ఆ ముగ్గురు టీడీపీ సిట్టింగ్ ఎంపీల‌కు టిక్కెట్లు క‌ట్‌...!

Update: 2017-12-13 11:30 GMT

ఏపీలో 13 జిల్లాల్లో పెద్ద జిల్లా తూర్పుగోదావ‌రి. ఈ జిల్లాలో మిగిలిన జిల్లాల కంటే ఎక్కువుగా 19 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తూర్పులో రాజ‌మండ్రి, కాకినాడ‌, అమ‌లాపురం ఎంపీ సీట్లు కూడా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యే సీట్లతో పాటు మూడు ఎంపీ సీట్లు టీడీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. రాజ‌మండ్రి, అమ‌లాపురం సీట్లను భారీ మెజార్టీతో గెలుచుకున్న టీడీపీ, కాకినాడ ఎంపీ సీటును మాత్రం 3 వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుచుకుంది. రాజ‌మండ్రి నుంచి 2009లో ఓడిపోయిన ప్రముఖ సినీన‌టుడు మాగంటి ముర‌ళీమోహ‌న్ విజ‌యం సాధిస్తే, కాకినాడ నుంచి గ‌తంలో మంత్రిగా ఉన్న తోట న‌ర‌సింహం టీడీపీలోకి జంప్ చేసి, ఎంపీగా విజ‌యం సాధించారు. ఇక అమ‌లాపురం నుంచి కేంద్ర స‌ర్వీసుల మాజీ అధికారి ర‌వీంద్రబాబు గెలిచారు. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్రబాబు జిల్లాలో చాలా మార్పుల‌తో పాటు ఎన్నిక‌ల వేళ టిక్కెట్ల కేటాయింపులో భారీ ప్రక్షాళ‌న చేయ‌డంతో పాటు సిట్టింగుల్లో చాలా మందికి షాకులు ఇవ్వనున్నారు. జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీల‌ను బాబు ప‌క్కన పెట్టేసి,వారి ప్లేసులో కొత్త వారికి టిక్కెట్లు ఇవ్వనున్నార‌ని తెలుస్తోంది.

రాజ‌మండ్రి: వ‌యోః భారంతో ముర‌ళీమోహ‌న్ అవుట్ :

తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో విస్తరించి ఉన్న రాజ‌మండ్రి లోక్‌స‌భ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగంటి ముర‌ళీమోహ‌న్‌ను బాబు వ‌యోః భారంతో ప‌క్కన పెట్టేస్తార‌న్న ప్రచారం జోరుగా జ‌రుగుతోంది. సీనియారిటీతో పాటు గ‌తంలోలా చురుగ్గా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించ‌లేక‌పోవ‌డం, శ‌స్త్రచికిత్స త‌ర్వాత ప్రజ‌ల్లోకి వెళ్లలేక‌పోవ‌డం లాంటి కార‌ణాలు ఆయ‌న‌కు మైన‌స్‌గా మారాయి. ముర‌ళీమోహ‌న్‌ను త‌ప్పిస్తే ఆ ప్లేస్‌లో ఆయ‌న కోడ‌లు రూపాదేవి మాగంటి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆమె ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు సుప‌రిచితురాలు. టీడీపీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. రూపాదేవితో పాటు మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీఎస్ఆర్ క‌న్‌స్ట్రక్షన్స్ అధినేత బ‌లుసు శ్రీనివాస‌రావుతో పాటు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం అన్నదేవ‌ర‌పేట‌కు చెందిన అవంతి ఫీడ్స్ అధినేత అల్లూరి ఇంద్రకుమార్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. మ‌హిళా కోటాలో రేసులో ఉన్న ముర‌ళీమోహ‌న్ కోడ‌లికి లోకేష్ అండ‌దండ‌లు పుష్కలంగా ఉన్నాయి. ఆమెకు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు అయినా ఇస్తాన‌ని లోకేష్ నుంచి బ‌ల‌మైన హామీ ఉన్నట్టు తెలుస్తోంది.

