కలహాలు వీడి... కలిసి నడుస్తారా?

Update: 2018-02-04 16:30 GMT

ఒకవైపు భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ బలహీన పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెసు సారథ్యంలోని యూపీఏ ఇంకా పుంజుకుంటున్న వాతావరణం ఏర్పడలేదు. యూపీఏ1, యూపీఏ2 పరిపాలన కాలంలో బలమైన రాజకీయ కూటమిగా ముందుకు సాగిన భాగస్వాములు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్షబాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెసు పార్టీలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. నిర్ణయాల్లో వేగం పెరిగింది. యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీకి భారంగా మారిన వృద్ధతరాన్ని క్రమేపీ సలహాపాత్రకు పరిమితం చేస్తూ సమూల మార్పులుచేసే దిశలో కాంగ్రెసు క్రియాశీలకంగా కదులుతోంది. అయితే యూపీఏలోని మిగిలిన పక్షాలకు రాహుల్ పై ఇంకా గురి కుదరలేదు. పాత కాంగ్రెసు పట్ల వారికున్న మక్కువ యువనేత నేతృత్వంలోని పార్టీపై చూపలేకపోతున్నారు. రాహుల్ కు రాజకీయ అనుభవం తక్కువగా ఉండటం, వయసు రీత్యా కూడా ప్రధాన ప్రాంతీయ పక్షాల నేతలకంటే చిన్నవాడు కావడం తో కాంగ్రెసు కూటమిలో చిన్నపాత్ర పోషించాలంటే సందేహిస్తున్నారు. ఇది ప్రతిపక్షాల ఐక్యతపై ప్రభావం చూపుతోంది.

పవార్ పట్టు...

యూపీఏ కూటమిలో సీనియర్ నేత అయిన నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ విపక్ష కూటమికి సారథ్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే కాంగ్రెసు ఇందుకు సుముఖంగా లేదు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఎన్డీఏని, అందులోనూ నరేంద్రమోడీ వంటి పక్కా రాజకీయ వాదిని ఎదుర్కోవాలంటే అనుభవంతో తలపండిన నాయకులే కూటమిని ముందుకు నడపాలనే డిమాండును ఎన్సీపీ ముందుకు తీసుకువస్తోంది. 1998లో సోనియా నాయకత్వాన్ని ఇష్టపడకనే పవర్ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు. తర్వాత అదే సోనియా నాయకత్వంలోని యూపీఏలో చేరి అటు మహారాష్ట్రలో ఇటు కేంద్రంలో అధికారంలో భాగస్వామి అయ్యారు. సోనియా కూడా తనకు చేసిన అవమానాన్ని సహించి పవార్ కు పెద్దపీట వేశారు. దీనిని గ్రహించి సోనియా మాటకు ఎదురుచెప్పకుండా విశ్వాసపాత్రమైన మిత్రపక్షంగానే ఎన్సీపీ వ్యవహరించింది. అయితే ఇప్పుడు తనముందు పసికూన వంటి రాహుల్ అధ్యక్షతన జరిగే మీటింగుల్లో పాల్గొనాలంటే పవార్ కు మనస్కరించడం లేదు. ఇటీవల రాజ్యాంగ పరిరక్షణ పేరిట చిన్నగా ఆందోళన చేసి ప్రతిపక్షాల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఎన్సీపీ అధినేత. ప్రతిపక్షాల్లో పెద్ద నాయకులెవరూ దీనిని పట్టించుకోలేదు. ఎన్సీపీలో నిరాశ ఆవరించింది. రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న పవార్ యూపీఏ కూటమి అధికారంలోకి వస్తే కనీసం తాను ఉపప్రధాని పదవిని పొందాలనే కోర్కెను సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అతిపెద్ద పార్టీగా కాంగ్రెసు ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు ఎన్సీపీకి ఎటువంటి అభ్యంతరం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో రాజకీయ అనుభవం దృష్ట్యా పవార్ కు యూపీఏ కూటమికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగిస్తే అందర్నీ ఒకేతాటిపైకి తీసుకురాగలరంటున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా చూపుతున్నారు. యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ 1 కాలంలోచంద్రబాబు నాయుడు, శరద్ యాదవ్ వంటి నాయకులు రాజకీయంగా కీలక భూమిక పోషించారు. బీజేపీ పెద్దపార్టీ అయినప్పటికీ మిత్రపక్షాల్లోని సీనియర్లను సమర్థంగా వినియోగించుకుంది. వారి అర్హతలకు తగిన బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ కూడా అదేరకమైన వైఖరి తీసుకుంటే చెల్లచెదురుగా ఉన్న యూపీఏ పక్షాలు తిరిగి ఏకోన్ముఖంగా నడవగలుగుతాయని పవార్ వర్గం బలంగా విశ్వసిస్తోంది. అదే విషయాన్ని ప్రచారం చేస్తోంది.

మమత బెట్టు...

