సంక్షోభ సమయంలో సారథ్య బాధ్యతలు. సమస్యల సవాళ్ల మధ్యనే స్వాగత వచనాలు. ఒకవైపు పాన్ ఇండియా ప్రాభవం కోల్పోతున్న పార్టీ. పలాయనం ప్రకటిస్తున్న పాత కాపులు. అధికార వైభోగాలను అనుభవించి అందనంత దూరం వెళ్లిపోతున్న అగ్రనేతలు. రాజకీయ సుడిగుండాల మధ్య ప్రజా మనోభావాల గండాల మధ్య గ్రాండ్ ఓల్డ్ పార్టీకి లీడర్ కాబోతున్నారు రాహుల్ గాంధీ. అధ్యక్ష పదవికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంచనమే. అధికారికంగా పదకొండో తారీఖున ప్రకటించడమే ఇక మిగిలింది. అప్పుడే ప్రధాని మోడీ కాంగ్రెసు లో ఔరంగజేబ్ రాజ్ మొదలైందంటూ ఎకసెక్కాలు మొదలు పెట్టేశారు. ప్రధాన ప్రతిపక్షంపై తాను నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తానని చెప్పకనే చెప్పేశారు. ఆచితూచి అడుగులు వేయడంతోపాటు చెల్లాచెదురుగా పడి ఉన్న కాంగ్రెసు శ్రేణులను ఇటుకఇటుక గా పేర్చుకుంటూ మహాసౌధాన్ని మళ్లీ నిర్మించుకోవాల్సిన ఆర్కిటెక్ట్ ఇప్పుడు రాహుల్ గాంధీయే.
యంగ్ ఇండియాకు ..ప్రతీక...
ప్రతికూలతలు ఎన్ని ఉన్నప్పటికీ సాంకేతికంగా , వయసు రీత్యా అనుకూలతలు కూడా కాంగ్రెసు కు వారసత్వంగానే కలిసి వస్తున్నాయి. భిన్న సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన గంగా జమునా తెహజీబ్ గా నేటికీ కాంగ్రెసు పార్టీకి ఆదరణ ఉంది. భారత మౌలిక సంప్రదాయ పునాదులను గుర్తు చేయడంతోపాటు వాటిని పటిష్టీకరించే బాధ్యత చేపడితే కాంగ్రెసు బలపడుతుంది. ఇప్పుడు ఆ కర్తవ్యం యువ వారసుడు రాహుల్ భుజస్కంధాలపై పడింది. ప్రస్తుతం దేశ,ప్రాంతీయ రాజకీయాల్లో హవా చెలాయిస్తున్న నరేంద్రమోడీ, అమిత్ షా, మాయావతి, నితీశ్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ వంటి వారు రాజకీయంగా రాహుల్ కంటే ముందు తరం వారు. వీరికంటే దాదాపు రెండు దశాబ్దాల చిన్నవాడైన రాహుల్ ను యంగ్ ఇండియాకు ప్రతీకగా చూడవచ్చు. పొలిటికల్ జనరేషనల్ షిప్ట్ గా దీనిని కాంగ్రెసు పార్టీ అభివర్ణిస్తోంది. 2019 ఎన్నికలపై కాంగ్రెసు పార్టీకి పెద్దగా ఆశలు లేవు. కానీ 2024 నాటికి కచ్చితంగా పార్టీ పుంజుకుంటుందనే ఆశలు నెలకొంటున్నాయి. ఈలోపు అవసరమైన పార్టీ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసి యుద్ధానికి శ్రేణులను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. రాజకీయాలు నేర చరిత, అవినీతికి దూరంగా ఉండాలని కోరుకునే నాయకుల్లో రాహుల్ ఒకరని పార్టీ అగ్రనేతలు సైతం చెబుతారు. అంతేకాదు, రైతాంగ సమస్యలపైన కూడా చిత్తశుద్ధి చూపి ఆందోళనలు చేసిన ఉదంతాలున్నాయి. 2013 భూసేకరణ చట్టాన్ని రైతాంగ అనుకూలంగా తీర్చిదిద్దిన విషయాల్లో అతని భాగస్వామ్యాన్ని కూడా ప్రశంసిస్తుంటారు. మూలాలను మర్చిపోకుండా ఉంటే ఏనాటికైనా నిలదొక్కుకోవడం కష్టం కాదు.
సమస్యల సవాళ్లు...
