సాధారణంగా సూత్రధారుల కన్నా పాత్రధారులకే ప్రాధాన్యం, ప్రచారం లభిస్తాయి. పాత్రధారులు తెరపై కన్పిస్తారు కాబట్టి వారికి విశేష ఆదరణ లభిస్తుంది. కాని తెరవెనక పని చేసే సూత్రధారుల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. లోతుగా పరిశీలిస్తే తప్ప ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయం పరిస్థితి ఇలాంటిదే. పైకి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కనపడుతున్నప్పటికీ అసలు సూత్రధారులు నలుగురు ఉన్నారు. సునీల్ దేవధర్, హిమంత్ బిశ్వ శర్మ, కిరణ్ రిజిజు, రామ్ మాధవ్.... పార్టీ విజయానికి అహర్నిశలూ శ్రమించారు. అధికార పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేశారు. పటిష్టమైన వ్యూహరచనలు చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు, వారికి చేరువయ్యేందుకు నిరంరతం కృషి చేశారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేశారు. నాయకులను ముందుండి నడిపించారు. అంతర్గత లోపాలను సరిదిద్దుకున్నారు. అంతిమంగా పార్టీకి విజయాన్ని అందించారు.
బెంగాలీ నేర్చుకుని మరీ......
నలుగురు నాయకులు రకరకాల బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఈశాన్య రాష్ట్రాల ఇన్ ఛార్జి రామ్ మాధవ్, అరుణా చల్ ప్రదేశ్ కు చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, అసోం ఆర్థికమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, ఆర్ఎస్ఎస్ ముఖ్య ప్రచారక్ దేవధర్ ముఖ్య బాధ్యతలను నెరవేర్చారు. ముందుగా త్రిపుర బాధ్యతలను పార్టీ అధ్యక్షుడు అమిత్ షా లోక్ సభ ఎన్నికల అనంతరం దేవ్ ధర్ కు అప్పగించారు. ఆయనకు వ్యూహ నిపుణుడిగా మంచి పేరుంది. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ పోటీ చేసిన వారణాసిలో సమన్వయ కర్తగా దేవధర్ నియమితులయ్యారు. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించి పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. మహారాష్ట్రకు చెందిన సునీల్ దేవ్ ధర్ తెరవెనక వ్యూహాల్లో దిట్ట. 2013 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు పట్టున్న దాహార్ జిల్లా బాధ్యతలను మోడీ ఆయనకు అప్పగించారు. అక్కడ మంచి ఫలితాలనే రాబట్టారు ఆయన. అప్పటి నుంచి వెనుదిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నియోజకవర్గం పాల్ఘర్ బాధ్యతలు అప్పగించగా విజయవంతంగా నెరవేర్చారు. దీంతో గురికుదిరిన పార్టీ నాయకత్వం ఆయనను మూడేళ్ల క్రితమే త్రిపురకు పంపింది. 2013 ఎన్నికల్లో్ కేవలం 1.54 ఓట్లు సాధించిన పార్టీని విజయపథాన నడిపించేందుకు విరామం లేకుండా పనిచేశారు. సంప్రదాయ సీపీఎం వ్యతిరేకశక్తులను చేరదీశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ బలహీన పడటాన్ని గుర్తించి వాటి ఓటు బ్యాంకును బీజేపీ వైపు మళ్లించేందుకు కృషి చేశారు. సీపీఎంను సదా వ్యతిరేకించే ఇండీజీియన్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర తో పొత్తు కుదుర్చుకున్నారు. బెంగాలీ భాషను నేర్చుకుని ప్రజలతో మమేకమయ్యరు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. సీపీఎం సర్కారు లోపాలను సమదర్థంగా ఎండగట్టారు. అధికారంలోకి వస్తే బీజేపీ ఏం చేస్తుందో ప్రజలకు విడమరచి చెప్పారు. అంతిమంగా విజయం సాధించారు.
సంస్థాగత వ్యవహారాల్లో.....
యువనాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మంత్రాంగం కూడా ఈశాన్య రాష్ట్రాల విజయానికి ఉపకరించింది. ఈశాన్య రాష్ట్రాల పార్టీ సమన్వయకర్తగా చురుగ్గా పనిచేశారు. గతంలో జమ్మూ కాశ్మీర్ ఇన్ ఛార్జిగా పనిచేసి అక్కడ విజయం సాధించేందుకు తోడ్పడ్డారు. దీంతో పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రామ్ మాధవ్ సంస్థాగత వ్యవహారాల్లో నిపుణుడు. ఇంతకు ముందు అసోం, మణిపూర్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. రెండు దశాబ్దాల పాటు పార్టీ అనుబంధ పత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేసిన ఆయన మైసూరు విశ్వవిద్యాలయం లో ఎం.ఎ, ఎల్.ఎల్.బి. చదవివారు. ఏపీకన్నా జాతీయ వ్యవహారాలపైనే ఆయనకు ఆసక్తి ఎక్కువ.
లెక్కలేంలో తెలుసుకుని.....
త్రిపుర ఎన్నికల్లో మరో కీలక పాత్రధారి హిమంత్ బిశ్వ శర్మ.అసోం ఆర్థికమంత్రిగా ఉన్న శర్మను ఎన్నికల ప్రకటన వెలువడగానే త్రిపుర ఇన్ ఛార్జిగా పార్టీ నియమించింది. పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకుడైన శర్మకు ఈశాన్య రాష్ట్రాలపై మంచి పట్టుంది. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2016 అసో్ం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నాటి ఎన్నికల్లో జలుక్ బరి నుంచి పోటీ చేసి దాదాపు 89 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇంత మెజారిటీ బహుశీా ఎవరూ సాధించి ఉండరు. హిందూత్వ సిద్ధాంతాలను ఇష్టపడే శర్మ త్రిపురలో మెజారిటీ హిందువులను ఆకట్టుకోవడంలో సఫలమయ్యారు. పార్టీ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడలో విజయవంతమయ్యారు.
ఈశాన్య వాణిగా.....
బీజేపీ గెలుపులో మరో కీలక సూత్రధారి కిరణ్ రిజిజు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి లోక్ సభకు ఎన్నికైన రిజిజుకు మొత్తం ఈశాన్య రాష్ట్రాల బీజేపీ వాణిగా పేరుంది. ఈ ప్రాంతంలో పార్టీకి కళ్లు, చెవులుగా పనిచేస్తున్నారు. అదే సమయంలో ఈశాన్య భారత వాణిని ఢిల్లీలో వినిపిస్తారు. క్రైస్తవుడైన కిరణ్ రిజిజు బీజేపీకి ఆ వర్గ ఓటర్లను చేరువ చేయడంలో కృతకృత్యులయ్యారు. మేఘాలయ, నాగాలాండ్ లో క్రైస్తవులు అధికం కావడంతో పార్టీ ఆయనపై ఎక్కువగా ఆధారపడుతోంది. తెరవెనక సూత్రధారుల గురించి ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. అయితే పార్టీకి బాగా తెలుసు. ఇతర ఎన్నికల్లో వారి సేవలను వినియోగించుకునే అవకాశం కూడా ఉంది.
-ఎడిటోరియల్ డెస్క్