వచ్చే నెల 11న జరగనున్న మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలు అధికార భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్ష కానున్నాయి. యూపీలోని గొరఖ్ పూర్, ఫూల్ పూర్, బీహార్ లోని అరారియా లోక్ సభ స్థానాలకు, ఇదే రాష్ట్రంలోని జెహనాబాద్, బాభువా శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకు ముందు పంజాబ్లోని గురుదాస్ పూర్, గత నెల 29న రాజస్థాన్ లోని అజ్మీర్, అల్వారా లోక్ సభ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ ఈ దఫా పకడ్బందీ వ్యూహరచనతో ముందుకెళుతుంది. విపక్షాలు కూడా ఈ ఎన్నికలను సీరియస్ గానే తీసుకుంటున్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నిలపాలన్న యోచన చేస్తున్నాయి.
బీజీపీ అతిసులువుగా.....
యోగీ ఆదిత్యనాధ్ యూపీ ముఖ్యమంత్రిగా ఎన్నిక అవ్వడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తూర్పు యూపీలో నేపాల్ కు సరిహద్దున విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట వంటిది. వరుసగా ఐదుసార్లు ఇక్కడి నుంచి ఆదిత్యానాధ్ ఎన్నికవుతున్నారు. 14, 32, 002 మంది ఓటర్లున్న ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆదిత్యానాధ్ కు 1,42,309 ఓట్ల ఆధిక్యత లభించింది. ఈ నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ స్థానాలను గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి రాజ్ మతి నిషాద్ ద్వితీయ స్థానంలో నిలిచారు. రేపటి ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం అయినప్పటికీ మెజారిటీ ఎంతన్నదే ముఖ్యం.
ఇది చారిత్రక నియోజకవర్గం.....
ఉప ఎన్నిక జరగనున్న ఫూల్ పూర్ కు చారిత్రక ప్రాధాన్యం ఉంది. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ గతంలో ఇక్కడి నుంచి గెలిచారు. 1952, 57, 62ల్లో వరుసగా మూడుసార్లు నెహ్రూ ఇక్కడి నుంచి విజయం సాధించారు. విపీసింగ్ 1971లో ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. 2014లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి 5,03,564 ఓట్లు సాధించారు. సమాజ్ వాదీ పార్టీ 1,95,256 ఓట్లతోనే సరిపెట్టుకంుది.2009లో కూడా ఇక్కడ బీజేపీ విజయం సాధించడం గమనార్హం. బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి ఇక్కడ కొంత పట్టుంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పార్టీ అధినేత్రి మయావతి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో బీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరామ్ ఇక్కడ పోటీ చేశారు. 2014లో ఇక్కడ విజయం సాధించిన కేశవప్రసాద్ మౌర్య యూపీ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడంతో ఎన్నిక అనివార్యమైంది.
ఇక్కడ నువ్వా...? నేనా?
ఉపఎన్నిక జరగనున్న మూడోస్థానం బీహార్ లోని అరారియా. 2014లో ఇక్కడి నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్ విజయం సాధించింది. ఆర్జేడీ అభ్యర్థికి 4,07,978 ఓట్లు రాగా, సమీప బీజేపీ అభ్యర్థికి 2,61,474 ఓట్లు వచ్చాయి. అప్పట్లో ఆర్జేడీ నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యు ఉమ్మడిగా పోటీ చేశాయి. ప్రస్తుతం నితీష్ బీజేపీతో కలిసి నడుస్తున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ పశుదాణా కుంభకోణంకేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. సానుభూతి పవనాలతో గెలుపొందాలని ఆర్జేడీ ఆశిస్తోంది. తద్వారా ప్రజల్లో తమకు పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని భావిస్తోంది. ఇక్కడ గెలవడం ద్వారా తమ కూటమికి ఎదురులేదని చాటాలని నితీష్, నరేంద్రమోడీ ద్వయం వ్యూహరచన చేస్తోంది. 2014లో ఇక్కడి నుంచి ఎన్నికైన ఆర్జేడీ అభ్యర్థి మహ్మద్ తస్లిముద్దీన్ గత ఏడాది సెప్టంబరులోచనిపోవడంతో ఉప ఎన్నిక జరుపుతున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.....
ఉప ఎన్నికలు జరగనున్న జెహనాబాద్, భాభువా అసెంబ్లీ స్థానాలుకూడా బీహార్ లోనివే. దీంతో ొక లోక్ సభ రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం జేడీయూ, బీజేపీ కూటమికి ప్రతిష్టాత్మకం కానుంది. అదేసమయంలో ఇక్కడ గెలుపు విపక్ష ఆర్జేడీకి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాధారం. పార్టీ అధినేత జైల్లో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో విజయం సాధించడం ద్వారా ప్రజల్లో తమకు పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని తలపోస్తోంది. జెహనాబాద్ లో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గెలుపొందారు. ఆయనకు 76,458 ఓట్లు రాగా, రామ్ విలాస్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి ముంద్రికాసింగ్ యాదవ్ కు 46,137 ఓట్లు మాత్రమే వచ్చాయి. భాభువా స్థానాన్ని 2015లో బీజేపీ గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ఆనంద్ భూషణ్ పాండే 50,768 ఓట్లు సాధించారు. సమీప జనతాదళ్ యు అభ్యర్థికి 43,024 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పొత్తు కుదుర్చుకున్నందున ఈ స్థానం తమదేనని బీజేపీ, జనతాదళ్ ధీమా కనబరుస్తున్నాయి. 2015లో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జేడీయూకు కేటాయించామని, తమకూ బలం ఉందని, ఈసారి నిరూపించుకుంటామని ఆర్జేడీ చెబుతోంది. 2014లో 44 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ అనంతర కాలంలో ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఊపుమీదున్న కాంగ్రెస్ ప్రస్తుత ఉప ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించాలని చూస్తోంది. తనకు బలం లేనప్పటికీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని యోచిస్తుంది. ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందో? తెలియాలంటే మార్చి 14 వరకూ ఆగక తప్పదు.
-ఎడిటోరియల్ డెస్క్