క్రమేపీ పూర్తికాలపు రాజకీయవేత్తగా రూపుదాల్చే ప్రయత్నాల్లో పడ్డారు జనసేనాధిపతి పవన్ కల్యాణ్. అప్పుడప్పుడు వివిధ సమస్యలపై బాధితులను పరామర్శించడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం, ట్విట్టర్ లో స్పందించడం ద్వారా గడచిన మూడు సంవత్సరాలుగా పార్టుటైమ్ పాలిటిక్స్ నడుపుతున్న పవన్ తాను సైతం అంటున్నారు. ఒక ప్రధాన పార్టీగా 2019 ఎన్నికలకు జనసేనను సిద్ధం చేస్తున్నారు. విశాఖ, గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మూడు రోజుల పర్యటనను ఇందుకు నాందిగా చెప్పవచ్చు. చాలాకాలంగా ప్రజల్లో జనసేనకు ఎదురవుతున్న అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై స్పందిస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలైన టీడీపీ, బీజేపీ, వై.సి.పిల విషయంలో జనసేన ఆలోచన, అవగాహనను కూడా ప్రకటించేందుకు పూనుకుంటున్నారు. ఏతావాతా సాధ్యమైనంతవరకూ జనసేన స్వతంత్రంగా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కొంత సందిగ్ధత మాత్రం ఇంకా మిగిలే ఉంది. వై.సి.పి, బీజేపీలతో జనసేన కలిసి నడిచే అవకాశాలు లేవన్నది పవన్ మాటల్లో పక్కా గా తేలిపోయింది. టీడీపీ విషయంలో కొంత తర్జనభర్జన, సందిగ్ధత ఉంది. అయితే విమర్శల విషయంలో అటు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలను రెంటినీ విడిచిపెట్టకూడదని జనసేన నిర్ణయించుకుంది. పక్కా పొలిటికల్ స్టాండ్ ఇది.
ఆపద్బాంధవుడా...?
పవన్ శైలి వ్యక్తిగతంగా తెలిసిన వారెవరూ ఆయన నిజాయతీని, చిత్తశుద్ధిని శంకించరు. కానీ యాదృచ్ఛికమో, లేదా ఒక పార్టీగా స్పందించాల్సిన తరుణమని భావించడమో తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందుల్లో పడిన సందర్భాల్లో పవన్ రంగ ప్రవేశం చేయడం, అది కొంతమేరకు టీడీపీకి అనుకూలించే అంశంగా మారడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా పోలవరం నిర్మాణ విషయంలో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి ఈ ప్రాజెక్టు నిలిచిపోతుందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పోలవరం సందర్శించడం తెలుగుదేశానికి అనుకూలించే సంకేతమంటున్నారు పరిశీలకులు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల వ్యయానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్ మినహాయిస్తే మిగిలిన విషయాల్లో రాష్ట్రప్రభుత్వ వైఖరికే మద్దతు పలికారు పవన్. పోలవరం జాప్యానికి కేంద్రందే బాధ్యత అన్నట్లుగా, ఈ బాధ్యతను భుజానకెత్తుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సేఫ్ జోన్ లోకి పంపించేశారు . చంద్రబాబు నాయుడు పని చేస్తారని నమ్మాను, ఇప్పటికీ నమ్ముతున్నాను అంటూ పవన్ చేసిన వ్యాఖ్య రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ, జనసేన మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయనడానికి ఇది అద్దం పడుతోంది. గోదావరి జిల్లాల యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్ మద్దతు వివాదాస్పదమవుతున్న పోలవరం విషయంలో టీడీపీని ఒకింత ఒడ్డున పడేసినట్లే. వై.సి.పి., కాంగ్రెసు,బీజేపీలో ని ఒక వర్గం కూడా పోలవరం ప్రాజెక్టు నెపంతో చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తుంటే జనసేన అందుకు విరుద్ధమైన వైఖరితోనే కనిపిస్తోంది.
