గులాబీ బాస్ పొలిటికల్ మ్యాప్....!

Update: 2018-01-17 16:30 GMT

తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ ఎన్నికలకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ముందుగా సన్నాహకంగా పంచాయితీ ఎన్నికల్లో పట్టు నిరూపించుకొని అసెంబ్లీ ఎన్నికలను దున్నేయాలనే దిశలో అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. పంచాయతీల పునర్విభజన, నూతన పంచాయతీల ఏర్పాటు, సెమీ అర్బన్ గ్రామాలను మునిసిపాలిటీల్లో కలిపేయడం వంటి చర్యలతో పొలిటికల్ మ్యాప్ తయారు చేస్తున్నారు. అధికారికంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పార్టీ అంతర్గతంగా ఎమ్మెల్యేలు, ఎంఎల్ సీలతో కూడిన కీలక కమిటీ చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని నూతన పంచాయతీల ఏర్పాటును ఫైనలైజ్ చేస్తున్నారు. రాజకీయంగా టీఆర్ఎస్ ను బలోపేతం చేసే దిశలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించాలా? పరోక్షంగా అయితే ఉత్తమ ఫలితాలు సాధించగలమా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై పార్టీలోని ఉన్నతవర్గాలు సంప్రతింపులు జరుపుతున్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తెలుసుకున్న తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ఫైనల్ చేస్తారు. ఎన్నిక ఎలా ఉండాలనే విధానపరమైన అంశంలో ఎమ్మెల్యేలను కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల నెగ్గించే బాధ్యత కూడా వారిపై ఉంటుందని టీఆర్ఎస్ అధిష్టానం యోచన చేస్తోంది.

పరోక్షంతోనే పగ్గాలు...?

పంచాయతీ సర్పంచ్ లకు పరోక్షంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల టీఆర్ఎస్ అధికంగా లబ్ధి పొందగలుగుతుందని మెజారిటీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా స్థానికంగా పలుకుబడి కలిగినవారు, ప్రజల్లో కలిసి పోయే వారు పంచాయతీల్లో ఎన్నికవుతుంటారు. వార్డుల్లో వీరి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో కాంగ్రెసు , తెలుగు దేశం పార్టీలకు చెందిన స్థానిక నాయకులు పంచాయతీల్లో ప్రాబల్యం చూపగల స్థాయిలో ఉన్నారు. వారు కొన్ని దశాబ్దాలుగా ప్రజల్లో పనిచేసుకుంటూ పోతుండటానికి తోడు సామాజిక వర్గ సమీకరణల్లోనూ ముందున్నారు. అందువల్ల పంచాయతీల్లో వారిని ఓడించడం అంత సులభం కాదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలకు చెందిన నాయకులను పెద్ద ఎత్తున ఆకర్షించగలిగింది. అయినప్పటికీ కాంగ్రెసుకు చెందిన స్థానిక నాయకుల్లో 50 నుంచి 60 శాతం మంది ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. టీడీపీ నేతలు కూడా 20 నుంచి 25 శాతం మంది పార్టీని విడిచిపెట్టలేదని అంచనా. వీరినుంచి గట్టిపోటీనే టీఆర్ఎస్ పోటీదారులు ఎదుర్కోవాల్సి రావచ్చు. పార్టీ రహితంగా ఎన్నిక జరిగినప్పటికీ లోకల్గా ఎవరు , ఏపార్టీకి చెందినవారనే విషయమై స్పష్టత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వార్డు సభ్యులు ఏపార్టీ వారైనప్పటికీ పంచాయతీ సర్పంచ్ పదవి తమ వారికి దక్కేలా చూసుకోవాలనేది టీఆర్ఎస్ వ్యూహం. ఇందుకు పరోక్ష ఎన్నిక ఉత్తమమైనది. ఎమ్మెల్యేలు పంచాయతీల సభ్యులతో సంప్రతింపులు జరిపి సర్పంచ్ గా పార్టీ వ్యక్తిని కూర్చోబెట్టేందుకు అవకాశం ఉంటుంది. అదే సర్పంచ్ కు ప్రత్యక్ష ఎన్నిక జరిపితే స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకుడు ప్రజల నుంచి నేరుగా ఎన్నికవుతారు కాబట్టి టీఆర్ఎస్ ప్రభావితం చేసేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందులోనూ అభివృద్ది నిధుల వంటివాటిని ప్రతిపక్షానికి చెందిన సర్పంచ్ సద్వినియోగం చేస్తే ఎమ్మెల్యే ఎన్నికలలో సైతం టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగలవచ్చు. ఈ కారణంతోనే పరోక్ష ఎన్నికలతో పగ్గాలను అధీనంలోకి తెచ్చుకోవాలని టీఆర్ఎస్ వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారు.

