ఇక్కడ మాత్రం మోడీ పప్పులేమీ ఉడకవ్...!

Update: 2018-01-01 16:30 GMT

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. మిత్రుల మద్దతు లేకుండానే లోక్ సభలో స్పష్టమైన మెజారిటీని సాధించిన బీజేపీ రాజ్యసభ దగ్గరకు వచ్చేసరికి సరికొత్త సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. పేరుకు 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని చెప్పుకుంటున్నప్పటికీ అత్యంత కీలకమైన పెద్దల సభలో బలం లేక ఆపసోపాలు పడుతోంది. బిల్లులను నెగ్గించుకునేందుకు మిత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నప్పటికీ ఈ పరిస్థితి కొనసాగుతుండటం విశేషం. ఒక్కసారి గణాంకాలను పరిశీలిస్తే భవిష్యత్తులో కూడా బీజేపీ ఎగువ సభలో మెజారిటీ సాధించే అవకాశాలు కన్పించడం లేదు. అయితే గియితే2019 సార్వత్రిక ఎణ్నికల అనంతరమే కమలం పార్టీ సొంతకాళ్లపై నిలబడగలదు. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఒరిగేదేమీ ఉండదు. 2018 ఏప్రిల్ నెలలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల అనంతరం కూడా కమలనాధుల బలాబలాల్లో పెద్ద తేడా ఉండదని గణాంకాలు ఘోషిస్తున్నాయి.

61 మంది పదవీ విరమణ చేస్తున్నా....

జనవరి నుంచి ఏప్రిల్ లోగా సుమారు 61 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారని అంచనా. ఇందులో గుజరాత్ కు చెందిన నలుగురు ఉన్నారు. వారిలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఉన్నారు. జైట్లీ రాజ్యసభ నాయకుడు. ప్రజాబలం లేని జైట్లీ 2014 ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. అప్పటి కాంగ్రెస్ నేత, ఇప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే గుజరాత్ రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో బీజేపీ రెండే గెలుచుకునే అవకాశం ఉంది. గతంలో కన్నా ఎమ్మెల్యేల సంఖ్య తగ్గడమే ఇందుకు కారణం. ఇక గతంలో ఒక్క స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 77 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం ద్వారా ఇద్దరిని ఎగువ సభకు పంపే అవకాశం ఏర్పడింది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లాలంటే కనసీం 36 మంది శాసనసభ్యుల మద్దతు అవసరమని అంచనా. ఈలెక్కన బీజేపీ, కాంగ్రెస్ లు చెరో రెండు స్థానాలను పొందగలుగుతాయి. ఇక హిమాచల్ నుంచి కమలం పార్టీకి చెందిన ఒక ఎంపీ పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానం మళ్లీ బీజేపీ కే దక్కుతుంది. పర్వత రాష్ట్రంలో విజయం ద్వారా బీజీపీకి అదనంగా కలిసొచ్చింది లేదు.

ఇక్కడ కూడా బలం లేదు....

ఢిల్లీలో పార్టీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున అక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి ఆప్ ముగ్గురిని పెద్దల సభకు పంపే అవకాశం ఉంది. యూపీ నుంచి మాత్రం బీజేపీ భారీగా లబ్ది పొందనుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం నుంచి పది స్థానాలకు ఎన్నికలు జరగనుండగా కనీసం 8 స్థానాలు కమలం ఖాతాలో పడే అవకాశం స్పష్టంగా ఉంది. ప్రస్తుతం యూపీ నుంచి ఆ పార్టీకి చెందిన ఇద్దరే పదవీ విరమణ చేయనున్నారు. అదనంగా ఆరుసీట్లు రాజ్యసభలో బీజేపీ బలం పెరగనుంది. మహారాష్ట్రలో ఆరు, మధ్యప్రదేశ్ లో ఐదు, రాజస్థాన్ లో మూడు స్థానాలు సహా ఇతర రాష్ట్రాల్లో 45 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఎన్డీఏ కూటమికి పదికి మించి స్థానాలు వచ్చే అవకాశం లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు (చిరంజీవి, రాపోలు ఆనందభాస్కర్, దేవేందర్ గౌడ్, సీఎం రమేష్, రేణుకాచౌదరి) పదవీ విరమణ చేయనున్నారు. ఇక్కడ బీజేపీకి చోటు లేదు. రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణ నుంచి వచ్చే రెండు సీట్లు టీఆర్ఎస్ పరమవుతాయి. ఏపీ నుంచి ఖాళీ అయ్యే మూడింటిలో రెండు తెలుగుదేశానికి, ఒకటి వైసీపీకి దక్కనున్నాయి. బీజేపీకి ఇక్కడ అవకాశమే లేదు.

విపక్షంపై ఆధారపడాల్సిందే....

245 స్థానాలు గల పెద్దల సభలో ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ కు చెరి సమానం 57 సీట్లు కలిగి ఉన్నాయి. వీటి తర్వాత 18 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ, 12 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, 8 స్థానాలతో బిజూ జనతాదళ్ పెద్ద పార్టీలుగా ఉన్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి 12, తెలంగాణకు 7 స్థానాలు దక్కాయి. సభలో కనీస మెజారిటీకీ 123 స్థానాలు అవసరం. ఎన్నికల అనంతరం కూడా ఏన్డీఏ కూటమి బలం 97కి మించి పెరిగే అవకాశం లేదు. ఫలితంగా బిల్లులను ఆమోదించుకునేందుకు మిత్రులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. మహారాష్ట్రలో శివసేన, పంజాబ్ లో అకాళీదళ్ త, ఏపీలో టీడీపీతో అంతర్గత విభేదాల కారణంగా గతంలో మాదిరిగా వారితో మనసువిప్పి మాట్లాడే పరిస్థితి లేదు. మూడొంతుల మెజారిటీ అవసరమయ్యే కీలక బిల్లుల విషయంలో విపక్ష కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. గతంలో జీఎస్టీ విషయంలో కమలం పార్టీని కాంగ్రెస్ ముప్పుతిప్పలు పెట్టిన విషయం గమనార్హం. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా గులాంనబీ ఆజాద్ తన అనుభవం, చాకచక్యంతో సర్కార్ ను తరచూ ఇరుకున పెడుతున్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా ఎల్లుండి రాజ్యసభకు ముందు రానుంది. మొత్తం మీద కమలనాధులు పెద్దల సభలో బలం పెంచుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News