‘అమ్మ’కు తప్పదుగా?

Update: 2018-03-09 15:30 GMT

సోనియాగాంధీ మరోసారి అధినేత్రి పాత్రలోకి రావాల్సి వస్తోంది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షునిగా చురుకుగా పనిచేస్తున్నప్పటికీ ఇతర పక్షాలతో ఇబ్బందులు తప్పడం లేదు. కాంగ్రెసు పార్టీ జనరేషనల్ షిప్ట్ ను అందిపుచ్చుకునేందుకు బలమైన నేతలతో కూడిన ప్రాంతీయ పార్టీలు ఇంకా సన్నద్ధం కావడం లేదు. అందుకే అమ్మకే మరోసారి ఆ బాధ్యత తప్పడం లేదు. కొడుకు రాజకీయ వారసత్వాన్ని బలోపేతం చేసేందుకు సోనియా మరోసారి రంగప్రవేశం చేయబోతున్నారు. 2019 ఎన్నికలు ముగిసే వరకూ ఈ పాత్ర తప్పకపోవచ్చు. ఈనెల 13న దేశంలోని వివిధ రాజకీయపక్షాలతో బీజేపీయేతర ఫ్రంట్ ఆవశ్యకతపై సమావేశం కానున్నారు. సోనియా గాంధీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. దీనిని కీలకమైన సమావేశంగా కాంగ్రెసు పార్టీ అభివర్ణిస్తోంది. యూపీఏలో ప్రధానపక్షమైన కాంగ్రెసు అధ్యక్షునిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విపక్షాల ఐక్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన పని ఆయనదే. కానీ సీనియర్లు నాయకత్వం వహిస్తున్న యూపీఏలోని కొన్ని పార్టీలను ఎలా డీల్ చేయాలో ఆయనకు తెలియడం లేదు. కొత్త మిత్రులను చేర్చుకోవడంపైనా క్లారిటీ లేదు. దీంతో సోనియానే రంగంలోకి దిగాల్సి వచ్చింది. 15 పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లుగా సమాచారం. ఇప్పటికీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారన్న సమాచారం చర్చనీయమవుతోంది.

కేసీఆర్ గుగ్లీతో కదలిక....

కాంగ్రెసు, బీజేపీలకు మూడో ప్రత్యామ్నాయంగా లౌకిక పార్టీల కూటమిని ఏర్పాటు చేస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి వారం రోజుల క్రితం చేసిన ప్రకటన కాంగ్రెసులో కదలిక తెచ్చింది. కేసీఆర్ ప్రకటనను బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ ఈ కూటమి రూపుదాలిస్తే ఎన్డీఏ వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీకే లాభిస్తుందనే అంచనాతో కమలం పార్టీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెసులో మాత్రం ప్రకంపనలు మొదలయ్యాయి. దక్షిణాది నుంచి ఈ బీజం పడటం ఆందోళనకు ప్రధానకారణం. దక్షిణ భారత రాష్ట్రాల్లో బీజేపీ కంటే కాంగ్రెసు పార్టీనే బలంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఏర్పాటైన తర్వాత కూడా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కూడా అధికారంలో ఉంది. పుదుచ్చేరిలోనూ కాంగ్రెసు పార్టీనే రాజ్యం చేస్తోంది. కేరళలో వామపక్షాలు ఒకసారి అధికారంలోకి వస్తే మరోసారి కాంగ్రెసు అధికారంలోకి వస్తోంది. విభజన తర్వాత ప్రస్తుతం తెలంగాణలో అధికారంపై కూడా కాంగ్రెసు పార్టీ కొంత నమ్మకాన్ని పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ రాగం దక్షిణ, ఉత్తర భేదాలు లేవనెత్తితే కాంగ్రెసు పార్టీయే ఎక్కువగా నష్టపోతుంది. ఈ పోకడకు వెంటనే అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో సోనియా ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

అందరికీ ఆహ్వానం...

దేశంలో బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలకు ప్రధాన వేదికగా యూపీఏ ఉండాలనేది సోనియా యోచన. అందుకే కేసీఆర్ కు జేఎంఎం నేతలు ఫోన్ చేశారని తెలియగానే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాము కాంగ్రెసు వెంటే నడుస్తామంటూ జేఎంఎం ప్రకటన చేయడంలో దాగి ఉన్న రహస్యం ఇదే. మమతా బెనర్జీ, వామపక్షాలతోనూ సంప్రతింపులు మొదలు పెట్టారు. వామపక్షాలు, టీఎంసీతో పెడసరి ధోరణితో వ్యవహరించడం వల్లే ఈశాన్యభారతంలోని మూడు రాష్ట్రాలు తమకు కాకుండా పోయాయని కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా 2019 నాటికి విపక్షాలన్నీ బలపడేలా వ్యూహం సిద్దం చేయాలనుకుంటోంది. అవసరమైతే కొన్ని త్యాగాలకు సిద్దపడి అయినా మోడీని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నిరోధించడం రాజకీయ అవసరంగా కాంగ్రెసు గుర్తించింది. టీడీపీని కూడా ఈ కూటమిలోకి లాగగలిగితే ప్రయోజనం ఉంటుందనేది ఆ పార్టీ భావన. అందుకే తాము అధికారంలోకి వచ్చాక ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తూ తొలి సంతకం చేస్తామంటూ రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటించారు. ఈ సెంటిమెంటుతో టీడీపీని కూడా ఆకట్టుకోవాలనేది ఎత్తుగడ.

ఘర్ వాపసీ...

వివిధ కారణాలతో పార్టీని విడిచి పెట్టి పోయిన వారిని తిరిగి కాంగ్రెసులోకి ఆహ్వానించేందుకు పక్కా వ్యూహం సిద్దం చేయాలని సోనియా, రాహుల్ యోచిస్తున్నారనేది పార్టీ వర్గాల సమాచారం. ఇతర పార్టీల సీనియర్లను గౌరవప్రపత్తులతో డీల్ చేయడంతోపాటు గతంలో పార్టీలో పనిచేసి వెళ్లిపోయిన వారిని తిరిగి సొంతగూటికి తెచ్చుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. మార్చి 16 వ తేదీన నిర్వహించనున్న ప్లీనరీలో ఇందుకు సంబంధించి పక్కావ్యూహం కూడా సిద్దం చేయనున్నట్లు తెలుస్తోంది. హిమంతబిశ్వ శర్మ పార్టీని విడిచిపెట్టి వెళ్లిన తర్వాత అస్సాంతోపాటు త్రిపుర , ఈ శాన్య రాష్ట్రాల్లో పార్టీ బాగా దెబ్బతిన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నారాయణ్ దత్ తివారీ, రీటా బహుగుణ జోషి, చౌదరి వీరేంద్ర సింగ్, విజయ బహుగుణ,రావు ఇంద్రజిత్ వంటి నాయకులు పార్టీని విడిచిపెట్టడంలో అధిష్టానం పొరపాట్లు ఉన్నాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సైతం వాదనాపటిమ , ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులు పార్టీని వదిలేశారు. వారందర్నీ కూడగట్టే యత్నాలు కూడా ఆరంభమయ్యాయి. కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, కన్నాలక్ష్మీనారాయణ, సబ్బం హరి, ఉండవల్ల అరుణ్ కుమార్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తమ్మీద కాంగ్రెసు పార్టీ ఎన్నికలకు తయారయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లే లెక్క. ప్లీనరీలో ఇందుకు శంఖారావం పూరించనున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News