రాజకీయం...నేరం... వ్యాపారం... ఆధునిక ప్రజాస్వామ్యానికి మూలస్థంభాలుగా మారిపోయాయి. ఇవి పాలునీళ్లలా కలిసి పోయాయి. మూడింటి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది. గతంలో సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చేవారు. నాయకులకు పరోక్షంగా, తెరవెనక నుంచి మద్దతు ఇచ్చే నేరగాళ్లు నేడు ప్రత్యక్షంగా రాజకీయ నాయకుల అవతారమెత్తుతున్నారు. విరాళాలు,చందాలను సమకూర్చి రాజకీయ నాయకులకు అండదండగా నిలిచే వ్యాపారవేత్తలు నేడు రాజకీయం నడపడం సర్వ సాధారణమైంది. ఈ పరిణామాల కారణంగా ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యావేత్తలు తెరవెనక్కు వెళుతున్నారు. ఫలితంగా ఆధునిక ప్రజాస్వామ్యానికి అర్థమే మారిపోయింది.
దాదాపు అందరూ నేరచరితులే...
మహాత్మాగాంధీ జన్మించిన గుజరాత్ రాష్ట్రం చూస్తే ఈ అభిప్రాయం కలగక మానదు. అక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో దాదాపు అందరూ నేరచరితులే కావడం గమనార్హం. ఎవరో ఒకరిద్దరు తప్ప అభ్యర్థులు కూడా బడాబాబులే కావడం విశేషం. ఈ నెల9న జరగనున్న మొదటి విడత ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. మొత్తం 182 స్థానాలకు గాను సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో గల 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 923 మంది అభ్యర్థుల ప్రమాణ పత్రాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ ఎలక్షన్ వాచ్, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వెల్లడించిన వివరాలను చూస్తే ఆధునిక ప్రజాస్వామ్యం అపహాస్యం చేయడంలో పార్టీలు పోటీ పడుతున్నట్లు కనపడుతోంది. చిన్నా చితకా పార్టీలను పక్కన పెడితే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశం.
కాంగ్రెస్ లో ఎక్కువగా....
మొత్తం అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 36 శాతం, బీజేపీకి చెందిన 25 శాతం మంది అభ్యర్థులు నేరచరితులని గణాంకాలు ఘోషిస్తున్నాయి. కాంగ్రెస్ కేటాయించిన అయిదు స్థానాల్లో పోటీ చేస్తున్న భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు మహేశ్ వాసవ పై అనేక కేసులు నమోదయ్యాయి. హత్య, దోపిడీ తదితర 23 కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు. భారతీయ ట్రైబల్ పార్టీకి ఐదు రిజర్వడ్ సీట్లను కాంగ్రెస్ కేటాయించింది. బీఎస్పీకి చెందిన 11 మంది, ఎన్సీపీకి చెందిన నలుగురు, ఆప్ కు చెందిన ఇద్దరు బరిలో ఉన్నారు. మొత్తం 21 నియోజకవర్గాలు సున్నితమైనవని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం పేర్కొంది. ఈ నియోజకవర్గాల్లో కనీసం ముగ్గురు అభ్యర్థులు కేసులను ఎదుర్కొంటున్నారు. జామ్ నగర్ నార్త్ స్థానంలో అత్యధికంగా ఏడుగురు నేరచరితులు ఉన్నారు. మొత్తం 977 మంది అభ్యర్థులకు గాను 923 మంది నామినేషన్ పత్రాలను పరిశీలించగా వెల్లడైన వివరాలు ఇవీ. మిగిలిన 54 మంది వివరాలు ఎక్కడా లభ్యం కాలేదు. హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడి వంటి కేసులు వీరిపై నమోదయ్యాయి. ఇద్దరు అభ్యర్థులు ఐపీసీ 376 కింది అత్యాచారం, మరో అభ్యర్ధి ఐపీసీ 509 సెక్షన్ కింద నేరాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వ్యవస్థాపకుడు జగదీప్ చ్చొకర్ ఆవేదన చెందారు.
ఆస్తుల్లో మాత్రం బీజేపీయే....
ఆస్తులలో అధికార బీజేపీ అభ్యర్థులు అగ్రస్థానంలో ఉన్నారు. బీజేపీకి చెందిన 89 మందిలో 76 మంది అభ్యర్థులు కోటీశ్వరులే కావడం గమనార్హం. ఈ విషయంలో కాంగ్రెస్ ఒకింత వెనకబడి ఉంది. ఆ పార్టీ ఆధ్వర్యంలో 60 మంది మాత్రమే కోటీశ్వరులు. సగటున అభ్యర్థులు రూ.2.16 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ప్రకాశ్ భాయ్ ఉనద్కత్, రఫిక్ చౌహాన్ తమకు ఆస్తులు ఏమీ లేవని ప్రకటించారు. అందరికన్నా అత్యధిక సంపన్నుడు కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనీల్ రాజ్ గురు. ఆయన తన ఆస్తులను రూ.141 కో్ట్లుగా ప్రకటించారు. రాజ్ గురు రాజ్ కోట్ వెస్ట నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి విజయ్ రూపానీపై పోటీ చేస్తున్నారు. రూ.123 కోట్లతో బీజేపీ అభ్యర్థి సౌరభ్ దలాల్ ద్వితీయ స్థానంలో ఉన్నారు. బోటద్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర మంత్రి. రూ.113 కోట్లతో బీజేపీ అభ్యర్థి ధన్ జీ పటేల్ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన సురేంద్ర నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మేష్ ఉపాధ్యాయ తన ఆస్తి కేవలం రూ.600లుగా పేర్కొన్నారు.
విద్యార్హతలు, మహిళల పరంగా చూస్తే లోపం స్పష్టంగా అర్ధమవుతోంది. మొత్తం అభ్యర్థుల్లో 57 మంది మాత్రమే మహిళలు. మొత్తం అభ్యర్థుల్లో 580 మంది కేవలం 5 నుంచి 12వ తరగతి లోపు చదువుకున్న వారే కావడం గమనార్హం. 76 మంది అభ్యర్థులు తాము నిరక్ష్యరాస్యులమని ప్రకటించారు. అభ్యర్థుల గుణగణాలు, విద్యార్హతలను పరిశీలిస్తే ఒకింత ఆవేదన కలిగే మాట వాస్తవం. ఈ పరిస్థితో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-గుజరాత్ నుంచి ‘తెలుగుపోస్ట్’ ప్రత్యేక ప్రతినిధి