కాంగ్రెసు లో కొత్త శకం...!

Update: 2017-11-20 16:30 GMT

ఆధునిక రాజకీయాల్లోనూ ఆనాటి రాచరికపు ఆనవాళ్లు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. ప్రత్యర్థులను నిర్దాక్షిణ్యంగా అణచివేయడమే కాకుండా భవిష్యత్తులో పోటీగామారతారని భావించిన వాళ్లను సైతం మొగ్గలోనే తుంచేయడం మనకు చరిత్ర నేర్పిన పాఠం. కాంగ్రెసు పార్టీ యువరాజు రాహుల్ గాంధీ పార్టీ అధినేతగా పట్టాభిషిక్తుడు కావడానికి సర్వం సిద్ధమైన తరుణంలో మరోసారి ఆయా అంశాలు చర్చనీయమవుతున్నాయి. స్వాతంత్ర్యానంతరం నాలుగు తరాల వారసత్వ రాజకీయాలను చవిచూసిన కాంగ్రెసు పార్టీ అయిదో తరం వారసునికి ఆహ్వానం పలుకుతోంది. 34 సంవత్సరాల వయసులో లోక్ సభ సభ్యునిగా రాజకీయ రంగప్రవేశం చేసింది మొదలు రాహుల్ ఎదుర్కొన్నన్ని విమర్శలు రాజకీయంగా ఎవరూ ఎదుర్కొని ఉండరు. బాధ్యతలను పట్టించుకోరని, పరిణతి చెందలేదని, అధికారమంటే భయపడతారని ఇలా రకరకాల వ్యక్తిగత, సంస్థాగత విమర్శలతో ఆయనపై అసమర్థునిగా ఒక ముద్ర వేసే ప్రయత్నం సీరియస్ గానే సాగింది. ఇందుకు విపక్షాలకు తోడు సొంతపక్షంలోని వృద్ధతరం నాయకులూ ఒక కారణంగా చెప్పుకోవాలి. రాహుల్ ఆలోచన ధోరణి భిన్నమైనది . ఆయన పగ్గాలు స్వీకరిస్తే తమ పప్పులుడకవనే భావనతో సోనియాకు తప్పుడు సలహాలిస్తూ పదవీస్వీకారాన్ని వాయిదా వేయించడంలోనూ అగ్రనాయకుల పాత్ర ఉందని కాంగ్రెసు యువనాయకులు చెబుతుంటారు. మొత్తమ్మీద ఆటంకాలన్నిటినీ అధిగమించి ఎట్టకేలకు పార్టీ పట్టాభిషేకానికి ఆయన రెడీ అయిపోయారు.

ముత్తాత నుంచి తండ్రి వరకూ...

ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెసు పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. ప్రధానిగానూ దీర్ఘకాలం వ్యవహరించారు. రాహుల్ గాంధీ పుట్టుకకు ఆరేళ్లముందే ఆయన మరణించారు. కాంగ్రెసు పార్టీలో నెహ్రూ ముద్ర ప్రభావాన్వితమైనది. వారసత్వ రాజకీయాలకు ఆయనే పునాది వేశారని చెప్పాలి. స్వాతంత్ర్య కాలంలోనూ, అనంతరం తొలిదశలోనూ మేరునగధీరులవంటి నాయకులు కాంగ్రెసు పార్టీలో ఉండేవారు. వారితో పోలిస్తే ఇందిర చాలా జూనియర్. అనుభవం కూడా అంతంతమాత్రమే . అయినా నెహ్రూ పట్టుపట్టి వ్యూహాత్మకంగా పావులు కదిపి 1959 నాటికి ఆమెను కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలిని చేయగలిగారు. ఇదంతా పైకి సాఫీగా, ప్రజాస్వామ్య యుతంగా జరిగినట్లు కనిపించినా పార్టీపై కుటుంబ పెత్తనానికి తొలి అడుగు పడింది అప్పుడే. తర్వాత ఇందిర చాకచక్యంతో పార్టీపై పట్టుబిగించారు. ప్రధానిగా వివిధ సంక్షేమపథకాలను, విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రజల్లో పలుకుబడి తెచ్చుకున్నారు. ప్రజామద్దతు ఆసరాగా పార్టీలో వేళ్లూనుకున్న సీనియర్ సిండికేట్ నాయకులను మట్టికరిపించి పార్టీకి దూరం చేయగలిగారు. ఎమర్జెన్సీ తర్వాత కూడా తలెగరేసి సొంత కుంపటి పెట్టుకున్న నాయకులను చిత్తు చిత్తు చేశారు. దీంతో నెహ్రూ ప్రారంభించిన కుటుంబ వారసత్వప్రస్థానాన్ని ఇందిర సుస్థిరపరిచారు. ఈ కారణంగానే రాజీవ్ గాంధీ పార్టీ పగ్గాలు, ప్రధాని పదవి చేపట్టడం నల్లేరుపై బండి నడకలా సాగిపోయింది. తర్వాత కాలంలో కుటుంబ ఆధిపత్యాన్ని పార్టీపరంగా సవాల్ చేసే వారే లేకుండా పోయారు. సోనియాకు కూడా అదే కలిసొచ్చింది. రాజీవ్ మరణం తర్వాత కొంతకాలం పాటు పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ కుటుంబ కనుసన్నల్లోనే కాంగ్రెసు కొనసాగింది. శరద్ పవార్ వంటి వారు కొన్ని సందర్భాల్లో సోనియాను అడ్డుకోవాలని చూసినా వారే వేరుకుంపటి పెట్టుకోవాల్సి వచ్చింది.

