లాల్ కృష్ణ అద్వానీ... భారతీయ జనతాపార్టీకి ఆద్యుడు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, అద్వానీలను పార్టీకి కళ్లు, చెవులు వంటి వారని చెబుతుంటారు. రెండు స్థానాల నుంచి పార్టీని దాదాపు వంద స్థానాలకు చేర్చిన ఘనత ఆయనదే. తన రధయాత్ర ద్వారా 1989లో పార్టీకి బలమైన పునాదులు వేశారు. పార్టీ వ్యవహారాల్లో వాజపేయికి ప్రాధాన్యం ఉన్నప్పటికీ పార్టీకి దశ..దిశా నిర్దేశం అన్నీ అద్వానీ కనుసన్నల్లోనే నడిచేవి. ఒకదశలో అత్యున్నతమైన ప్రధాని, అనంతర కాలంలో రాష్ట్రపతి వంటి రాజ్యాంగ పదవికి ఆయన పేరు వినిపించినప్పటికీ అంతర్గత రాజకీయాల కారణంగా ఆయన వెనక్కి వెళ్లిపోయారు. గత నెల8న 90వ వడిలోకి ప్రవేశించిన ఈ గాంధీనగర్ లోక్ సభ సభ్యుడు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. ఇదో రాజకీయ వైచిత్రి.
ఒకప్పుడు కీలకవ్యక్తి....
గుజరాత్ కు సంబంధించినంత వరకూ నరేంద్ర మోడీ, అమిత్ షా, అద్వానీ అత్యంత కీలక వ్యక్తులు. ముగ్గురూ ఈ రాష్ట్రం వారే. పాకిస్థాన్ లోని సింథ్ ప్రావిన్స్ లో జన్మించిన అద్వానీ దేశ విభజన సమయంలో ఇక్కడే స్థిరపడిపోయారు. తన రాజకీయ కార్యకలాపాలకు గుజరాత్ ను కేంద్ర స్థానంగా ఎంచుకున్నారు. రాష్ట్రంలోని గాంధీనగర్ నుంచి ప్రస్తుతం ఆయన లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1991 నుంచి ఆయన అప్రతిహతంగా లోక్ సభకు ఎన్నికవుతున్నారు. జైన్ హవాలా డైరీ కేసులో తన పేరు వెలుగులోకి రావవడంతో 1996లో తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నిప్పులాంటి నేత ఆయన. ప్రస్తుతం బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్. మార్గదర్శక మండలి సభ్యుడు.
గుజరాత్ కు రాని అద్వానీ....
ఇంత సుదీర్ఘ చరిత్ర, నిబద్ధత, అనుభవం కల నాయకుడు సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. పార్టీ వైఖరే ఇందుకు కారణమని చెబుతున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేయనున్న 40 మంది ప్రముఖుల జాబితాలో అద్వానీ పేరుంది. మోడీ, అమిత్ షాల తర్వాత ఆయన పేరు మూడో స్థానంలో జాబితాలో ఉంది. నాలుగో పేరు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్. అయినప్పటికీ అద్వానీ రాష్ట్ర రాజకీయాలకు, ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. మోడీ, అమిత్ షాలు ఇద్దరే అన్ని వ్యవహారాలనూ చక్కబెడుతున్నారు. తన సుదర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల ప్రచారానికి అద్వానీ దూరంగా ఉండటం ఇదే ప్రధమం. 1990 నుంచి జరుగుతున్న ప్రతి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆయనదే కీలకపాత్ర. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరున్నప్పటికీ, జాతీయ అధ్యక్షుడిగా ఎవరు చక్రం తిప్పుతున్నప్పటికీ అద్వానీ కను సన్నల్లోనే అన్ని వ్యవహారాలూ నడుస్తుండేవి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ అన్నీ తానై ఒంటిచేత్తో నడిపించేవారు. రాష్ట్ర రాజకీయాలు ఆయనకు కొట్టిన పిండి. ఎక్కడ ఏ అభ్యర్థి విజయం సాధిస్తారో, ఏ సమయంలో ఏ నినాదం పార్టీని గట్టెక్కిస్తుందో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియవు. అందువల్లే పార్టీ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. రాష్ట్రాన్ని పార్టీకి ప్రయోగశాలగా, ఒక నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అద్వానీ పాత్రను ఎవరూ తోసిపుచ్చలేరు. గత రెండు దశాబ్దాల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఆయన కళ్లు, చెవులుగా పనిచేశారన్నది వాస్తవం. ఇదంతా ఒకప్పటి చరిత్ర. ఈ అగ్రనేత పాత్ర ఇప్పుడు పార్టీలో అత్యంత పరిమితం. పార్లమెంటరీ పా్రటీ ఛైర్మన్, మార్గదర్శక సభ్యత్వం వంటివి అలంకారప్రాయ పదవులే. ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర కాదు కదా... కనీసం తన సొంత లోక్ సభ నియోజకవర్గమైన గాంధీనగర్ పరిధిలో అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన ప్రమేయం లేదు. ప్రచారం ఊసే లేదు. ఈ నియోజకవర్గ పరిధిలో గాంధీనగర్, కలోల్, ఘట్లోదియా, వెజల్ ప్లర్, నరగ్ పుర, సబర్మతి, సనద్ స్థానాలున్నాయి.
మోడీని ఆపద సమయంలో....
2014 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిగా పార్టీ నరేంద్రమోడీ పేరును ప్రకటించినప్పటి నుంచి అద్వానీ, మోడీల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. పార్టీ వ్యవస్థాపకుడైనతనను కాదని, తన కళ్లముందు పుట్టి పెరిగి, తాను తీర్చిదిద్దిన శిష్యుడిని తనకు పోటీదారుగా, ప్రత్యామ్నాయంగా పార్టీ తెరపైకి తీసుకురావడాన్నిఈ వృద్ధ నేత జీర్ణించుకోలేక పోయారు. ప్రధాని పదవి కాకపోయినా కనీసం రాష్ట్రపతి పదవికి అయినా తన పేరును ప్రకటిస్తుందన్న ఆశ నిరాశ కావడంతో అద్వానీ కుంగిపోయారు. గోద్రా అల్లర్ల సమయంలో ‘రాజధర్మ’ పేరుతో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీని తప్పించాలని ప్రధాని వాజపేయి ప్రతిపాదించారు. మోడీ వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న వాజపేయికి నచ్చజెప్పడంలో అప్పట్లో అద్వానీ కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి ఆరోజు అద్వానీ అడ్డుపడి ఉండక పోతే మోడీ రాజకీయ జీవితం మరో రకంగా ఉండేది. ప్రస్తుత స్థాయి మాత్రం ఉండేది కాదన్న మాట వాస్తవం. తాను కాపాడిన వ్యక్తి తనను పక్కన పెట్టారు. రాజకీయాలు అంటే ఇలానే ఉంటాయి. విలువలు కొరవడిన సమకాలీన రాజకీయాల్లో పరిస్థితులు ఇంత కన్నా భిన్నంగా ఉంటాయని అనుకోవడం భ్రమ అవుతుంది.
-గుజరాత్ నుంచి ‘తెలుగు పోస్ట్’ ప్రత్యేక ప్రతినిధి