సంచలన రాజకీయ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ మమత బెనర్జీ పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ పశ్చిమబంగలో భవిష్యత్తులో తనకు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాబోతోందన్న వాస్తవాన్ని గ్రహించింది. మైనారిటీ వర్గాలను సంతృప్తిపరచడమే లక్ష్యంగా పెట్టుకుని వామపక్షాల ఓటు బ్యాంకును కొల్లగొట్టి వరస విజయాలు సాధిస్తూ వస్తోందామె. ఈ రాష్ట్రంలో 27 శాతం వరకూ ఉన్న ముస్లిం మైనారిటీల్లో మెజారిటీ ప్రజలు 2011 కి ముందు వరకూ వామపక్ష కూటమిని బలపరిచేవారు. గడచిన ఆరేడు సంవత్సరాలుగా వీరి ఓటు బ్యాంకు తృణమూల్ కాంగ్రెసు వైపు షిప్టు అయిపోయింది. వామపక్షాలు, కాంగ్రెసు పార్టీ క్రమేపీ తమ ప్రాధాన్యాన్ని కోల్పోతూ వస్తున్నాయి. వివేకానంద, రవీంద్రనాథ్ టాగూర్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, సుభాష్ చంద్రబోస్ వంటి వారి మూలాలను బీజేపీ సొంతం చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. తద్వారా హిందూ ఓటుబ్యాంకును , పశ్చిమ బంగ ఆత్మగౌరవాన్ని, విశిష్టతను ప్రేరేపించే ఎత్తుగడలు వేయనారంభించింది. మైనారిటీ ఆకర్షకమంత్రంతో పనిచేస్తున్నమమతకు రానున్న కాలంలో ఈ పరిణామాలు రాజకీయంగా గడ్డు పరిస్థితి కల్పించవచ్చు. దీనికి విరుగుడుగా సాప్ట్ హిందుత్వ ఐడియాలజీని అనుసరిస్తూ పూజలు, సంప్రదాయ వేడుకలను ప్రోత్సహించడం, పాల్గొనడం వంటి కార్యక్రమాలను మమత తాజాగా మొదలు పెట్టారు. బీజేపీ దూకుడును అడ్డుకుని జాతీయంగా తృణమూల్ ప్రాభవాన్ని పరిరక్షించుకోవాలంటే యూపీఏ తో కలవకతప్పదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ సోనియా గాంధీ వంటి సీనియర్ నేతలే దిశానిర్దేశం చేస్తే బాగుంటుందనేది మమత ఆలోచన. రాహుల్ గాంధీతో ఆమెకు సరైన పొలిటికల్ ఈక్వేషన్ లేదు. తనతో కాంగ్రెసు అధ్యక్షుడిని సమఉజ్జీగా భావించకపోవడమే ఇందుకు కారణం. భవిష్యత్తులో యూపీఏకి ఒకటి రెండు సమావేశాల్లో సోనియా గాంధీ సారధ్యం వహించినప్పటికీ ఆ బాధ్యతను కూడా రాహుల్ కు అప్పగించాలనేదే ఆమె ఆలోచనగా కాంగ్రెసు వర్గాలు పేర్కొంటున్నాయి. మమత ‘ఇగో’ని సంత్రుప్తి పరచగలిగితే యూపీఏకి ఒక బలమైన పక్షం అండ దొరుకుతుంది.

మంచి అవకాశం....

ప్రతిపక్షాలన్నీ కలిసి నడిచేందుకు 2018-19 బడ్జెట్ రూపంలో ఒక మంచి అవకాశం కలిసి వచ్చింది. వివిధ ప్రాంతీయపార్టీలు తమ రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని కుతకుతలాడిపోతున్నాయి. ఎన్డీఏ లోనూ అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. బీజేపీ సొంత ఎంపీలే పూర్తి స్థాయిలో బడ్జెట్ పై సంతృప్తిగా లేరు. ఈ స్థితిలో విపక్షాలు మూకుమ్మడిగా రాజకీయ దాడి చేస్తే అధికారపక్షం ప్రతిఘటించలేక చేతులెత్తేసే వాతావరణం కనిపిస్తోంది. కానీ సొంత అజెండాలతో నడిచే ఆయా పక్షాలను ఏకతాటిపైకి తెచ్చే నాథుడెవరన్నదే ప్రశ్న. వామపక్షాల సహా అన్ని పార్టీలు ఒకేమాట మీద నిలవగలిగితే బడ్జెట్ చర్చలో కేంద్రానికి చుక్కలు చూపించవచ్చు. సమగ్ర కేటాయింపులు లేకుండా పథకాలు ప్రకటించడం, రాష్ట్రాలను సంప్రతించకుండా ఏకపక్ష విధానాల అమలు వంటివన్నీ రాజకీయంగా నిలదీయ గల అంశాలే. కాంగ్రెసు, ఇతర పార్టీలు రాజకీయంగా బడ్జెట్ ను ఎలా వినియోగించుకుంటాయనే దానిపైనే భవిష్యత్తు పొత్తులు, 2019 ఎన్నికల ప్రస్థానం ఆధారపడి ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News