గేమ్ ఛేంజర్

Update: 2018-02-17 16:04 GMT

తెలుగు రాజకీయాలకు కొత్త ఆట నేర్పాడు. అరవయ్యేళ్ల కలకు ఆకృతినిచ్చాడు. ఉద్యమ స్ఫూర్తితో అధికారానికి అడుగుల సవ్వడి వినిపించాడు. వాడిగా వేడిగా విమర్శలు గుప్పించే వాగ్ధాటి మాత్రమే కాదు, నమ్మినవాడిని అక్కున చేర్చుకుని అందలమెక్కించే ఆత్మీయతకూ ఆయనే చిరునామా. ప్రాంతీయ ఆకాంక్షలకు ప్రతీక. ప్రజాస్వామ్య పోరాట విజయానికి నిలువెత్తు సూచిక. పెద్దల ఎడ అణకువ, సాంస్క్రుతిక విలువలపై మక్కువ, ఆధ్యాత్మికతపై అచంచల విశ్వాసం మూర్తీభవించిన వ్యక్తిత్వం. ఉద్యమనిర్మాణానికి ఆయన ఒక పాఠం. నిరాశానిస్ప్రుహల నుంచి ఆశల వారధి నిర్మించి అనుకున్నది సాధించిన ధీమంతుడు. తెలంగాణ రాష్ట్రానికి రథి, సారథి. రాష్ట్రం సాధిస్తానంటూ 2001లో శపథం చేసిన కేసీఆర్ ను చూసి చాలామంది తమలోతాము నవ్వుకున్నారు. మర్రిచెన్నారెడ్డి వంటి మహామహులకు కాని పని ఈయన వల్ల ఏమవుతుందంటూ ఎగతాళి చేశారు. చిత్తశుద్ధి, ద్రుఢసంకల్పం, దీక్షాదక్షతలతో మొదలైన ఒంటరి ప్రస్థానం వందలు వేలు అయ్యింది. లక్షలాది ప్రజలకు లక్ష్యంగా మారింది. కోట్ల గొంతుల రణన్నినాదమైంది. దేశపార్లమెంటునే స్తంభింపచేసింది. జాతీయపార్టీలను వణికింపచేసింది. ఒక్క బొట్టు రక్తం చిందకుండా ఒక రాష్ట్రం వచ్చేసింది. ఎందరెందరివో సూచనలు, సలహాలు, మార్గదర్శకత్వం ఉండి ఉండవచ్చు. ప్రేరణ నింపి ఉండవచ్చు. కానీ మలిదశ ఉద్యమంలో మాత్రం కర్త,కర్మ,క్రియ కేసీఆర్ మాత్రమే.

నవ చేతనకు నాయకుడు...

కేసీఆర్ ఆలోచనాధోరణి భిన్నంగా ఉంటుంది. కలుపుగోలు తనమే కాదు, అవసరమైన సందర్బంలో కఠినవైఖరినీ తీసుకుంటారు. ఆయన సాధించిన విజయాన్ని సాధారణ విజయాలతో పోల్చి చూడలేం. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి రాజకీయవేత్తలు, బలమైన నేతలు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న దశలో పుట్టిన పసికందు తెలంగాణ రాష్ట్రసమితి. పురిటి దశలోనే గండి కొట్టాలని చూసిన నాయకులకు, రాజకీయ పక్షాలకు కొదవ లేదు. పొత్తిళ్లలో దానిని పొదవి పట్టుకుని ప్రజాక్షేత్రంలో పెంచి పెద్దది చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని, ఆలోచన స్రవంతిని ప్రజల్లో ప్రవహింపచేశారు. సందేహాలు, శషభిషలను పటాపంచలు చేశారు. అనుమానాలు, అవమానాలను ఎన్నిటినో భరించారు. తొలిదశలో మూడు నాలుగు జిల్లాలకు పరిమితమైన చిన్న పార్టీతోనే అనేక ప్రయోగాలు చేస్తూ జనహితమే తన అభిమతమన్న వాదనతో పార్లమెంటులో వివిధ పక్షాలను ఒప్పించగలిగారు. రాజ్యం నిరంకుశ అధికారాలు కలిగి ఉంటుంది. ఉద్యమంలో ఏమాత్రం తప్పు దొర్లినా, హింస కనిపించినా అధికారం క్రూరంగా అణచివేస్తుంది. అందుకే రాజకీయ ఎత్తుగడలు, లాబీయింగ్, రాజీనామాల పర్వంతో తెలంగాణ డిమాండును బ్రతికించుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల్లో చర్చనీయం చేస్తూ లక్ష్యసాధన దిశలో నడిపించారు. భారత రాజకీయాల్లో ఇదో కొత్త ప్రయోగం. సైద్ధాంతిక భూమిక మీద దీర్ఘకాలం రాజకీయాలు నడిపినవారున్నారు. భావోద్వేగ అంశాన్ని ప్రజలకు ప్రాణప్రదంగా మలచడం చిన్న విషయం కాదు. 1969లో తెలంగాణ ఉద్యమం ఒక్కసారిగా పెల్లుబికి చల్లారిపోవడానికి ఇదే కారణం. దానిని నిలిపి ఉంచే నాయకత్వం కావాలి. ఆ లోటు తీర్చి నవచేతనకు నాంది పలికారు కేసీఆర్. అందుకే ఉద్యమాన్ని, కేసీఆర్ ను వేరు చేసి చూడలేనంత గాఢంగా తెలంగాణ సమాజంలో అల్లుకుపోయారు.

జన హ్రుదయ విజేత..

