కమలానికి ఇది దూరమవుతుందా?

Update: 2018-03-05 17:30 GMT

మధ్యప్రదేశ్ లో అధికార భారతీయ జనతా పార్టీ హవా తగ్గుతోందా? ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిష్ట మసకబారుతుందా? విపక్ష కాంగ్రెస్ ఊపిరి పోసుకుంటుందా? తదితర ప్రశ్నలకు అవునని సమాధానం చెప్పక తప్పదు. గత కొంతకాలంగా కమలనాధులకు ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఈసారి మరింత బలంగా మోగాయి. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమే ఇందుకు ప్రబల నిదర్శనం. ఈ ఎన్నికల ఫలితాలలను కమలనాధులు జీర్ణించుకోవడం కష్టమే. అయినా తప్పదు మరి. ఈ నేపథ్యంలో వచ్చే నవంబరు, డిసెంబర్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే కాషాయదళం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఎన్ని వ్యూహాలు పన్నినా....

తాజాగా కోలారస్, ముంగావలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార బీజేపీ సర్వశక్తులను ఒడ్డినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ రెండు స్థానాలను కాంగ్రెస్ వశం కాకుండా అడ్డుకోలేకుండా పోయింది. వాస్తవానికి ఇవేమీ బీజేపీ స్థానాలు కావు. రెండూ కాంగ్రెస్ వే. అయినప్పటికీ సాధారణ ఎన్నికలకు ముందు జరగిన ఈ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ శ్రేణుల్లో భరోసా, ఉత్సాహం కలిగించాలన్న బీజేపీ పెద్దల ప్రయత్నాలు వికటించాయి. గత నెల 24న జరిగిన ఉప ఎన్నికల్లో ముంగావలిలో కాంగ్రెస్ అభ్యర్థి బ్రజేంద్ర సింగ్ యాదవ్ గెలుపొందారు. ఆయనపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బైసాహెబ్ యాదవ్ 2,124 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బ్రజేంద్రకు 70వేలకు పైగా ఓట్లు లభించాయి. కోలారస్ లో కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ యాదవ్ ఎనిమిది వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయంసాధించారు. ఆయనకు మొత్తం 82,515 ఓట్లు లభించడంతో బీజేపీ అభ్యర్థి దేవంద్ర జైన్ తన ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ముఖ్యమంత్రి చౌహాన్ చేయని ప్రయత్నం లేదు. అహర్నిశలూ శ్రమించారు. తనతో పాటు 17 మంది మంత్రులను మోహరించారు. సుమారు 1500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను చేపడతామని హామీ ఇచ్చారు. స్వయంగా చౌహాన్ ఏడు రోజులు ప్రచారం నిర్వహించారు. ఒక ముఖ్యమంత్రి ఉప ఎన్నికల కోసం వారం పాటు పర్యటించడం చాలా అరుదైన విషయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కోలారస్ నియోజకవర్గంలో 17 బహిరంగ సభల్లో ప్రసంగించారు. అనేక రోడ్ షోల్లో పాల్గొన్నారు. ముంగావలి నియోజకవర్గంలో కూడా ఇదే మాదిరిగా శ్రమించారు. సుమారు పాతిక బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 58 రోడ్ షో ల్లో పాల్గొన్నారు. ఇంత చేసినా ఓటర్లను మెప్పించలేకపోయారు.

అంతర్మధనం ప్రారంభం....

ఎన్నికల ఫలితాలతో కమలనాధుల్లో అంతర్మధనం ఆరంభమైంది. వచ్చే నవంబరు, డిసెంబర్ ల్లో అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఆరంభమైంది. ఉప ఎన్నికలు కాబట్టి మొత్తం పార్టీ యంత్రాంగాన్ని ఇక్కడే మొహరించారు. సాధారణ ఎన్నికల్లో ఇది సాధ్యపడదు. దీంతో పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలయింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 స్థానాలకు గాను కమలనాధులు 165 స్థానాలను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ కేవలం 58 స్థానాలకే పరిమితమైంది. బీఎస్పీ తదితర పార్టీలు మిగిలిన స్థానాలను గెలుచుకున్నాయి.

మెజారిటీ తగ్గినా....

కోలారస్, ముంగావలి స్తానాలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రాంతంలో ఉన్నాయి. సింధియా తండ్రి మాధవరావు సింధియా ప్రజలకు సుపరిచితుడు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఆయన కోటరీలోని సభ్యుడు. రేపటి ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనేనని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సింధియా ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఈ రెండు అసెంబ్లీ నియోజజకవర్గాలు ఉండటం విశేషం. సిట్టింగ్ స్థానాలు కావడం, తన నియోజకవర్గ పరిధిలోనివి కావడం, తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం, పార్టీ ముఖ్యమంత్రిగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సింధియా ఈ ఎన్నికలను వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ గెలిచినప్పటికీ ఆధిక్యాలు భారీగా తగ్గడం గమనార్హం. కోలారస్ లో గతంలో 20,765 ఓట్ల మెజారిటీ రాగా, ఇప్పుడు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు 2,124 మెజారిటీకే పరిమితమైంది. ముంగావలిలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇక్కడ గతంలో 24,952 ఓట్ల మెజారిటీ లభించగా, ఇప్పుడు 8,083కు తగ్గడం గమనార్హం. గత ఏడాది చిత్రకోట, అటేర్ ఉప ఎన్నికలు, జనవరిలో బద్వానీధర్ పురపాలక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్ంయలో తాజా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో కొండంత బలాన్ని నింపాయి. ఈ బలంలో అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాధులను మట్టి కరిపిస్తామనికాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News