ఈ సంక్షోభం సమసిపోయేనా...?

Update: 2018-02-05 16:30 GMT

సమస్యాత్మక రాష్ట్రమైన నాగాలాండ్ ఎన్నికల బహిష్కరణ పిలుపులు కొత్తేమీ కాదు. ప్రతి ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీ, ఏదో ఒక వర్గం ఇలాంటి పిలుపులు ఇవ్వడం సహజమే. అయితే ఈసారి ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు కూడా ఈపిలుపు ఇవ్వడం విశేషం. పార్టీ జాతీయ నాయకత్వాలను సంప్రదించకుండా పిలుపు ఇవ్వడం, ఆ తర్వాత విరమించుకోవడం సహజం. ఈసారి కూడా అదే జరిగింది.

తొలుత బహిష్కరిస్తామని చెప్పి....

నాగాలాండ్ శాంతి ఒప్పందాన్ని అమలు చేసిన తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని గత నెల 30న 11 పార్టీలతో కూడిన అఖిలపక్ష కమిటీ ప్రకటించింది. ఇందులో అధికార పార్టీ అయిన నాగా పీపుల్స్ ఫ్రంట్, కాంగ్రెస్, బీజేపీలు కూడా ఉండటం విశేషం. సహజంగా జాతీయ పార్టీలు ఇలాంటివాటికి దూరంగా ఉంటాయి. కానీ ఎక్కడ ప్రజల మద్దతు, సానుభూతి, విశ్వాసం కోల్పోతామోనన్న భయంతో ఈ పార్టీల రాష్ట్ర నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. అనంతరం ఒక్కో పార్టీ బహిష్కరణ పిలుపును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాయి. ముందుగా బీజేపీ, తర్వాత కాంగ్రెస్ ప్రకటించగా, అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ కూడా అదే బాటలో నడిచింది. 60 స్థానాలుగల అసెంబ్లీ పదవీకాలం మార్చి 13తో ముగియనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ అక్కడ చురుగ్గా సాగుతోంది.

అసలు సమస్య ఏంటంటే....?

అసలు నాగా సమస్య ఏంటి? పరిష్కారాలు ఎలా? ప్రభుత్వ వైఫల్యాలే కారణమా? అనన ప్రశ్నలకు చరిత్రలోకి వెళ్లాల్సి ఉంటుంది. నాగా సమస్య ఈనాటిది కాదు. దానికి దశాబ్దాల చరిత్ర ఉంది. నాగాలాండ్ తో పాటు పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మణిపూర్, పొరుగుదేశమైన మయన్మార్ లో గల నాగాలతో గ్రేటర్ నాగాలాండ్ ఏర్పాటు చేయాలన్నది ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ సాధనకు నాగాల్లో అనేక వర్గాలు ఏర్పడ్డాయి. వీటిలో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఐఎం వర్గం), (కప్లాంగ్ వర్గం) ముఖ్యమైనవి. ఈ రెండు వర్గాల మధ్య కూడా సఖ్యత లేదు. ఏ ఒక్క వర్గంతో ప్రభుత్వాలు చర్చలు జరిపినా మరొక వర్గం అభ్యంతరం చెప్పేది. ఇక గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ ఆచరణరీత్యా అంత తేలిక కాదు. మయన్మార్ నుంచి నాగాలను ఇక్కడకు రప్పించడం ఎంత కష్టమో....పక్కనున్న మణిపూర్, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ ల్లోని నాగాలు అధికంగా ఉన్న ప్రాంతాలతో కలిపి గ్రేటర్ నాగాలాండ్ ను ఏర్పాటు చేయడం అంతే కష్టం. ఏ రాష్ట్రం కూడా తమ ప్రాంతాలను వదులుకునేందుకు సిద్ధంగా లేవు. ఈ విషయంలో ఎవరినీ ఒప్పించలేని పరిస్థితి కేంద్రానిది. అందువల్ల ఎప్పిటికప్పుడు తాత్కాలిక చర్యలతో అవి సరిపెట్టేవి. చర్చల పేరిట సాగదీసేవి. అవసరమైతే శాంతి భద్రతల పేరుతో అణచివేసేవి. ప్రస్తుత నాగాలాండ్ విస్తీర్ణం రమారమి 16527 చదరపు కిలోమీటర్లు. ఇతర రాష్ట్రాల్లోని నాగా ప్రాంతాలను కలుపుకుంటే అది సుమారు లక్షా ఇరవై వేల చదరపు కిలోమీటర్లు అవుతుంది.