కొత్త ఆశల వారధి...

కాంగ్రెసుపార్టీ చరిత్రలోనే దీర్ఘకాలం( రెండు దశాబ్దాలపాటు) పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారు సోనియా. నిజానికి భారత రాజకీయాల గురించి ఇక్కడి నాయకుల మనస్తత్వాల గురించి ఆమెకు తెలిసింది అంతంతమాత్రమే. పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఒక్కో అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ఈ ప్రస్థానంలో రాహుల్ కూడా భాగస్వామే. కీలకాంశాల్లో తల్లికి చేదోడువాదోడుగా నిలుస్తూ వచ్చారు. నిజానికి చెప్పాలంటే సోనియా, రాహుల్ రాజకీయ ప్రస్థానం ఏక కాలంలో కలిసి సాగినట్లుగానే చూడాలి. అధ్యక్షస్థానంలో ఆమె కూర్చుంటే లెఫ్టినెంట్ గా రాహుల్ వ్యవహరించారు. అయితే పూర్తిగా రాహుల్ చెప్పిన అన్నివిషయాలను సోనియా పాటించారని చెప్పలేం. అహ్మద్ పటేల్, జనార్దన్ పూజారి, దిగ్విజయ్, గులాం నబీ వంటివారి సలహాలకు వయసు రీత్యా ఆమె ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇది కొంతమేరకు పార్టీకి నష్టం చేసిందని కూడా చెప్పాలి. ప్రభుత్వ పరంగా అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిపట్ల సోనియా కొంత కఠినంగా వ్యవహరించలేకపోయేవారు. ప్రాంతీయంగా నాయకులు సొంతంగా బలపడటానికి , పార్టీకి మించి ఎదిగిపోవడానికి ఇది కారణమైంది. దక్షిణాదిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి, పంజాబ్ లో అమరీందర్ సింగ్, కర్ణాటకలో సిద్ధరామయ్య ఇలా కొందరు నాయకులు పార్టీకి అతీతంగా రూపుదాల్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ రాక పార్టీ పరంగా అనేక సమస్యలకు సమాధానం చెబుతుందనే ఆశ యువ నాయకుల్లోనూ ,పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది.

సరైన సమయం..సమర్థ నిర్ణయం....

ఇంకో ఏడాదిన్నర లోపు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో రాహుల్ ను అధ్యక్షుడిని చేయడం సరైన నిర్ణయంగా పార్టీలోని మెజార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. క్యాడర్ లో కొత్త ఉత్సాహం తొణికిసలాడటంతోపాటు యువతరం పార్టీవైపు ఆకర్షితులు కావడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ వైపు యువత ఎక్కువగా ఆకర్షితులయ్యారు. మూడున్నరేళ్ల పరిపాలన తర్వాత వాస్తవాలు కళ్లముందు కదలాడుతుంటే మోడీ పై పెట్టుకున్న భ్రమలు తొలగిపోతున్నాయి. వయసు రీత్యా మోడీ కంటే ఇరవై సంవత్సరాల చిన్నవాడైన రాహుల్ ను రంగంలోకి దింపి దేశవ్యాప్తంగా పర్యటింప చేస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి ఫలితం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాహుల్ గాంధీ తన ముత్తాత, తండ్రి, తల్లుల తో పోలిస్తే నిర్మొహమాటంగా వ్యవహరిస్తారనే పేరు పార్టీ వర్గాల్లో ఉంది. అందువల్ల ఆయన అంత తొందరగా ఇన్ఫ్లూయన్స్ కు గురికారు. నిక్కచ్చిగా నిర్ణయాలు తీసుకుంటారు. కోటరీని కూడా దూరంగా ఉంచుతారని చెబుతున్నారు. ఇందిర,రాజీవ్ లు ఈ కోటరీ వ్యవహారాల కారణంగానే రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు. బోఫోర్సు వంటి కుంభకోణాలు వెంటాడాయి. సోనియా మెతక వైఖరి కారణంగానూ యూపీఏ హయాంలో భారీ కుంభకోణాలకు ఆస్కారం ఏర్పడింది. రాహుల్ ఈ విషయంలో ధృఢ వైఖరి కనబరుస్తారనే విశ్వాసాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికారం కోసం రాజీ పడరు. పదేళ్లపాటు తనకు అందుబాటులో పదవులు ఉన్నప్పటికీ వాటికి దూరంగా ఉండటమే ఇందుకు నిదర్శనమంటున్నారు. మొత్తమ్మీద 2019 ఎన్నికలకు సంసిద్ధమయ్యే క్రమంలో తొలి నిర్ణయంగా రాహుల్ పట్టాభిషేకాన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా తిలకిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News