ఫూల్ పూర్... ఇటీవల ఉప ఎన్నిక జరిగిన ఉత్తరప్రదేశ్ లోని ఈ లోక్ సభ నియోజకవర్గం గురించి ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని ఇది అత్యంత కీలకమైన స్థానం. అనేకమంది ప్రముఖులు ఇక్కడి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అలహాబాద్ జిల్లాలోనిఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట వంటిది. కాని ఇదంతా ఇప్పుడు చరిత్ర. ప్రస్తుతం నియోజకవర్గంలో హస్తం పార్టీ ఆనవాళ్లు కూడా కనపడటం లేదు. చిక్కి శల్యమైన పార్టీ ఇక్కడ సుప్త చేతనావస్థలో ఉంది. సమీప భవిష్యత్తులో కూడా కోలుకునే అవకాశం కనపడటం లేదు.
నెహ్రూ నుంచే పట్టున్న ప్రాంతంగా....
ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఫూల్ పూర్ నియోజకవర్గ ప్రాధాన్యం కళ్లకు కనపడుతుంది. ప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఇక్కడి నుంచి మూడు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. మరణానంతరం సోదరి విజయలక్ష్మి పండిట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం కమలా బహుగుణ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన హెచ్.ఎన్. బహుగుణ భార్య ఈమె. నేషనల్ ఫ్రంట్ హయాంలో ప్రధానిగా పనిచేసిన విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ కూడా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం విశేషం. అలాంటి కంచుకోటలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కనీసం ధరావత్తు కూడా సాధించలేకపోయింది. పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మనీశ్ మిశ్రా కేవలం 2.64 శాతం ఓట్లు, 19,334 ఓట్లతో సంతృప్తి పడాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి శర్మకన్నా స్వతంత్ర అభ్యర్థి అతీఖ్ అహ్మద్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అహ్మద్ కు 48,087 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మిశ్రాకు 19,334 ఓట్లు వచ్చాయంటే పార్టీ ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కనుచూపు మేరలో పార్టీ కోలుకునే పరిస్థితి కనపడటం లేదు.
ఎస్పీకి మద్దతివ్వకుండా....
1971లొ విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ అనంతరం 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం వీచిన సానుభూతి పవనాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్ పూజన్ పటేల్ విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ క్రమంగా క్షీణించడమే తప్ప కోలుకున్న దాఖలాల్లేవు. ఫూల్ పూర్ సమీపంలోని అలహాబాద్ నెహ్రూ స్వస్థలం కావడం గమనార్హం. వాస్తవానికి ఫూల్ పూర్ పై పార్టీకి పెద్దగా ఆశలు లేవు. అయినప్పటికీ మొండి పట్టుదలకు పోయి అభాసుపాలైంది. మాయవతి నేపథ్యంలోని బీఎస్పీ మాదిరిగా తమకు మద్దతివ్వాలని సమాజ్ వాదీ పార్టీ కోరగా నిరాకరించింది. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసే పోటీచేశాయి. అయినప్పటికీ అంగీకారం కుదరలేదు. అసెంబ్లీ ఎన్నికలోల 107 స్థానాల్లో హస్తం పార్టీ పోటీచేయగా, చావుతప్పి కన్ను లొట్ట పోయినట్లు కేవలం ఏడు స్థానాల్లోనే గొలుపొందడం గమనార్హం. ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో తన బలం ఏమిటో తెలిసినా కాంగ్రెస్ నాయకత్వం అనవసరంగా ఫూల్ పూర్ లో పోటీచేసి అప్రతిష్ట పాలైంది. ఉన్న కొద్ది పాటి గౌరవాన్ని కూడా కోల్పోయి నిస్సహాయంగా నిలిచింది.
విజయాలకు ఫుల్ స్టాప్.....
అలహాబాద్ పశ్చిమ, అలహాబాద్ ఉత్తర, ఫూల్ పూర్, సొరన్, ఫఫహమ్ స్థానాలు ఫూల్ పూర్ లోక్ సభ నియోజకవర్గంలో భాగం. స్వాతంత్ర్యం అనంతరం తొలిసారి 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి 61,887 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. రెండో దఫా 1957లో అదే స్థానం నుంచి 29,018 ఓట్ల మెజారిటీతో పార్లమెంటుకు వెళ్లారు. 1962లో మూడో దఫా 64,577 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థి రామ్ మనోహర్ లోహియాను పండిట్ జీ ఓడింంచారు. నెహ్రూ మరణంతో 1964లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరి విజయలక్ష్మి పండిట్ ఎన్నికయ్యారు. మళ్లీ 1969లో కూడా విజయం సాధించారు. అనంతరం 1971లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విపి సింగ్ గెలుపొందారు. కాంగ్రెస్ గెలుపునకు అంతటితో పుల్ స్టాప్ పడింది. మళ్లీ 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం వీచిన సానుభూతి పవనాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్ పుజన్ పటేల్ విజయం సాధించారు. మళ్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్ ప్రభావం రోజురోజుకూ కొడిగట్టడమే తప్ప కోలుకునే అవకాశమే కనపడటం లేదు. ఓడలు బండ్లవుతాయి... బండ్లు ఓడలవుతాయన్న సామెతకు ఫూల్ పూర్ నియోజకవర్గంలోని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిస్థితే పెద్ద నిదర్శనమని చెప్పక తప్పదు.
-ఎడిటోరియల్ డెస్క్