ఎన్ని ఒప్పందాలు కుదిరినా....

నాగా సమస్యకు గతంలో అనేక ఒప్పందాలు కుదిరాయి. అయితే నాగా వర్గాలు, ప్రభుత్వాల మధ్య చిత్తశుద్ధిలేని కారణంగా ఏ ఒప్పందం పట్టాలకు ఎక్కలేదు. నెహ్రూ, ఇందిర, పీవీ హయాంలో అనేకమార్లు చర్చలు జరిగాయి. 1977 నుంచి ఎన్.ఎస్.సి.ఎన్ (ఐఎం వర్గం)తో కాల్పుల విరమణ ఒప్పందంకొనసాగుతున్నా కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ ప్రభుత్వం చొరవ తీసుకునిచర్చలు జరిపింది. 2015 ఆగస్టు 3నకేంద్రం, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఐఎం వర్గం) మధ్య ఢిల్లీలో జరిగిన చర్చలు ఫలించి శాంతి ఒప్పందం రూపుదాల్చుకుంది. ఒప్పందంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేస్తూ అప్పట్లో ‘‘ఇది సమస్యకు ముగింపు మాత్రమే కాదు... నూతన భవిష్యత్తుకు ఆరంభం’’ అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది చారిత్రాత్మకమైన ఒప్పందం అన్న వ్యాఖ్యానాలు అప్పట్లో వినవచ్చాయి. అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చగల శక్తి భారత రాజ్యాంగానికి ఉందంటూ ప్రభుత్వ వర్గాలు ఊదరగొట్టాయి. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఒప్పందంలోని అంశాలను కేంద్రం వెల్లడించలేదు. నాగా వర్గం కూడా ప్రకటించలేదు. కేంద్రం తరుపున చర్చల్లో మధ్యవర్తిగా క్రియాశీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారి ఆర్ఎస్. రవి ముసాయిదా ఒప్పంద రూపకల్పనలో నిమగ్నమయ్యారని, అది సిద్ధమయ్యాక ప్రకటిస్తామని మోడీ సర్కార్ చెబుతుంది. ఎన్నికల అనంతరం ఒప్పంద వివరాలు ప్రకటిస్తామని, ఈ లోపు రాజ్యాంగ బద్ధ ప్రక్రియ అయిన ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కేంద్ర హోంశాఖ కోరుతోంది.

అక్కడ ఉద్రిక్తతలు తప్పవు....

ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఒరిగిందేమీ లేదని ఇప్పుడూ ఎన్నికల అనంతరం కేంద్రం ఈ విషయాన్ని మర్చిపోతుందని నాగా వర్గాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం కూడా పారదర్శకంగా వ్యవహరించడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్య కనుక జాప్యం సహజమని, ఈ దశలో వివరాలు వెల్లడిస్తే కొత్త సమస్యలు ఏర్పడతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చర్చల పేరిట, ఒప్పందాల పేరుతో మోసగించాయని, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదేబాటలో నడుస్తుందని నాగా వర్గాలు ఆరోపిస్తున్నాయి. సమస్య తీవ్రమయ్యే కొద్దీ పొరుగున నాగా ప్రజలున్న మణిపూర్, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ లలో ఉద్రిక్తతలు ఏర్పడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. నాగా వర్గాలు కూడా సంయమనంతో వ్యవహరించి పరిష్కారాన్ని సాధించాలి. అంతేతప్ప ఎన్నికల బహిష్కరణలతో ఒరిగేదేమీ ఉండదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News