నిధులు..కలెక్టర్ల నియంత్రణ ...

గత కొంతకాలంగా పంచాయతీరాజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన మాట వాస్తవం. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. 73 వ రాజ్యాంగ సవరణ ప్రకారం బదిలీ చేయాల్సిన 29 అధికారాలలో అధికశాతం ఇంకా రాష్ట్రప్రభుత్వాల గుప్పెట్లోనే ఉండిపోయాయి. వివిధ పథకాలను రెవిన్యూ శాఖ నేరుగా అమలు చేస్తోంది. పంచాయతీల భాగస్వామ్యం లేకుండాపోతోంది. దీనివల్ల కలెక్టర్లు కూడా సర్పంచ్ లను , స్థానిక ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదు. తెలంగాణలో 8684 పంచాయతీలున్నాయి. మరో 4 వేల పంచాయతీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయిదు వందల జనాభాతో కూడిన చిన్న పంచాయతీకి కనీసం అయిదు లక్షల రూపాయల వార్షిక ఆర్థిక గ్రాంటును ప్రభుత్వం అందచేయాలనుకొంటోంది . పంచాయతీ పరిధిని బట్టి 25లక్షల రూపాయల వరకూ నిధులు ఇవ్వడమే కాదు. నియంత్రణను సైతం ప్రభుత్వ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. నేరుగా కలెక్టర్లు పంచాయతీలను పర్యవేక్షించేలా విధి విదానాలను కూడా రూపొందిస్తున్నారు. దీంతో పేరుకు పంచాయతీలకు నిధులిచ్చినట్లుంటుంది. పెత్తనం మాత్రం సర్కారుదే. రాజకీయంగా, అభివృద్ధి పరంగా నియంత్రించేందుకు అవసరమైన ఏర్పాట్లకు ఈ చర్య దోహదం చేస్తుంది.

పొలిటికల్ పోలరైజేషన్...

ఏపార్టీకి చెందిన వారైన ప్రజల్లో పలుకుబడి ఉన్నవారు పరోక్ష ఎన్నికలో సర్పంచ్ లు అయ్యేందుకు సహకరించడం ద్వారా టీఆర్ఎస్ లో చేరికలు పెంచాలని అధినాయకత్వం భావిస్తోంది. దీనివల్ల గ్రామస్థాయిలో పొలిటికల్ పోలరైజేషన్ సులభంగా సాధ్యమవుతుంది. గ్రామాల్లో పలుకుబడికి మారుపేరుగా పార్టీ నాయకత్వం రూపాంతరం చెందుతుంది. పంచాయతీల రాజకీయ నాయకత్వాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి పార్టీకి వీలవుతుంది. రెడ్డి, దళిత్ కాంబినేషన్ తో రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది కాంగ్రెసు. రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలకు గాను దళిత్, రెడ్డి కాంబినేషన్ వర్కవుట్ అయితే 12 జిల్లాల్లో కాంగ్రెసు గెలుపును అడ్డుకోవడం సాధ్యం కాదని టీఆర్ఎస్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. దీనికి విరుగుడుగా పంచాయతీలను ముందస్తుగా కైవసం చేసుకోవడం ద్వారా లోకల్ గా పట్టు సాధించి శాసనసభ ఎన్నికలకు వెళ్లడం మంచిదనే యోచనలో ఉంది టీఆర్ఎస్ నాయకత్వం. కాంగ్రెసు, టీడీపీ స్థానిక నాయకత్వాల చేరికతో టీఆర్ఎస్ బలోపేతమవుతుందని విశ్వసిస్తోంది. ఆ బలం అసెంబ్లీ ఎన్నికల నాటికి సమీకృతం చేసుకోవచ్చనేది అంచనా. పంచాయతీ ఎన్నికలను కొంత ముందస్తుగానే జరపడానికి రాష్ట్రస్థాయి రాజకీయ వ్యూహమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News