కంచుకోటను కూల్చేస్తారా?

Update: 2018-02-15 17:30 GMT

ఎప్పుడూ అసెంబ్లీ ఎనికలను అవలీలగా ఎదుర్కొనే త్రిపుర సీపీఎం ఈ దఫా ఆపసోపాలు పడుతోంది. కాషాయదళం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో అలసి పోతోంది. ఎదురు దెబ్బ తీయడానికి, ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి వ్యూహాలు రచించలేక అల్లాడిపోతోంది. మొత్తం మీద పాతికేళ్ల పాలన అనుభవం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనడానికి ఎందుకూ పనికి రాకుండా పోతోంది. ఈ నెల 18న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించడానికి సీపీఎం జాతీయ నాయకత్వం పడరాని పాట్లు పడుతోంది. బీజేపీని నిలువరించేందుకు వామపక్ష కార్యకర్తలు, నాయకులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 60 స్థానాలుగల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న 20వ రాష్ట్రంగా పేర్కొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక శ్రద్థ చూపుతున్నారు. వాస్తవానికి త్రిపురలో సీపీఎం బలం నామమాత్రం. 2013 ఎన్నికల్లో సీపీఎం కేవలం 1.54 శాతం ఓటుబ్యాంకుకే పరిమితమైంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో అది 5.77 శాతానికి పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి అధికారికంగా పార్టీ తరుపున ఎన్నికైన ఎమ్మెల్యే ఒక్కరూ లేరు. ఉన్న ఐదారుగురూ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి వచ్చిన వారే కావడం గమనార్హం. అస్సోం, మణిపూర్ లలో బలం లేనప్పటికీ అక్కడ అధికారంలోకి వచ్చామని త్రిపురలో కూడా అదే తరహా విజయంసాధించగలమని బీజేపీ ధీమాగా ఉంది.

సీపీఎంను టార్గెట్ చేస్తే.....

బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ చిన్న రాష్ట్రం ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. మోడీ, అమిత్ షా తో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్, కేంద్రమంత్రులు రాజ్ నాధ్ సింగ్, నితిన్ గడ్కరీ లు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. పట్టుమని పాతిక లక్షల మంది ఓటర్లు కూడా లేని ఈ చిన్న రాష్ట్రంపై కాషాయదళం దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం ఇక్కడ సీపీఎం సర్కార్ ఉండటమే. ఇప్పటి వరకూ కాంగ్రెస్ ను ఓడిస్తూ వచ్చిన కాషాయదళం సిద్ధాంతపరంగా ఉప్పునిప్పులా ఉండే సీపీఎంను ఓడిస్తే జాతీయ స్థాయిలో తమకు ఎదురు ఉండదని అంచనా వేస్తోంది. ఇప్టపికీ పశ్చిమ బెంగాల్లో సుప్త చేతనావస్థలో ఉన్న సీపీఎంను త్రిపురలో కూడా ఓడిస్తే ఈశాన్య భారతంలో తమకు తిరుగు ఉండదన్నది బీజేపీ భావన. ఈశాన్య రాష్ట్రాల ఇన్ ఛార్జి రామ్ మాధవ్, పార్టీ రాష్ట్ర పరిశీలకుడు హిమంత్ బిశ్వ శర్మ క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. శర్మ పక్కనే ఉన్న అస్సోం ఆర్థిక మంత్రి. రాష్ట్రంలోని హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీ శర్మను ఏరికోరి ఎంపిక చేసింది.

ప్రభుత్వ వ్యతిరేకత....

సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టడం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పార్టీ అంచనా వేస్తోంది. సంప్రదాయంగా కార్మిక, కర్షక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల్లో సీపీఎంకు మంచిపట్టుంది. వారిలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. నిరుద్యోగం, పేదరికం, వెనకబాటుకు సీపీఎం సర్కార్ అనాలోచిత విధానాలే కారణమని ఊరూవాడా ప్రచారం చేస్తోంది. విద్యుత్తు కోతల కారణంగా పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి రావడం లేదని ప్రచారంచేస్తోంది. మరో పక్క ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో చొచ్చుకుపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న తమను రాష్ట్రంలో కూడా గెలిపిస్తే కేంద్రం నుంచి పెద్దయెత్తున లభించే నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రచారం చేస్తుంది. ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామని హామీ ఇచ్చింది.

గ్రామస్థాయిలో బలమైన.....

ప్రత్యేక రాష్ట్రంగా 1972లో ఆవిర్భవించిన త్రిపురలో సీపీఎం 1978 నుంచి వరుసగా గెలుస్తూవచ్చింది. మధ్యలో ఒక్క 1988-1993 మధ్య కాలంలో కాంగ్రెస్ సర్కార్ కొనసాగింది. నృపేన్ చక్రవర్తి, దశరథ్ దేవ్ వంటి సీపీఎం ముఖ్య నేతలు పార్టీకి బలమైన పునాదులు వేశారు. గ్రామగ్రామాన క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించారు. ఆ తర్వాత వచ్చిన మాణిక్ సర్కార్ కూడా అదే విధంగా పనిచేశారు. త్రిపుర జనాభాలో బెంగాలీలు ఎక్కువ. సంప్రదాయ బద్ధంగా వీరు సీపీఎంకు ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తున్నారు. గిరిజనుల్లో సీపీఎం పై కొంత వ్యతిరేకత ఉంది. వీరిని తమవైపు తిప్పుకునేందుకు కమలనాధులు కృషి చేస్తున్నారు.

బలమైన పోటీ ఇస్తుందా?

పట్టణ ప్రాంతాల్లో కన్నా పల్లెల్లో సీపీఎం బలం ఎక్కువ. బీజేపీ ఎంతగా ప్రచారంచేస్తున్నా తమ ఓటు బ్యాంకు చెక్కు చెదర లేదని సీపీఎం భావిస్తోంది. ముఖ్యంగా పల్లెల్లో తమ ఓటర్లు ఎలాంటి ప్రభావాలకు లోను కారని చెబుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి కాగలదన్న సర్వేల అంచనాలు సీపీఎంలో గుబులు రేకిత్తిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ గట్టి పోటీ ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవిస్తుందని, మళ్లీ వచ్చే ఎన్నికల వరకూ అధికారం కోసం ఆగకతప్పదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏది వాస్తవమో తేలాలంటే వచ్చే నెల 3వరకూ ఆగక తప్పదు.

Similar News