బాధ్యతలు చేపట్టే నాటికే రాహుల్ రెండు పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నేరుగా బీజేపీతో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెసు పోటీ పడుతోంది. గుజరాత్ లో అధికారంలోకి రాలేకపోయినా గట్టిపోటీదారుగా నిలిచి బీజేపీకి పోటాపోటీగా సీట్లు సాధించగలిగితే చాలు కాంగ్రెసు కొంత నైతిక స్థైర్యాన్ని పుంజుకోగలుగుతుంది. ఎందుకంటే గుజరాత్ పార్టీ ప్రచారాన్ని నేరుగా రాహుల్ నిర్వహిస్తూ వచ్చారు. 2018 లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి చోట్ల ఎన్నికల్లోనూ బీజేపీతో ముఖాముఖి తప్పదు. ఇక్కడ పోరాట పటిమను చూపగలిగితే పార్టీ పునరుజ్జీవం పొందడం కష్టసాధ్యమేమీ కాదు. 2019 నాటికే కొంతమేరకు పునర్వైభవం కూడా సంతరించుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెసు బలమైన శక్తిగా తలపడుతుండేది. ఇటీవల ఆ పరిస్థితులు క్షీణిస్తున్నాయి. 25 లోక్ సభ స్థానాలున్న ఈశాన్యంలోని కొన్ని రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ వంటి చోట్ల వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది కూడా ప్రతిష్టాత్మకమే. పార్టీ ఓటు బ్యాంకు క్రమేపీ తగ్గిపోవడంతో గతంలో ఆయువు పట్టులాంటి రాష్ట్రాల్లో కూడా అస్తిత్వం నామమాత్రమై పోయింది. ఆంధ్రప్రదేశ్ ను ఇందుకొక ఉదాహరణగా చెప్పుకోవాలి. పార్టీకి పాన్ ఇండియా గుర్తింపును తెచ్చుకోవాలంటే సీట్లు, ఓట్లు కోల్పోయిన రాష్ట్రాల్లో పార్టీని పునర్నిర్మాణం చేసుకుని ప్రతిష్టను పునరుద్ధరించుకోవాలి.
రాహుల్ ...రక్షక్ కాగలడా?
ఇందిర, రాజీవ్ ల హయాంలో వారి చుట్టూ ఉండే కోటరీ అనేక తప్పిదాలకు కారణమైంది. దానికి వ్యక్తిగతంగా ఇందిర, రాజీవ్ లు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పార్టీ కూడా కోలుకోలేని దెబ్బతింది. యూత్ బ్రిగేడ్ తో ముందుకువెళుతున్న రాహుల్ వందిమాగధుల విషయంలో అప్రమత్తంగా ఉంటేనే మేలు జరుగుతుంది. నెహ్రూ, ఇందిర, రాజీవ్ లకు పదవులు అయాచితంగా దక్కుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు సంక్షోభ సమయంలో కాంగ్రెసు పార్టీవైపు కన్నెత్తి చూసే నాయకులే కరవు అవుతున్నారు. ఏ చరిత్ర చూసినా ఇటువంటి సమస్యలే నాయకుల సామర్ధ్యానికి దర్పణం పడుతుంటాయి. అందువల్ల ఇదొక అద్భుతమైన అవకాశంగా మలచుకుని పార్టీని ముందుకు నడిపేందుకు వీలు చిక్కుతుంది. పాచి పట్టిన బూజు మనస్తత్వాలు, అవినీతి పంకిలంలో కూరుకుపోయిన నాయకులను వదిలించుకోవడానికి కూడా ఇదే మంచి తరుణం. పార్టీ శ్రేయస్సును కోరుకునే వారందరూ ఆయనకు గట్టి మద్దతుగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. రాహుల్ కలిసిన సందర్బంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కనబరిచిన ఆత్మీయత, ఆశీర్వచనాలను ఇందుకు ఒక సంకేతంగా చెప్పవచ్చు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పినట్లు రాహుల్ డార్లింగ్ ఆప్ కాంగ్రెసు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన అధ్యక్ష పగ్గాలు ఎప్పుడు చేపడతారా అని పార్టీ శ్రేణులు దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్నాయి. కానీ తన పనితీరుతో డార్లింగ్ ఆప్ మాసెస్ గా మారినప్పుడే రాహుల్ భారత రాజకీయాల్లో దీర్ఘకాలం మనుగడ సాగించగలుగుతారు. పార్టీకి పునరుద్దీపన కలిగించగలుగుతారు.
-ఎడిటోరియల్ డెస్క్