అంతా ఆ తాను ముక్కలే...అయ్యే పనేనా?

Update: 2017-11-02 15:30 GMT

‘తీవ్ర నేరాల్లో శిక్షకు గురైన శాసనకర్తలు జీవితకాలం చట్ట సభల గడప తొక్కకుండా నిషేధం విధించాలి. ప్రజాజీవితంలో ఉన్న వారిపై వచ్చే అభియోగాలను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు నెలకొల్పాలి. ఆయా కేసులను ఏడాదిలోపుగానే పరిష్కరించాలి.‘ ఈ వాదనలు చాలాకాలంగా వినవస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి 2013 తర్వాత బాగా పుంజుకున్నాయి. అయితే గడచిన నాలుగేళ్లుగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. అధికారం దక్కించుకోవడం కోసం అన్ని అడ్డదారులూ తొక్కాలనేది పార్టీల ఏకాభిప్రాయం. పైకి ఏం చెప్పినా ఆచరణలో అమలు చేసి చూపుతున్నది మాత్రం అక్షరాలా అక్రమార్కులను ప్రోత్సహించడమే. అంగబలం, అర్థబలం దానికి తోడు అవసరమైన సందర్బంలో దండబలం చూపగల వారికి ఎంతటి నేర చరిత్ర ఉన్నా టిక్కెట్లు ఇచ్చేందుకు పార్టీలు వెనకాడటం లేదు. గెలుపు ఒక్కటే సర్వప్రామాణికం. తమ పార్టీకి విజయం సాధించి పెట్టేవారిని అందలం ఎక్కిస్తున్నారు. ఈ విషయంలో జాతీయ,ప్రాంతీయ పార్టీలన్న భేదం లేదు. అందరిదీ ఒకటే మాట. ఒకే బాట. అందుకే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పులు, ఎన్నికల సంఘం విన్నపాలు, లాకమిషన్ సూచనలు ఎగతాళి పాలవుతున్నాయి. ఎగవేతకు గురవుతున్నాయి.

ప్రత్యేక న్యాయస్థానాలు పట్టాలెక్కేనా?

చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారిపై తీవ్రమైన నేరాలు ఉంటే చెడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని చాలాకాలంగా సుప్రీం కోర్టు చెబుతోంది. కానీ ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా ఆరువారాల్లో ఈ విషయమై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ కేంద్రప్రభుత్వాన్ని సుప్రీం నిలదీసింది. జాతి ప్రయోజనాలకు, ప్రజాస్వామ్యానికి, చట్టబద్ధ పాలనకు ఎంపీలు, ఎమ్మెల్యేలు పూచీకర్తలు. వారిపైనే నేరాభియోగాలుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. చట్టాలు చేసేవారే నేరచరితులైతే అంతకంటే దౌర్బాగ్యం మరొకటి ఉండదు. దొంగచేతికే తాళాలు ఇవ్వకూడదన్న సూత్రం ఉండనే ఉంది. అయితే రాజకీయ అవసరాలకోసం వివిధ పార్టీలు నేరచరితులను ఎన్నికల్లో ప్రోత్సహిస్తున్నాయి. సామదానభేదదండోపాయాలతో ప్రజలను భయపెట్టి లేదా ప్రలోభపెట్టి ఓట్లు సంపాదించగల సామర్థ్యాన్నే టిక్కెట్లు ఇచ్చేందుకు ప్రధాన అర్హత గా పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ప్రతి ఎన్నికకు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశంలో 29 రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేస్తున్నవారిని తీసుకుంటే సగటున 34 శాతం మంది తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నారు.కేంద్రస్థాయిలో చూస్తే 2004 లో ఎన్నికైన పార్లమెంటు సభ్యుల్లో 124 మందిపై కేసులుండగా 2009 లో ఎన్నికైన వారిలో 158 మంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారు. 2014 లో ఎన్నికైన ఎంపీల్లో ఈ సంఖ్య 186 కి పెరిగింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెసు సభ్యుల్లోనూ ఈ సంఖ్య అధికంగానే ఉంది. బీజేపీ ఎంపీలు 63 మంది కాంగ్రెసు ఎంపీలు 44 మంది క్రిమినల్ రికార్డు కలిగి ఉన్నారు.

రాహుల్ స్ఫూర్తి రాళ్లపాలు....

నేరం నిరూపితమైన వారు చట్టసభ సభ్యులుగా అర్హత కోల్పోతారంటూ 2013లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై అప్పటి యూపీఏ ప్రభుత్వం అత్యవసరంగా ఒక ఆర్డినెన్సును తెచ్చి శిక్షపడినప్పటికీ పైకోర్టుకు అప్పీలు చేసుకుంటే చాలు అనర్హత వేటు పడకుండా చూడాలని దుష్టవ్యూహం పన్నింది. కేంద్రప్రభుత్వం పరువు బజారున పడుతుందని తెలిసినా రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని బహిరంగంగానే నిరసించారు. ఆర్డినెన్సు కాపీలను మీడియా సమావేశంలోనే చించిపారేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నత విలువలు నెలకొల్పాలంటే ఇలాంటి విషయాల్లో రాజీ పడకూడదంటూ కుండబద్దలు కొట్టారు. కానీ ఆ తర్వాత ఆ స్ఫూర్తి మాత్రం కాంగ్రెసులో కనిపించలేదు. యూపీ ఏ ప్రభుత్వం ఆర్డినెన్సు చేస్తోందని తెలిసి నానాయాగీ చేసిన బీజేపీలోనూ ఆతర్వాత కాలంలో ద్వంద్వవైఖరే తొణికిసలాడింది. లేకపోతే ఆయా పార్టీల తరఫున 2014 ఎన్నికల్లో భారీగా నేరచరితులు బరిలో నిలిచే అవకాశం ఉండేది కాదు.

కలగూరగంప చేసేద్దామా?

ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేసే కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. వాటికే ప్రజాప్రతినిధుల కేసుల బాధ్యత కూడా అప్పగించేస్తే సరిపోతుందనే కోణంలో కేంద్రప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సీబీఐ కేసుల్లోనే తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఇంక ప్రజాప్రతినిధుల కేసులు కూడా తోడైతే ఏళ్లూపూళ్లూ పడతాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కేసునే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఒకవైపు చేసినట్లు ఉండాలి. మరోవైపు తమ ప్రతినిధులను ఇబ్బంది పెట్టకూడదు. మధ్యేమార్గంలో తంతు ముగించేయాలనేది కేంద్ర పెద్దల పన్నాగం. అయితే సుప్రీం కోర్టు మాత్రం కొంత సీరియస్ గానే స్పందిస్తోంది. ప్రజాప్రతినిధుల కేసుల విషయంలో ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు, నియామకాలు, బడ్జెట్ కేటాయింపులతో ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. న్యాయబద్దమైన ఈ సూచనను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా? లేక దీనికి ప్రత్యామ్నాయంగా సుప్రీం తీర్పును సైతం తిప్పికొట్టే రీతిలో పార్లమెంటులోనే ప్రత్యేక చట్టం చేస్తుందా? వేచి చూడాలి. న్యాయవ్యవస్థతో పోరాడేందుకు నిత్యం కలహించుకునే వివిధ పక్షాలు ఆత్మ రక్షణ నిమిత్తం చేతులు కలిపి అఖిలపక్ష ఏకాభిప్రాయాన్ని సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News