తమలపాకు...తాడి మట్ట
నేను ఏ రాజకీయ పక్షానికీ అనుకూలం కాదు. అందరూ నాకు సమానమే అంటూ పవన్ చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితికి కూడా పొంతన కుదరడం లేదనే విమర్శ ఎదురవుతోంది. బీజేపీ, వై.సి.పి. ల విషయంలో తీవ్రమైన, ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కల్యాణ్ తెలుగుదేశం విషయంలో సున్నితంగా, సుతిమెత్తని ఆరోపణలు మాత్రమే ఎక్కుపెడుతున్నారు. తండ్రి ముఖ్యమంత్రైతే కొడుకు కావాలనుకోవడం తప్పని జగన్ ను నిలదీసిన నోటితోనే లోకేశ్ సామర్థ్యం చంద్రబాబుకు తెలుసుంటుంది? అంటూ దాటవేత ధోరణిని ప్రదర్శించారు. తమలపాకుతో కొట్టినట్లు మొక్కుబడిగా టీడీపీని విమర్శిస్తూ, తాడిమట్టతో చాచిపెట్టి కొట్టినట్లుగా వై.సి.పి, బీజేపీలపై పవన్ విరుచుకుపడుతున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడి షెల్ నుంచి పవన్ బయటికి రావాలంటూ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఈ విషయంలో అతికినట్లు సరిపోతోంది.
ప్రతీకారం... పాలిటిక్స్ నైజం కాదు..
రాజకీయాల్లో శాశ్వతమిత్రులు , శాశ్వత శత్రువులు ఉండరు. ఈ రోజు కలిసి పోటీచేసిన వారే రేపు ప్రత్యర్థిగా మారతారు. అందుకే యుద్ధమూ, రాజకీయమూ రెంటిలోనూ కాలానుగుణమైన, పరిస్థితుల ప్రభావంతోనే నిర్ణయాలు సాగిపోతుంటాయి. ప్రజారాజ్యానికి, చిరంజీవికి ద్రోహం చేసిన వాళ్లను విడిచిపెట్టనంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అపరిపక్వమని సీనియర్ రాజకీయ వేత్తలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా పోటీచేసి గెలిచిన చిరంజీవి అదే పార్టీలో తన ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలిపిన పవన్ ఈరోజున ఆ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రేపొద్దున్న కలవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. అందువల్ల పాలిటిక్స్ లో ప్రజలిచ్చే తీర్పే జడ్జిమెంట్. పార్టీలు, వ్యక్తులపై ప్రతీకార ప్రకటనలు పరిణతి లేమికి నిదర్శనంగా భావించాలి. సందర్భాన్ని బట్టి ఎవరొచ్చినా కలుపుకుని పోవాలి. అంతేకాదు ఈరోజు బంటు రేపు రాజుగా మారిపోతాడు. వీటన్నిటినీ జీర్ణించుకోవడం రాజకీయాల్లో తప్పదు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలు, వైఖరులు , జనసేన సిద్ధాంతాలు, వారసత్వ రాజకీయాలు, దేశరాజకీయ ముఖ చిత్రాల గురించి తన పార్టీ నేతలతో ఆవేశంగా ప్రసంగించారు పవన్ . కానీ వ్యూహం, ఆలోచన కొరవడింది. అన్ని ప్రశ్నలకూ ఒకేసారి సమాధానం చెప్పేయాలనుకోవడం సరికాదు. ప్రజలతో సమావేశం జరుపుతున్నప్పుడు ఒక్కోజిల్లాలో, లేదా ఒక్కో సందర్భంలో ఒక ప్రత్యేక విషయాన్ని బయటపెడుతూ ఉండాలి. అందువల్ల జనసేన నిత్యం ప్రజల్లో నలుగుతూ చర్చకు దారితీస్తుంది. ఆలోచింప చేస్తుంది. నాలుగైదు రోజులపాటు హెడ్ లైన్స్ కావాల్సిన భిన్నమైన సబ్జెక్టులను ఒక్కసారిగా కక్కేశారు. ప్రస్తుత ఎలక్టోరల్ పాలిటిక్స్ పై జనసేనలో ఇంకా స్పష్టత కొరవడింది. అంశాలపై అవగాహన పెంచుకునే విషయంలో పవన్ పట్టుసాధిస్తున్నట్లుగా తాజా పర్యటనల్లోని వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి. కానీ కార్యాచరణ కు సంబంధించి క్లారిటీ లోపించింది. భవిష్యత్తులో ఈ లోపం కూడా తీర్చుకోగలిగితే నూతన రాజకీయాలకు జనసేన మంచి వేదికగా రూపుదాల్చగలుగుతుంది.
-ఎడిటోరియల్ డెస్క్