రాష్ట్రాన్ని ప్రసాదించింది కాంగ్రెసు. ఆంధ్రలో తాము నష్టపోతామని తెలిసినా సాహసించి తెలంగాణ ప్రజల కల నెరవేర్చింది. అప్పటికే పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెసు తెలంగాణలో అధికారాన్ని సుస్థిరం చేసుకుంటుందని అంతా భావించారు. వాడవాడలా విస్తరించిన క్యాడర్ కాంగ్రెసుకు అదనపు బలం. అయితే జనబలం మాత్రం కేసీఆర్ కు అండగా నిలిచింది. పూర్తిస్థాయి పార్టీ క్యాడర్ నిర్మాణం లేకుండా కేవలం ఉద్యమాన్ని మాత్రమే నమ్ముకున్న కేసీఆర్ కు ప్రజలే పట్టం గట్టారు. కేంద్రంలో మంత్రులుగా పనిచేసినవారు, ఎంపీలుగా ఎన్నోసార్లు గెలిచిన వారు సైతం టీఆర్ఎస్ హవాలో కొట్టుకుపోయారు. మూడున్నరకోట్ల ప్రజల ఆకాంక్షలతో ఆవిర్భవించిన కొత్త రాష్ట్రాన్ని లక్ష్య సాధన దిశలో నడిపే శక్తిసామర్థ్యాలు ఉద్యమనేతకే ఉన్నాయని ప్రజలు నిండుగుండెతో ఆశీర్వదించారు. కార్యకర్తలు లేకున్నా ప్రజలే బలగమయ్యారు. ధనబలం లేకున్నా దండ వేశారు. కాకలు తీరిన కాంగ్రెసు నేతలను మట్టి కరిపించినా, కరిష్మాటిక్ వేవ్ తో దూసుకొచ్చిన మోడీ, టీడీపీ కాంబినేషన్ ను నిలువరించినా అది కేసీఆర్కే సాధ్యమయ్యింది. జనహ్రుదయ విజేతగా ప్రజలే అక్కున చేర్చుకుని అభయమిచ్చారు. అధికార పగ్గాలు అప్పగించారు.

అపరచాణుక్యుడు...

ఉద్యమకారుడు పాలన ఏం చేస్తాడనుకున్న వారికి ఏడాది తిరగకుండానే చేతలతో బదులిచ్చారాయన. విద్యుత్తు కొరత, నీటి కటకట, వ్యవసాయ సంక్షోభం వంటి అనేక సమస్యలు రాష్ట్ర ఏర్పాటుతోపాటే వారసత్వంగా వచ్చి పడ్డాయి. మరో నాయకుడైతే బెంబేలెత్తిపోవాల్సిందే. మిషన్ కాకతీయ, భగీరథ, ఖర్చుకు వెనకాడకుండా విద్యుత్తు కొనుగోళ్లతో ప్రజల్లో ఒక భరోసా నింపగలిగారు. రాదనుకున్న రాష్ట్రం ఆవిర్భవించడంతోపాటే ప్రజల్లో ఆశలూ పెరిగిపోయాయి. చేతిలో మంత్ర దండం లేదు. ప్రధానపక్షాలను ఢీకొ్ట్టి గెలిచినా అత్తెసరు మెజార్టీయే చేతిలో ఉంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసే రాజకీయపక్షాలకు కొదవలేదు. జాతీయ పార్టీల అండ లేదు. కేంద్రం ఆసరా అసలే లేదు. అయినా తన రాజకీయ చాతుర్యంతో ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిలో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ సర్కారును సొంతగడ్డకు పంపడంలో అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. కాంగ్రెసు నాయకుల అనైక్యతను ఆలంబనగా చేసుకుంటూ ఆ పార్టీ మూలాలనే బలహీనపరచగలిగారు. మైనారిటీల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని మజ్లిస్ పార్టీతో దోస్తానా కలిపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య పెంచారు. వాటిని విస్తరించారు. అందే మొత్తాలనూ పెంచారు. రైతు రుణమాపీ అమలు చేసి చూపించారు. 2014 ఎన్నికల తర్వాత దేశంలో రుణమాపీని విజయవంతంగా అమలు చేసిన తొలిరాష్ట్రంగా తెలంగాణను నిలిపారు. దేశంలోనే తొలిసారిగా రైతుకు పెట్టుబడి సాయం పేరిట ఎకరాకు ఏడాదికి ఎనిమిదివేల రూపాయలు సమకూర్చే వినూత్న పథకానికి కార్యప్రణాళిక సిద్దం చేశారు. ఒకవైపు సంక్షేమం, అభివ్రుద్ధి రెండు గుర్రాలుగా పాలనను ఉరకలెత్తిస్తూ ప్రతిపక్షాలను బెంబేలెత్తించే రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించడం కేసీఆర్ నేర్పరితనానికి నిదర్శనం. 2014 తర్వాత ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ప్రతి ఎన్నికలోనూ ఘన విజయం సాధించింది. పార్టీ మరింత బలోపేతమవ్వడమే కాదు, దుర్నిరీక్ష్య శక్తిగా రూపుదిద్దుకొంది. కేంద్రంతో లౌక్యంగా, పాలనలో సౌఖ్యంగా, సంక్షేమమే భాగ్యంగా, అభివ్రుద్ధి లక్ష్యంగా సాగుతున్న తెలంగాణకు దిక్సూచి అతనే. జీవితంలో అనుకున్న లక్ష్యాలను అందరూ సాధించలేరు. శ్రమ,ఓర్పు, సహనం, దార్శనికత, అంకితభావం, అచంచల విశ్వాసం,పోరాట పటిమ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఆయా లక్షణాలన్నిటినీ పుణికిపుచ్చుకున్న జీవనసాఫల్య మూర్తి ..దటీజ్ కేసీఆర్...

-ఎడిటోరియల్ డెస్క్

Similar News