగా కనిపించారు. ఈవేళ నాలుగేళ్లు పూర్తయింది. ఈరోజుకున్నంత ప్రాధ్యాన్యత అలాంటిది. అయితే ఇంకా టైం అవ్వలేదు. వేచి చూడాలి. అవిశ్వాసం ఆఖరి అస్త్రం అని చంద్రబాబు చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. నిజానికి ఇప్పటివరకూ ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు జరగలేదనే విషయమై, అసలు పార్లమెంట్ లో చర్చ జరగలేదు. ప్రసంగాలకు పరిమితం అయింది. చర్చ జరిగి సమాధానం చెప్పినపుడు యాక్ట్ ఏమిటన్నది వస్తుంది.’’ అని ఉండవల్లి చెప్పారు. ‘‘ఇక్కడ జరుగుతున్నదేమిటంటే, కాంగ్రెస్ వాళ్ళు అలా చేసేసారు, ఇక మేం ఏమి చేస్తాం. అంతే ఖర్మ మీరు అనుభవించండి అని అనడం దారుణం. కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేస్తే, దాన్ని మార్చడానికే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది? ఒకసారి యాక్ట్ చేస్తే, ఇక మళ్ళీ మార్చరా? అలా అయితే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి ఇప్పుడు? యాక్ట్ లో పెట్టలేదని ఆవేళ మీకు రాజ్య సభలో తెలీదా?" అని ఉండవల్లి ప్రశ్నించారు. ‘‘నిజానికి టిడిపి, బిజెపి మధ్య జరుగుతున్నది ప్రజలకు అంత ఆమోద యోగ్యంగా లేదని నేను భావిస్తున్నాను. అందుకే టిడిపి పద్దతి మార్చుకుని ఓపెన్ గా బయటకు రావాలి. యదార్ధాలు చెప్పండి. ఈవేళ పవన్ కళ్యాణ్ వేసిన కమిటీ కూడా అదే. వాళ్ళు ఇంతిచ్చా మంటారు, వీళ్ళు ఏమీ ఇవ్వలేదంటారు, ఇది ఎవరికీ అర్ధం కావడం లేదు. ముందే అనుకుని దెబ్బలాడుకుంటున్న బాపతులా కనిపిస్తోంది"అని ఉండవల్లి అనుమానం వ్యక్తం చేసారు.
పవన్ అలాంటోడో కాదు....
పవన్ కళ్యాణ్ వ్యవహారం కూడా అలానే ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, ఎందుకంటే చంద్రబాబుని ఏమీ అనడంలేదనే వాదన వినిపిస్తోందని ఓ విలేకరి అడగ్గా,'పవన్ కళ్యాణ్ ఎవరో చెబుతున్నట్టు ఆడుతున్నారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అదే నిజమైతే, ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపుతున్న నన్ను ఎందుకు పిలుస్తారు? 'అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వేసిన కమిటీ కోడి గుడ్డు మీద ఈకలు పీకడం తప్ప ఏమీ చేయదని జగన్ అనడాన్ని ప్రస్తావించగా, ఉండవల్లి స్పందిస్తూ,అలా అనడం తప్పన్నారు. అయినా ఆ పదం ఇక్కడ వాడాల్సింది కూడా కాదని,ఎందుకంటే, అంతా బానే ఉంటే ఇంకా ఏదో లాగాలని చూస్తారేమిటని అనడానికి కోడి గుడ్డుకి ఈకలు లాగుతున్నారని అంటాం. కానీ జగన్ ఇలాంటి వ్యాఖ్య చేయడం లో క్లారిటీ లేదు'అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
-రాజమండ్రి నుంచి ‘‘తెలుగుపోస్ట్ ’’ ప్రత్యేక ప్రతినిధి