కాకినాడ‌: మ‌ంత్రి ప‌ద‌వి కోసం అసెంబ్లీ వైపే తోట చూపులు :

ఇక సీనియ‌ర్ పొలిటిషీయ‌న్‌, రాష్ట్ర రాజ‌కీయాల్లో ప‌దేళ్ల పాటు ఉండ‌డంతో పాటు మంత్రిగా కూడా ప‌నిచేసిన తోట న‌ర‌సింహం గత ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీలోకి జంప్ చేసి కాకినాడ ఎంపీగా పోటీ చేసి చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్‌పై కేవ‌లం 3 వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. మంత్రిగా స్టేట్‌లో చ‌క్రం తిప్పిన తోట ఎంపీగా ఈ మూడున్నరేళ్ల‌లో డ‌మ్మీగా ఉండడం త‌ప్ప చేసిందేమీ లేదు. ఎంపీగా ఉండేందుకు ఇష్టప‌డ‌ని ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అవ్వాల‌న్న ప్లాన్‌తో ఉన్నారు. ఇక చంద్ర‌బాబు కూడా న‌ర‌సింహాన్ని త‌ప్పిస్తార‌ని వార్తలు వ‌స్తున్నాయి. కాకినాడ ఎంపీగా గ‌త రెండు ఎన్నిక‌ల్లోను పోటీ చేసి ఓడిపోతోన్న చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్‌ను టీడీపీలోకి తీసుకువ‌చ్చే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాకినాడ ఎంపీ సీటుకు టీడీపీ రేసులో సునీల్ పేరుతో పాటు ప్రస్తుతం జ‌గ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల నెహ్రూ పేరు కూడా వినిపిస్తోంది. నెహ్రూ త‌న త‌న‌యుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించి, తాను ఎంపీగా పోటీ చేసి త‌న ఫ్యామిలీలోనే రెండు సీట్లు ఉండే ప్లాన్ చేసుకుంటున్నారు.

అమ‌లాపురం: ర‌వీంద్రబాబుకు కాంట్రవ‌ర్సీలే మైన‌స్ :

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కేంద్ర స‌ర్వీసుల అధికారిగా ఉన్న పి.ర‌వీంద్రబాబు చివ‌రి క్షణంలో కొంత‌మంది పారిశ్రామిక‌వేత్తల రిక‌మెండేష‌న్‌తో ఎంపీ సీటు ద‌క్కించుకుని గెలిచారు. అధికారిగా ఉన్న ఆయ‌న‌కు రాజ‌కీయాలు కొత్త కావ‌డంతో స్థానిక పార్టీ నేత‌ల‌తో పాటు ఎమ్మెల్యేల‌తో అంత స‌ఖ్యత ఏర్పరుచుకోలేక‌పోయారు. రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న రాణించ‌లేక‌పోయార‌న్నది నిజం. దీనికి తోడు వ‌రుస‌గా కాంట్రవ‌ర్సీ వ్యాఖ్యలు చేయ‌డంతో చంద్రబాబుకు, పార్టీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారారు. బాబు ఆయ‌న వ్యాఖ్యల‌పై రెండు మూడు సార్లు వార్నింగ్‌లు ఇచ్చే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత రాజోలు ఎమ్మెల్యే గొల్లప‌ల్లి సూర్యారావు పేరు వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లోనే ఎంపీగా పోటీ చేయాల‌నుకున్న సూర్యారావు చివ‌ర్లో రాజోలుకు వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న ఎంపీగా పోటీ చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. దీనికి తోడు ర‌వీంద్రబాబును త‌ప్పించేయ‌డం కూడా ఆయ‌న‌కు క‌లిసి రానుంది. ఏదేమైనా జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీల‌ను మారుస్తార‌న్న వార్తలు టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.

Similar News