భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ లో ఆవిర్భవించినప్పుడు దానిపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. ఆశలు లేవు. అసలు దానిని ఒక పార్టీగా గుర్తించడానికి కూడా రాజకీయ విశ్లేషకులు ఇష్టపడలేదు. ఉత్తరాది పార్టీ అని, ఢిల్లీ పరిసర ప్రాంతాలకు పరిమితమైన పార్టీ అని, బనియా పార్టీ అని, వింధ్య గిరులకు ఆవలి పార్టీ అని వివిధ రకాల వ్యాఖ్యానాలు వినపడ్డాయి. పార్టీ ఆవిర్భావం అనంతరం 1984 డిసెంబరులో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలనే సాధించింది. ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హన్మకొండ, మరొకటి గుజరాత్ లో గెలిచింది. వాజ్ పేయి వంటి ఉద్దండులే మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నియోజకవర్గంలో ఓడిపోయారు. అలాంటి పార్టీ 1989లో అద్వానీ సారథ్యంలో అయోధ్య సమస్యతో 89 స్థానాలను గెలుచుకుంది. అప్పటి నుంచి ఎదురులేకుండా పోయింది.
అప్పటి నుంచే జైత్రయాత్ర.....
2014 లోక్ సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో అధికారం చేపట్టాక దాని జైత్రయాత్ర కొనసాగుతూ వస్తోంది. జమ్ముకాశ్మీర్ వంటి సరిహద్దు రాష్ట్రంలో కూడా అధికారంలో భాగాన్ని పంచుకుంది. తాజాగా జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎదురులేదని చాటుకుంది. త్రిపురలో సంపూర్ణ ఆధిక్యం, నాగాలాండ్ లో మిత్రపక్షాలతో కలసి మెజారిటీ సాధించడం, మేఘాలయలో తన మిత్రపక్షం మెజారిటీకి చేరువ కావడం కమలనాధులకు కొండంత సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఫలితంగా మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో ఆరు చోట్ల తన హవాను చాటుతోంది. 2014 వరకూ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి అసలు ఉనికే లేదు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేదు. లోక్ సభ స్థానాలు కూడా చెప్పుకోదగినన్ని రాలేదు. ఢిల్లీలో అధికారం చేపట్టాక ఈశాన్యంపై దృష్టి సారించింది. ముందుగా ఈశాన్య ప్రాంతానికి గుండెకాయ వంటి అస్సోంపై దృష్టి పెట్టింది. 2016లో జరిగిన ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. 2011లో జరిగిన ఈ రాష్ట్ర ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాలను సాధించిన బీజేపీ 2016లో 60కి పైగా స్థానాలను సాధించి అధికార పీఠాన్ని అందుకుంది. మూడు దఫాలుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ను మట్టి కరిపించింది. 126 స్థానాలు గల అసెంబ్లీలో 60కిపైగా స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా శర్వానంద్ సోనోవాల్ చక్రం తిప్పుతున్నారు.
మణిపూర్ లో ఇలా....
ఈ ఫలితాలతో ఇనుమడించిన ఉత్సాహంతో 2017లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించింది. మూడు దఫాలుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ కు చుక్కలు చూపించింది. వరుసగా పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఒక్రమ్ ఇబోబీసింగ్ ను గద్దె దింపింది. చైనా సరిహద్దుల్లో గల అరుణా చల్ ప్రదేశ్ లో కూడా కాషాయ జెండాను ఎగురవేసింది. వాస్తవానికి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ దానిని పడగొట్టింది. మొత్తం శాసనసభ్యులు బీజేపీలోకి ఫిరాయించారు. దీంతో కాంగ్రెస్ కు దిమ్మ తిరిగింది. ప్రస్తుతం ఖండూ నేతృత్వంలోని ప్రభుత్వం అక్కడ నడుస్తుంది. ఈ రాష్ట్రానికి చెందిన కిరణ్ రిజిజు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా చక్రం తిప్పుతున్నారు.
తాజా ఎన్నికల్లో....
అస్సోం, మణిపూర్ విజయాల నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగిన కమలనాధులు తాజాగా జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయపథాన కొనసాగారు. త్రిపురలో రెండున్నర దశాబ్దాలుగా పాలన సాగిస్తున్న తన సైద్ధాంతిక శత్రువు సీపీఎం సర్కార్ ను సాగనంపింది. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నీతి, నిజాయితీ, నైతికత కమలం పార్టీ ముందు ఎందుకూ కొరగాకుండా పోయాయి. మూడింట రెండువంతుల మెజారిటీతో అధికారాన్ని అందుకుంది. నాగాలాండ్ లో నేరుగా గెలవనప్పటికీ బీజేపీ, ఎన్.డి.పి.పి కూటమి 29 స్థానాల్లో ఏకైక అతిపెద్ద కూటమిగా అవతరించింది. ఇక్కడ ఈ కూటమి అధికారం చేపట్టడం అనివార్యం. మాజీ ముఖ్యమంత్రి నిఫియు రియో ఈ కూటమి సారథిగా ఉన్నారు.
మేఘాలయలో కూడా....
మేఘాలయలో బీజేపీకి పెద్దగా సీట్లు రానప్పటికీ తన మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ 19 స్థానాల్లో రెండో అతి పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ కు 21 స్థానాలు రాగా 17 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వారి సాయంతో నేషనల్ పీపుల్స్ ఫ‌్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. వాస్తవానికి ఎన్.పి.పి., బీజేపీ ముందు కలసి పోటీ చేద్దామనుకన్నప్పటికీ విభేదాలతో విడివిడిగా పోటీ చేశాయి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో ఎన్.పి.పి. భాగస్వామి కావడం గమనార్హం. మొత్ం ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క మిజోరాం తప్ప అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికారంలో భాగస్వామిగా ఉంది. తాజా విజయాల నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో మిజోరాం లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కమలనాధులు ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్